Share News

నేడు కాంగ్రెస్‌, బీజేపీ పోటాపోటీ సభలు

ABN , First Publish Date - 2023-11-25T23:19:07+05:30 IST

ఎన్నికల ప్రచారానికి గడువు సమీపిస్తుండటంతో స్టార్‌ క్యాంపెయినర్ల ప్రచారం చివరి దశకు చేరింది. ఆదివారం ఉమ్మడి జిల్లాలో బీజేపీ, కాంగ్రెస్‌ పోటాపోటీ సభలు నిర్వహించనున్నాయి.

నేడు కాంగ్రెస్‌, బీజేపీ పోటాపోటీ సభలు
దేవరకద్రలో రేవంత్‌ సభ ఏర్పాట్లను పరిశీలిస్తున్న టీపీసీసీ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ అరవింద్‌ కుమార్‌రెడ్డి

పాలమూరు, కల్వకుర్తిలలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ పర్యటన

మక్తల్‌కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, కర్ణాటక సీఎం సిద్ధ రామయ్య

మహబూబ్‌నగర్‌, నారాయణపేట, దేవరకద్రల్లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ సభలు

మహబూబ్‌నగర్‌, నవంబరు 25 (ఆంరఽధజ్యోతి): ఎన్నికల ప్రచారానికి గడువు సమీపిస్తుండటంతో స్టార్‌ క్యాంపెయినర్ల ప్రచారం చివరి దశకు చేరింది. ఆదివారం ఉమ్మడి జిల్లాలో బీజేపీ, కాంగ్రెస్‌ పోటాపోటీ సభలు నిర్వహించనున్నాయి. బీజేపీ స్టార్‌ క్యాంపెయినర్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ మహబూబ్‌ నగర్‌లో బీజేపీ అభ్యర్థి ఏపీ మిథున్‌కుమార్‌రెడ్డి తరఫున ప్రచార సభలో పాల్గొననుండడంతో ఏర్పాట్లు విస్తృతంగా సాగుతున్నాయి. ఉదయం పది గంటలకు మహబూబ్‌నగర్‌కు చేరుకో నున్న యోగీ 11 గంటలకు సభలో మాట్లాడతారు. అనం తరం కల్వకుర్తిలో అభ్యర్థి తల్లోజు ఆచారి తరఫున ప్రచార సభలో ప్రసంగిస్తారు. ఉమ్మడి జిల్లాకు యోగీ ఆదిత్య నాథ్‌ మొదటిసారిగా వస్తుండ టంతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సుకత నెలకొంది. అదేవిధంగా అదేరోజు ఉదయం మక్తల్‌లో బీజేపీ అభ్యర్థి జలంధర్‌ రెడ్డి తరఫున కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ప్రచారానికి రానున్నారు. దాంతో మక్తల్‌లో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. అదే విధంగా మక్తల్‌కు కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య కూడా ఆదివారం రానున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో కాంగ్రెస్‌ అభ్యర్థి తరఫున కార్నర్‌ మీటింగ్‌లో పాల్గొననున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సైతం ఉమ్మడి జిల్లాలో అభ్యర్థుల తరఫున ఆదివారం సుడిగాలి పర్యటనకు వస్తున్నారు. ఉదయం తొమ్మిది గంటలకు నారాయణపేటలో అభ్యర్థి చిట్టెం పర్ణికారెడ్డి తరఫున సభలో పాల్గొననున్న ఆయన.. 11 గంటలకు దేవరకద్రలో అభ్యర్థి గవినోళ్ల మధు సూదన్‌రెడ్డి తరపుణ సభలో పాల్గొననున్నారు. అనంతరం మధ్యాహ్నం మహబూబ్‌నగర్‌లో అభ్యర్థి యెన్నం శ్రీనివాస్‌రెడ్డి తరఫున ప్రచారం చేయనున్నారు. అక్కడి నుంచి ఆయన నేరుగా హైదరాబాద్‌ వెళ్తారు. ఒకే రోజు కాంగ్రెస్‌, బీజేపీలకు చెందిన కీలక నాయకుల ప్రచార సభలు ఉండటంతో ఉమ్మడి జిల్లాలో ఆదివారం సభల సందడి కొనసాగనుంది.

Updated Date - 2023-11-25T23:19:08+05:30 IST