Share News

Manohar Reddy: ‘రూట్‌’ మార్చిన ‘కొత్త’.. మహేశ్వరం నుంచి బరిలోకి..

ABN , First Publish Date - 2023-11-05T09:09:10+05:30 IST

ఎన్నికల షెడ్యూల్‌ విడుదల ముందు వరకు వివిధ పార్టీల్లో సీనియర్‌ నాయకులు. ఆయా పార్టీల నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు

Manohar Reddy: ‘రూట్‌’ మార్చిన ‘కొత్త’.. మహేశ్వరం నుంచి బరిలోకి..

- బీఎస్పీలో చేరిన మనోహర్‌రెడ్డి

సరూర్‌నగర్‌(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): ఎన్నికల షెడ్యూల్‌ విడుదల ముందు వరకు వివిధ పార్టీల్లో సీనియర్‌ నాయకులు. ఆయా పార్టీల నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఆశించి భంగపడ్డ వారు ఎవరి దారి వారు చేసుకుంటున్నారు. మహేశ్వరం నియోజక వర్గంలో కొత్త మనోహర్‌రెడ్డి తన రూట్‌ మార్చి బీఎస్పీ(BSP)లో చేరారు. మహేశ్వం నియోజకవర్గం నుంచి ఆయన బీఎస్పీ(BSP) అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ సిట్టింగ్‌లకు టికెట్లు కేటాయించింది. 2014లో మహేశ్వరం నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన కొత్త మనోహర్‌ రెడ్డి, టికెట్‌ రాకపోవడంతో కాంగ్రెస్‏లో చేరారు. పార్టీలో టికెట్లు అమ్ముకుంటున్నారని కొత్త మనోహర్‌రెడ్డి చేసిన ఆరోపణలతో, కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఆయనను బహిష్కరించింది. కాంగ్రెస్‌ నుంచి సస్పెండ్‌ అయిన ఆయన పలు సందర్భాల్లో మాట్లాడుతూ మహేశ్వరం నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని, మంత్రి సబితారెడ్డి(Minister Sabita Reddy)ని ఓడించడమే తన ధ్యేయమని తెగేసి చెప్పారు. రేవంత్‌రెడ్డి ఎక్కడ పోటీచేస్తే అక్కడ తాను పోటీ చేసి ఆయననూ ఓడిస్తానంటూ బహిరంగ శపథం చేశారు. ఇంతలోనే ఆయన తన రూటు మార్చుకుని.. ‘కొత్త’ దారిలోకి మళ్లారు. శుక్రవారం బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ)లో చేరి సభ్యత్వం తీసుకున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తే ఏదో ఒక గుర్తు వస్తుందని భావించిన ఆయన, బీఎస్పీ ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నియోజకవర్గంలో మనోహర్‌రెడ్డి రాజకీయ రంగుల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.

FFF.jpg

సబితను ఓడిస్తా..: కొత్త

మహేశ్వరంలో ఈసారి మంత్రి సబితారెడ్డిని ఓడిస్తానని, భారీ మెజారిటీతో గెలువబోతున్నానని కొత్త మనోహర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అవినీతి, అక్రమాలతో, భూకబ్జాలతో బీఆర్‌ఎస్‌ పార్టీని భ్రష్టు పట్టించిన సబితకు టికెట్‌ ఇచ్చి ఆ పార్టీ తప్పు చేసిందని అన్నారు. చేవెళ్ల నుంచి వలస వచ్చిన సబితారెడ్డితోపాటు కాంగ్రెస్‌ అభ్యర్థి కేఎల్లార్‌ను కూడా మహేశ్వరం నుంచి తరిమి కొట్టాల్సిన సమయం ఆసన్నమయిందన్నారు. స్థానికులే ఎమ్మెల్యే కావాల్సిన అవసరం ఉన్నదని మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. తాను కేఎంఆర్‌ ట్రస్ట్‌ ద్వారా చేసిన సేవాకార్యక్రమాలు, ప్రజల ఆదరణతో విజయం సాధిస్తాననే విశ్వాసం ఉన్నదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Updated Date - 2023-11-05T09:09:12+05:30 IST