Share News

యువత చట్ట సభల్లో అడుగు పెట్టాలి

ABN , First Publish Date - 2023-11-25T23:20:21+05:30 IST

రాజకీయాలు మారాలన్నా.. సమాజం బాగుపడాలన్నా.. రాష్ట్రం, దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నా.. యువత చట్ట సభల్లో అడుగు పెట్టాలని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు.

యువత చట్ట సభల్లో అడుగు పెట్టాలి
బర్రెలక్కకు పుష్పగుచ్ఛం అందిస్తున్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

అప్పుడే సమాజం బాగుపడుతుంది..

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

కొల్లాపూర్‌ స్వతంత్ర అభ్యర్థి బర్రెలక్కకు మద్దతుగా ఎన్నికల ప్రచారం

వీపనగండ్ల, నవంబరు 25: రాజకీయాలు మారాలన్నా.. సమాజం బాగుపడాలన్నా.. రాష్ట్రం, దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నా.. యువత చట్ట సభల్లో అడుగు పెట్టాలని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. శనివారం వీపనగండ్ల మండలం బొల్లారం గ్రామంలో కొల్లాపూర్‌ స్వతంత్ర అభ్యర్థి బర్రెలక్క అలియాస్‌ శిరీషకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆమెకు పుష్పగచ్ఛం ఇచ్చి, అభినందించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ బర్రెలక్క దైర్యంగా ముందుకొచ్చి కొల్లాపూర్‌ నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలబడటం గొప్ప సాహసమన్నారు. ఆమెకు అండగా నిలబడిన ప్రతీ ఒక్కరికి అభినందనలు తెలిపారు. మీ బతుకులు మారాలన్నా, దేశం బాగుపడాలన్నా.. ఇప్పుడున్న రాజకీయ విధానాలకు స్వస్తి పలకాలని అన్నారు. అందుకు యువత నడుం బిగించాలని పిలుపునిచ్చారు. శిరీషను ఆదర్శంగా తీసుకుని, ఎన్నికల్లో అధిక స్థానాల్లో యువత పోటీ చేయాలని అన్నారు. నిరుద్యోగ యువతీ యువకులు, బడుగు బలహీన వర్గాలు శిరీషకు మద్దతు ఇవ్వాలన్నారు. ఈల గుర్తుకు ఓటేసి, భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కొల్లాపూర్‌ నియోజక వర్గ సమస్యలపై చట్టసభల్లో చర్చించి, పరిష్కరించే అవకాశం ఆమెకు ఇవ్వాలని ఓటర్లను అభ్యర్థించారు.

Updated Date - 2023-11-25T23:20:22+05:30 IST