Share News

మరింత అభివృద్ధి

ABN , First Publish Date - 2023-11-23T22:43:20+05:30 IST

రాష్ట్రంలో మూడోసారి బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాబోతోందని, డిసెంబర్‌ మూడు తర్వాత మరిన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమల్లోకి వస్తాయని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. గురువారం నారాయణపేట జిల్లా మక్తల్‌లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి చిట్టెం రామ్మోహన్‌రెడ్డి తరఫున రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌కు ఎమ్మెల్యే గజమాలతో స్వాగతం పలికారు.

మరింత అభివృద్ధి
రోడ్‌షోలో మాట్లాడుతున్న కేటీఆర్‌

మక్తల్‌ రోడ్‌షోలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

రామ్మోహన్‌రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి

మక్తల్‌, నవంబరు 23: రాష్ట్రంలో మూడోసారి బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాబోతోందని, డిసెంబర్‌ మూడు తర్వాత మరిన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమల్లోకి వస్తాయని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. గురువారం నారాయణపేట జిల్లా మక్తల్‌లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి చిట్టెం రామ్మోహన్‌రెడ్డి తరఫున రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌కు ఎమ్మెల్యే గజమాలతో స్వాగతం పలికారు. మక్తల్‌ చౌరస్తాలో జరిగిన కార్నర్‌ మీటింగులో కేటీఆర్‌ మాట్లాడారు. కాంగ్రెస్‌ నాయకుడు రేవంత్‌రెడ్డి వ్యవసాయానికి మూడు గంటల కరెంటు చాలని, పది హెచ్‌పీ మోటర్లు రైతులు వినియోగిస్తారని మాట్లాడుతున్నారని అన్నారు. ఆయనకు వ్యవసాయం తెలియదని, అందుకే ఇలా తెలివిలేకుండా మాట్లాడుతున్నా రని దుయ్యబట్టారు. మరో నాయకుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రైతుబంధు వేస్టంటున్నారని.. రైతుబంధు వృథా పథకమా? అని ప్రశ్నించారు. మరో నాయకుడు భట్టి విక్రమార్క ధరణిని రద్దు చేసి, మళ్లీ పట్వారీల వ్యవస్థే తేవాలంటున్నారని, దళారులతో మళ్లీ గోస పడాలా? అని నిలదీశారు. కాంగ్రెస్‌ చెబుతోన్న ఇందిరమ్మ రాజ్యం మళ్లీ వస్తే కరెంటు కోతలు, ఎరువుల కోసం, విత్తనాల కోసం క్యూలైన్లు తప్పవని హెచ్చరించారు. 55 ఏళ్లు పాలించినది చాలక మళ్లీ ఒక్క ఛాన్స్‌ అంటూ వస్తున్నారని, 55 ఏళ్లలో ఏనాడైనా ప్రజల గురించి పట్టించుకున్నారా? అని నిలదీశారు. కాలిపోయే మోటర్లు, పేలిపోయే ట్రాన్స్‌ఫార్మర్లు, రైతుల ఆత్మహత్యలే తప్పవారి పాలనలో రైతులకు చేసిందేంటని ప్రశ్నించారు. మళ్లీ బీఆర్‌ఎస్‌ సర్కార్‌ వస్తే ఆడబిడ్డలకు సౌభాగ్యలక్ష్మి పథకం కింద నెలకు రూ.3,000 ప్రోత్సాహకం ఇస్తామని, పింఛన్లను పెంచుతామని, రేషన్‌కార్డు ఉన్నవారందరికీ సన్న బియ్యమే ఇస్తామని ప్రకటించారు. అంతేకాకుండా కేసీఆర్‌ బీమా పథకం కింద రూ.ఐదు లక్షల బీమా సదుపాయం కల్పిస్తామని తెలిపారు. రైతుబంధును రూ.16 వేలకు పెంచుతామని వెల్లడించారు. ఎన్నికలు దగ్గరికొచ్చేకొద్దీ పుకార్లు పెరుగుతాయని, ఎవరూ నమ్మవద్దని అన్నారు. సోషల్‌ మీడియాని అసలే నమ్మవద్దని హెచ్చరించారు. మళ్లీ సీఎం కేసీఆరే వస్తారని, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే వస్తుందని ఽధీమా వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి స్వయంగా కొడంగల్‌లో ఓడిపోతున్నారని, ఆయనే ఓడాక కాంగ్రెస్‌ ఎక్కడుంటుందని ప్రశ్నించారు.

మక్తల్‌ రెవెన్యూ డివిజన్‌పై హామీ

మక్తల్‌లో ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి వారి తండ్రి నర్సిరెడ్డి బాటలో ప్రజాసేవ చేస్తున్నారని, ఆయనను మళ్లీ గెలిపిస్తే పెండింగ్‌లో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని కేటీఆర్‌ హామీ ఇచ్చారు. మక్తల్‌ను రెవెన్యూ డివిజన్‌ చేస్తామని, ఆత్మకూరులో 100 పడకల ఆస్పత్రి కట్టిస్తామని చెప్పారు. ముంపు గ్రామాలకు ఆర్‌అండ్‌ఆర్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఊట్కూరులో ఉర్దూ మీడియం పాఠశాలను, మునిసిపాలిటీల్లో స్టేడియాలు నిర్మిస్తామని అన్నారు. ఇతర అన్ని పనులు పూర్తి చేస్తామని కేటీఆర్‌ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీ మన్నెశ్రీనివాస్‌రెడ్డి, శాట్స్‌ చైర్మన్‌ ఆంజనేయగౌడ్‌, చిట్టెం సుచరితారెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-23T22:43:21+05:30 IST