Share News

మీరు పెంచిన మొక్కని పిల్లలమర్రి స్థాయికి ఎదిగా

ABN , First Publish Date - 2023-11-26T23:07:40+05:30 IST

‘నేను పాలమూరు బిడ్డలు నాటిన మొక్కను. మీరు పెంచి పోషించిన ఈ మొక్క పిల్లల మర్రి స్థాయికి ఎదిగింది. ఎందరో హేమాహేమీలున్న కాంగ్రెస్‌లో సోనియా తనకు పీసీసీ అధ్యక్షుడిగా అవకాశమిచ్చినందునే ఈరోజు 119 నియోజకవర్గాలకు బీ ఫారాలిచ్చే స్థాయికి వచ్చా. మీ ఆశీర్వాదంతో ఎదిగిన ఈ వృక్షాన్ని నరికేందుకు భుజాన గొడ్డళ్లేసుకొని వస్తున్న కేసీఆర్‌, హరీశ్‌, కేటీఆర్‌లకు సోయిలేని శ్రీనివాస్‌గౌడ్‌ లాంటి మన జిల్లా నాయకులు మద్దతిస్తున్నారు. భుజాన గొడ్డళ్లేసుకొని వస్తున్నవారి పార్టీని ఈ గడ్డపై 100 మీటర్ల లోతులో గుంత తీసి బొందపెట్టండి.’’ అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు.

మీరు పెంచిన మొక్కని పిల్లలమర్రి స్థాయికి ఎదిగా
మహబూబ్‌నగర్‌లో మాట్లాడుతున్న టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి

పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి

పాలమూరులో సౌమ్యుడు యెన్నం శ్రీనివాస్‌రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి

బెదిరింపులకు పాల్పడితే గుడ్లుపీకి గోలీలాడుతానని హెచ్చరిక

మహబూబ్‌నగర్‌, నవంబరు 26 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): ‘నేను పాలమూరు బిడ్డలు నాటిన మొక్కను. మీరు పెంచి పోషించిన ఈ మొక్క పిల్లల మర్రి స్థాయికి ఎదిగింది. ఎందరో హేమాహేమీలున్న కాంగ్రెస్‌లో సోనియా తనకు పీసీసీ అధ్యక్షుడిగా అవకాశమిచ్చినందునే ఈరోజు 119 నియోజకవర్గాలకు బీ ఫారాలిచ్చే స్థాయికి వచ్చా. మీ ఆశీర్వాదంతో ఎదిగిన ఈ వృక్షాన్ని నరికేందుకు భుజాన గొడ్డళ్లేసుకొని వస్తున్న కేసీఆర్‌, హరీశ్‌, కేటీఆర్‌లకు సోయిలేని శ్రీనివాస్‌గౌడ్‌ లాంటి మన జిల్లా నాయకులు మద్దతిస్తున్నారు. భుజాన గొడ్డళ్లేసుకొని వస్తున్నవారి పార్టీని ఈ గడ్డపై 100 మీటర్ల లోతులో గుంత తీసి బొందపెట్టండి.’’ అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి యెన్నం శ్రీనివాస్‌రెడ్డి తరఫున ఆదివారం మహబూబ్‌నగర్‌ పట్టణంలోని గడియారం చౌరస్తా వద్ద కార్నర్‌ మీటింగు నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ తనను జడ్పీటీసీ సభ్యునిగా, ఎమ్మెల్సీగా స్వతంత్ర అభ్యర్థిగా గెలిపించారని, రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా పాలమూరు ప్రజలు ఆదరించారని అన్నారు. మీ ఆశీర్వాదంతోనే ఎంపీగానూ గెలిచానని చెప్పారు. ఈ జిల్లాను సీఎం కేసీఆర్‌ మోసం చేశారని, ఇక్కడ సాగునీరు రావాలన్నా, నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రావాలన్నా, వలసలు ఆగాలన్నా ఇందిరమ్మ రాజ్యం రావాలని చెప్పారు. పాలమూరు గడ్డపై యెన్నం శ్రీనివాస్‌రెడ్డిని 25 వేల మెజార్టీతో గెలిపిస్తే.. రాబోయే ప్రభుత్వంలో అవన్నీ సాధిస్తామని తెలిపారు.

