Share News

అభాగ్యులకు ఆశ్రయం అభినందనీయం

ABN , First Publish Date - 2023-11-02T00:05:10+05:30 IST

వీధుల్లో తిరిగే మానసిక దివ్యాంగులను చేరదీసి ఆశ్రయం కల్పించడం అభినందనీయమని రిటైర్డ్‌ ఐఏఎస్‌ ముక్తేశ్వర్‌రావు అన్నారు.

అభాగ్యులకు ఆశ్రయం అభినందనీయం
అమ్మా నాన్న అనాథాశ్రమ నూతన భవనాన్ని ప్రారంభిస్తున్న మునిసిపల్‌ చైర్మన్‌ వెన్‌రెడ్డి రాజు

విశ్రాంత ఐఏఎస్‌ అధికారి ముక్తేశ్వర్‌రావు

చౌటుప్పల్‌ టౌన్‌, నవంబరు 1: వీధుల్లో తిరిగే మానసిక దివ్యాంగులను చేరదీసి ఆశ్రయం కల్పించడం అభినందనీయమని రిటైర్డ్‌ ఐఏఎస్‌ ముక్తేశ్వర్‌రావు అన్నారు. చౌటుప్పల్‌ పట్టణంలో దాతల విరాళాలతో నిర్మించిన అమ్మా నాన్న అనాఽథల బహుళ అంతస్తుల భవనాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఉమ్మడి నల్లగొండ కలెక్టర్‌గా ఉన్న సమయంలోనే ఈ ఆశ్రమానికి కేటాయించిన రెండు ఎకరాల భూమి సద్వినియోగం కావడం సంతోషకరమన్నారు. మునిసిపల్‌ చైర్మన్‌ వెన్‌రెడ్డి రాజు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లోని మానసిక దివ్యాంగులను చేరదీసి ఆలన పాలన చూడడంతోపాటు మెరుగైన వైద్య సేవలను అందించి పునర్నజన్మ కల్పించడం అభినందనీయమన్నారు. సీనియర్‌ జర్నలిస్టులు కె.రామచంద్రమూర్తి, కె. శ్రీనివా్‌సరెడ్డి మాట్లాడుతూ ఆశ్రమ నిర్వాహకులపై నమ్మకం, విశ్వసనీయత ఉన్నందుననే దాతలు ముందుకు వస్తున్నారని, ఇక నుంచి అభాగ్యులు వీధుల్లో కనిపించకూడదన్నారు. ఇలాంటి ఆశ్రమం దేశంలో ఎక్కడా లేదని, ఈ ఆశ్రమం స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందన్నారు. ఆశ్రమ వ్యవస్థాపకుడు గట్టు శంకర్‌ మాట్లాడుతూ రూ.12 కోట్లు దాతల విరాళాలతో సేకరించామని, బహుళ అంస్తుల భవనాన్ని నిర్మించినట్లు తెలిపారు. ఇందులో రెండు వేల మంది మానసిక దివ్యాంగులకు వసతి కల్పించేందుకు అవకాశముంటుందన్నారు. 12 సంవత్సరాల క్రితం ఒకరితో ప్రారంభించిన ఈ ఆశ్రమంలో ప్రస్తుతం 610మంది మానసిక దివ్యాంగులు ఆశ్రయం పొందుతున్నారని వివరించారు. వీధుల్లో తిరిగే మానసిక దివ్యాంగులను పోలీస్‌ శాఖ సహకారంతో వాహనాల్లో తీసుకురావడంతో పాటు ఆరోగ్యపరంగా మెరుగైన వ్యక్తులను స్వస్థలాలకు రూపాయి ఖర్చు లేకుండా పంపిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో టీఎస్‌ డబ్ల్యూజే(ఐజేయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరాహత్‌అలీ, దాతలు పన్నాల విష్ణువర్థన్‌, మురళి, జక్కుల యాదగిరి, పద్మావతి, చిరిప్రోలు చంద్రశేఖర్‌, లక్ష్మీశేఖర్‌, ముత్యాల భూపాల్‌రెడ్డి, లయన్స్‌ క్లబ్‌ జోనల్‌ చైర్మన్‌ దాచెపల్లి ప్రకాష్‌, జోనల్‌ క్లబ్‌ సభ్యుడు గోశిక కరుణాకర్‌ పాల్గొన్నారు. గోదావరిఖనికి చెందిన జక్కుల యాదగిరి రూ.లక్ష విరాళం అందజేశారు.

Updated Date - 2023-11-02T00:05:10+05:30 IST