Share News

18 నెలల్లో సోమశిల వంతెన పూర్తి

ABN , First Publish Date - 2023-11-25T23:17:45+05:30 IST

తెలంగాణలో బీజేపీ అధికా రంలోకి వచ్చిన 18 నెలల్లో కల్వకుర్తి నుంచి కర్వెన వరకు జాతీయ రహదారి, సోమశిల -సిద్దేశ్వరం కొండల మధ్య కృష్ణానదిపై ప్రపంచంలోనే అతి పెద్ద రెండవ తీగల వంతెన నిర్మాణం పూర్తి చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చెప్పారు.

18 నెలల్లో సోమశిల వంతెన పూర్తి
సభలో అభివాదం చేస్తున్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా, కొల్లాపూర్‌ అభ్యర్థి ఎల్లేని సుధాకర్‌రావు తదితరులు

కల్వకుర్తి నుంచి కర్వెన వరకు జాతీయ రహదారి కూడా..

మా ప్రభుత్వంలోనే శ్రీశైలం నిర్వాసితుల సమస్యలు పరిష్కారం

కొల్లాపూర్‌ మామిడి రుచులను యూరప్‌కు తీసుకుపోతాం

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా వెల్లడి

కొల్లాపూర్‌, నవంబరు 25: నాగర్‌ కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ బీజేపీ అభ్యర్థి ఎల్లేని సుధాకర్‌రావు తరఫున కొల్లాపూర్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో శనివారం సకలజనుల విజయ సంకల్ప సభ నిర్వహించారు. బీజేపీ అసెంబ్లీ కన్వీనర్‌ శ్రీనివాస్‌యాదవ్‌ అధ్యక్షతన వహించిన ఈ సభకు అమిత్‌షా ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 40 ఏళ్ల కిందట శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంలో సర్వం కోల్పోయిన నిర్వాసిత కుటుంబాల(98 జీవో బాధితులు)కు బీజేపీ ప్రభుత్వంలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. కొల్లాపూర్‌ నియోజకవర్గంలో వాల్మీకి బోయ, మాదాసి, మాదారి కుర్వలకు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలు ఏమీ చేయలేదని, మాదాసి, వాల్మీకి బోయల సమస్యలను తాము పరిష్కరిస్తామని వెల్లడించారు. తెలంగాణలో బీసీ అభ్యర్థి బీజేపీ సీఎం అవుతారని చెప్పారు. కొల్లాపూర్‌ నియోజకవర్గంలో మామిడి రైతుల సమస్యలు పరిష్కరించేందుకు మామిడి ప్రాసెసింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. కొల్లాపూర్‌ మామిడి రుచులను యూరప్‌కు తీసుకుపోయేలా కృషి చేస్తామని మామిడి రైతులకు హామీ ఇచ్చారు. అదేవిధంగా చిన్నంబావి మండల కేంద్రంలో వెల్టూరు గుందిమల్ల ప్రాజెక్టు పూర్తి చేస్తామని అన్నారు. ఎస్సీ రిజర్వేషన్‌ సమస్యకు బీజేపీ ప్రభుత్వంలోనే శాశ్వత పరిష్కారం చూపుతామని స్పష్టం చేశారు. తెలంగాణలో నిరుద్యోగులు ఉపాధి లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, కొల్లాపూర్‌లోనూ నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. నిరుద్యోగుల ఆత్మహత్యల పట్ల కేసీఆర్‌కు ఎలాంటి చింతా లేదని, కేసీఆర్‌ ప్రేమంతా కేటీఆర్‌ను సీఎం చేయడంలోనే ఉందని ఎద్దేవా చేశారు. బీజేపీ అభ్యర్థి ఎల్లేని సుధాకర్‌రావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, 2024లో మోదీని ప్రధానమంత్రిని చేయాలని కోరారు. కొల్లాపూర్‌ ప్రజల చిరకాల కోరిక జాతీయ రహదారి, కృష్ణానదిపై వంతెన నిర్మాణానికి కేంద్రం నిధులు మంజూరు చేయడంతో అభ్యర్థి ఎల్లేని సుధాకర్‌రావు అమిత్‌షాకు కొల్లాపూర్‌ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలి పారు. శాలువా, పూల మాలలతో ఘనంగా సన్మానించారు.

బీజేపీకి ఒక్కసారి అవకాశమివ్వండి: ఎల్లేని

కొల్లాపూర్‌ నియోజకవర్గ అభివృద్ధి కోసం బీజేపీకి నియోజకవర్గ ప్రజలు ఒక్కసారి అవకాశమివ్వాలని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎల్లేని సుధాకర్‌రావు కోరారు. తాను కొల్లాపూర్‌ బాగుకోసం రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. కొల్లాపూర్‌లో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ల ఇద్దరు తోడుదొంగలను తరిమికొట్టండని ప్రజలు పిలుపునిచ్చారు. మొన్నటి వరకు ఒకే పార్టీలో ఉన్న వారు ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి పోతారని, తాను మొదటి నుంచి నమ్మిన పార్టీలో ఉంటూ.. కొల్లాపూర్‌ ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నానన్నారు. బీజేపీని గెలిపిస్తే గద్వాల శక్తిపీఠం నుంచి వెల్టూరు గుందిమల్ల మీదుగా వయా చిన్నంబావి, కొల్లాపూర్‌, అచ్చంపేట, దేవరకొండ వరకు మరో జాతీయ రహదారి, జడ్చర్ల నుంచి వయా కొల్లాపూర్‌ మీదుగా నంద్యాల వరకు రైల్వేలైన్‌, కొల్లాపూర్‌లో 100 పరిశ్రమలు ఏర్పాటు చేయిస్తానని అన్నారు. బీజేపీతోనే కొల్లాపూర్‌ అభివృద్ధి సాధ్యమన్నారు. దొంగల చేతుల్లో మోసపోవద్దని, బీజేపీకి ఒక్కసారి అవకాశమిస్తే నీతిగా, నిజాయితీగా కొల్లాపూర్‌ అభివృదిఽ్ధ కోసం పని చేస్తానన్నారు. దేశంలోనే నెంబర్‌వన్‌ స్థానంలో కొల్లాపూర్‌నును నిలుపుతానన్నారు.

సభకు అధికంగా హాజరైన ప్రజలు

సకల జనుల విజయ సంకల్ప సభకు నియోజకవర్గంలోని బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చా రు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు. సభకు మహిళలు ఎక్కువగా వచ్చారు. సభా ప్రాంగణమంతా కమలం కండువాలు, జెండాలతో రెపరెపలాడింది. కార్యక్రమంలో బీజేపీ కొల్లాపూర్‌ ఎన్నికల ఇన్‌చార్జి నరేష్‌కుమార్‌, బీజేపీ రాష్ట్ర నాయకుడు తమటం శేఖర్‌గౌడ్‌, జలాల శివుడు, నాయకులు సింగోటం రామన్న, రోజారమణి, మూలే భరత్‌చంద్ర, అన్వేష్‌, అక్కల రామన్‌గౌడ్‌, ఎల్లేని సతీమణి భారతమ్మ, కుమార్తె తేజస్విని, కాశిపురం మహేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-11-25T23:17:47+05:30 IST