Share News

కాంగ్రెస్‌కు ఓటేస్తే ఆగమైతం

ABN , First Publish Date - 2023-11-19T23:13:54+05:30 IST

పదేంళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో పాలమూరు పచ్చబడుతోందని, అధికారంలోకి వచ్చాక కూడా ఏళ్ల తరబడి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును నాన్చిన కాంగ్రెస్‌కు ఓటు వేస్తే మళ్లీ మన బతుకులు ఆగమవుతాయని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం కొల్లాపూర్‌, నాగర్‌కర్నూల్‌, కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్‌ పాల్గొని ప్రసంగించారు.

కాంగ్రెస్‌కు ఓటేస్తే ఆగమైతం
నాగర్‌కర్నూల్‌ సభలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్‌

ఇందిరమ్మ రాజ్యంలో ఆకలి చావులు, ఎన్‌కౌంటర్లు

కొల్లాపూర్‌, నాగర్‌కర్నూల్‌, కల్వకుర్తి ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్‌

నాగర్‌కర్నూల్‌/కొల్లాపూర్‌/కల్వకుర్తి, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): పదేంళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో పాలమూరు పచ్చబడుతోందని, అధికారంలోకి వచ్చాక కూడా ఏళ్ల తరబడి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును నాన్చిన కాంగ్రెస్‌కు ఓటు వేస్తే మళ్లీ మన బతుకులు ఆగమవుతాయని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం కొల్లాపూర్‌, నాగర్‌కర్నూల్‌, కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్‌ పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్‌ హయాంలో ప్రాజెక్టులన్నీ పెండింగ్‌లో ఉన్నాయని, ప్రత్యేక రాష్ట్రం సిద్ధించాకే వాటిల్లో కదలిక వచ్చిందని స్పష్టం చేశారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాతో పాటు మరో ఏడు జిల్లాలు బంగారు తునకగా మారనున్నాయని ఆయన పేర్కొన్నారు. పాలమూరు జిల్లాతో తనకు ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని వివరించిన కేసీఆర్‌ తాను మహబూబ్‌నగర్‌ ఎంపీగా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్ర కల సాకారమైన అంశాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ 58 ఏళ్ల పాలనలో మహబూబ్‌నగర్‌ జిల్లా అథోగతి పాలైన విషయం వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు. జిల్లాలో రెండు జీవ నదులు ప్రవహిస్తున్నా అప్పట్లో ఏడారిగా మారడం వెనుక కాంగ్రెస్‌ బాధ్యత లేదా అని అన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయకుండా 30 ఏళ్లు కోత పెట్టిన కాంగ్రెస్‌కు జిల్లా బాగోగుల గురించి ప్రశ్నించే అధికారం ఉందా? ఆయన సవాల్‌ చేశారు. ప్రాజెక్టుల పూర్తితో మహబూబ్‌నగర్‌ జిల్లా ధాన్యాగారంగా మారిందని స్పష్టం చేశారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో పాలమూరులో వ్యవసాయ స్వరూప స్వభావం పూర్తిగా మారిపోనుందన్నారు. బీఆర్‌ ఎస్‌ అధికారంలోకి వచ్చాకే జిల్లాలో వలసలు ఆగిపోయిన విషయం వాస్తవం కాదా అని అన్నారు. రైతుబంధు, వ్యవసాయానికి 24 గంటల కరెంటు అవసరమా? అని రేవంత్‌రెడ్డి, భట్టివి క్రమార్క లాంటి నాయకులు ప్రశ్నిస్తున్నారని, ఈ పథకాలను అమలు చేయడం ద్వారా రైతుల జీవితాల్లో భరోసా కల్పించడం నేరమా అని కేసీఆర్‌ దుయ్యబట్టారు. వ్యవసాయానికి మూడు గంటల కరెంటు సరిపోతుందని చెబుతున్న రేవంత్‌రెడ్డి 38 వేల కోట్ల రూపాయల వ్యయంతో 10 హెచ్‌పీ సామర్థ్యం గల మోటార్లను రైతులకు అందజేస్తారా? అని ఆయన ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యం తెస్తామని చెబుతున్న కాంగ్రెస్‌ నాయకులు ఆ పాలనలో విశిష్టతలు ఏమిటో తెలంగాణ సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఇందిరమ్మ రాజ్యమంటే ఆకలి చావులు, ఎన్‌కౌంటర్లకు ప్రసిద్ధి అని, అలాంటి రాజ్యం తేస్తారా? అని కాంగ్రెస్‌ నాయకులను కడిగిపారేశారు. కొల్లాపూర్‌లో బీరం హర్షవర్ధన్‌ రెడ్డిని, నాగర్‌కర్నూల్‌లో మర్రి జనార్దన్‌రెడ్డిలను గెలిపిస్తే నెల రోజుల్లో ఇంజనీరింగ్‌ కళాశాలలను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి నియోజకవర్గ అభివృద్ధి విషయంలో ప్రత్యేక శ్రద్ధ, చొరవ చూపుతున్నారని ప్రశంసిం చారు. బిజినేపల్లి మండలంలో మార్కండేయ రిజర్వాయర్‌కు నాలుగు రోజుల క్రితమే ట్రయల్‌ రన్‌ పూర్తయ్యిం దన్నారు. నాగర్‌కర్నూల్‌ సభలో ప్రజా ఆశీర్వాద సభలో జడ్పీ చైర్‌పర్సన్‌ శాంతాకుమారి, ఎంపీ పోతుగంటి రాములు, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు జక్కారఘునందన్‌ రెడ్డిలు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-19T23:13:56+05:30 IST