కాంగ్రెస్‌ కార్యకర్తల్ని భయపెట్టేవారి చర్మం వలుస్తాం

పాలమూరు ప్రజలు రాబోయే రోజుల్లో ఎవరికీ భయపడాల్సిన పనిలేదని, ఎవరు బెదిరింపులకు పాల్పడ్డా వాళ్ల గుడ్లుతీసి గోలీలాడుతామని అన్నారు. కాంగ్రెస్‌ కార్యకర్తల్ని భయపెట్టేవారి చర్మం వలుస్తామని హెచ్చరించారు. రాబోయే కాంగ్రెస్‌ ప్రభుత్వంలో తెలంగాణకే ఆదర్శ జిల్లాగా పాలమూరును తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఈ జిల్లాలో 14కి 14 సీట్లు కాంగ్రెస్‌ అభ్యర్థుల్ని గెలిపించాలని విన్నవించారు. మైనారిటీ సోదరులు ఈ పదేళ్లలో ఏం మోసపోయారో గ్రహించాలని కోరారు. కాంగ్రెస్‌ హయాంలో నాలుగు శాతం రిజర్వేషన్‌ అమలు చేశామని, 12 శాతం రిజర్వేషన్‌ ఇస్తామని సీఎం కేసీఆర్‌ మోసం చేశారని అన్నారు. హైదరాబాద్‌ నిజాం హయాంలో సెక్రటేరియట్‌లో కట్టిన రెండు మస్జిద్‌లను ఈ సర్కార్‌ తొలగించిందని అన్నారు. ఈ దేశంలో ప్రధాని మోదీ విద్వేషాలను రెచ్చగొడితే, రాహుల్‌గాంధీ ప్రేమను పంచుతూ కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు 4,000 కిలో మీటర్ల పాదయాత్ర చేసి, ప్రేమ దుకాణం తెరిచారని వివరించారు. తెలంగాణలో రాబోయే కాంగ్రెస్‌ ప్రభుత్వం సెక్యులర్‌ ప్రభుత్వంగా ఉంటుందని హామీ ఇచ్చారు.

ముదిరాజ్‌లను బీసీ ఏలోకి మారుస్తాం

ముదిరాజ్‌లను బీసీ డీ నుంచి బీసీ ఏలోకి మారుస్తామని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ముదిరాజ్‌లకు 119 స్థానాల్లో ఒక్క సీటూ ఇవ్వలేదని, కాంగ్రెస్‌ నుంచి తాము మూడుసీట్లు ఇచ్చామని, ప్రభుత్వం ఏర్పాటయ్యాక కూడా ఎమ్మెల్సీ పదవులు, కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు. యాదవులు డీడీలు తీసినా గొర్రెలివ్వకుండా సీఎం కేసీఆర్‌ మోసం చేశారని అన్నారు. వారికి కాంగ్రెస్‌ అన్ని విధాలా సంక్షేమం అందిస్తుందన్నారు. పాలమూరులో అన్నదమ్ముళ్లిద్దరూ కలిసి శాండ్‌, ల్యాండ్‌, మైన్‌, వైన్‌లన్నింటినీ చెరబట్టి దోచుకుంటున్నారని ఆరోపించారు. ఇక్కడ సౌమ్యుడు, ఈ ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారని, ఆయన్ని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సీటులో యెన్నం శ్రీనివాస్‌రెడ్డిని నిలబెట్టాలని అధిష్ఠానం నిర్ణయించినప్పుడు ఇక్కడ ఎంతోకాలంగా పార్టీకి సేవలందిస్తోన్న సీనియర్‌ నాయకుడు ఒబేదుల్లా కొత్వాల్‌ పెద్ద మనసు చేసుకొని ముందుకొచ్చి, శ్రీనివాస్‌రెడ్డి కోసం పనిచేస్తున్నారన్నారు. ఎన్‌పీ వెంకటేశ్‌, సంజీవ్‌ముదిరాజ్‌, వినోద్‌కుమార్‌, సురేందర్‌రెడ్డి కూడా శ్రమిస్తున్నారని కొనియాడారు. సభలో మునిసిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ రాధా అమర్‌, కౌన్సిలర్‌ ఆనంద్‌కుమార్‌గౌడ్‌, లక్ష్మణ్‌యాదవ్‌, బెక్కరి అనితా మఽధుసూదన్‌రెడ్డి, సీజే బెనహర్‌, సిరాజ్‌ఖాద్రి, మల్లు నరసింహారెడ్డి, యూత్‌ కాంగ్రెస్‌ చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

బంగారు పాలమూరుగా మారుస్తాం

పాలమూరులో 75 ఏళ్లలో అభివృద్ధి జరగలేదని, ఈరోజు రేవంత్‌రెడ్డిపైనే అందరి ఆశలున్నాయని మహబూబ్‌నగర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆయన నాయకత్వంలో పాలమూరు అభివృద్ధి జరుగబోతోందని, బంగారు పాలమూరుగా మారుతుందని పేర్కొన్నారు. ఇక్కడి బీడు భూములకు నీరందుతుందని, పరిశ్రమలు వస్తాయని, ఇక్కడి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కుతాయని అన్నారు. ఈ ఎన్నికల్లో పాలమూరులో 14కి 14 సీట్లు గెలిచి, రేవంత్‌కు మద్దతుగా నిలుద్దామని యెన్నం శ్రీనివాస్‌రెడ్డి కోరారు.

Updated Date - 2023-11-26T23:07:41+05:30 IST