Double bedroom houses: ఆర్భాటంగా ఆరంభం.. ఇప్పుడేమో మూసివేత
ABN , First Publish Date - 2023-09-25T03:55:25+05:30 IST
లేడికి లేచిందే పరుగు అన్నట్లు ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండా ఆర్భాటంగా డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రారంభించిన ప్రభుత్వం ఇప్పుడు కనీసం లబ్ధిదారులనూ అనుమతించకుండా మూసేసింది.
లబ్ధిదారులనూ ఇళ్లలోకి అనుమతించని సిబ్బంది
హైదరాబాదు శివారు డబుల్ ఇళ్ల దుస్థితి
అబ్దుల్లాపూర్మెట్, సెప్టెంబర్ 24 (ఆంధ్రజ్యోతి): లేడికి లేచిందే పరుగు అన్నట్లు ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండా ఆర్భాటంగా డబుల్ బెడ్రూం ఇళ్లను (Double bedroom houses) ప్రారంభించిన ప్రభుత్వం ఇప్పుడు కనీసం లబ్ధిదారులనూ అనుమతించకుండా మూసేసింది. హైదరాబాద్ శివారు తట్టిఅన్నారం, హత్తిగూడ, తిమ్మాయిగూడలో ఈ నెల 21న 2300 రెండు పడకల ఇళ్లను మంత్రులు మహమూద్ఆలీ, పట్నం మహేందర్రెడ్డి, నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రారంభించారు. గృహాల సముదాయం ఆవరణలో సభను ఏర్పాటు చేసి లబ్ధిదారులకు ఇంటి పట్టాలను పంపిణీ చేసి వారికి భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. అంత వరకు బాగానే ఉన్న మరుసటి రోజు నుంచి డబుల్ బెడ్రూం ఇళ్ల సముదాయంలోకి లబ్ధిదారులూ వెళ్లకుండా సిబ్బంది అడ్డుపడుతున్నారు. హత్తిగూడ, తిమ్మాయిగూడ గృహ సముదాయాల దగ్గర అయితే ఏకంగా ప్రధాన ద్వారం వద్ద రేకులతో ఓ గోడను అడ్డంగా కట్టారు. దీంతో పలువురు లబ్ధిదారులు అక్కడి వరకు వచ్చి బయటి నుంచే చూసి తిరిగి వెళ్లిపోతున్నారు. గృహసముదాయాల్లో ఇంకా నిర్మాణ పనులు జరుగుతున్నందు వల్లే లబ్ధిదారులను అనుమతించడం లేదని సమాచారం. పనులు పూర్తవకుండానే ఇళ్లను ఎలా ప్రారంభిస్తారని కాంగ్రెస్, బీజేపీ నేతలు బీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడుతున్నారు.
సెప్టెంబర్ 2న ఇచ్చిన ఇళ్ల పరిస్థితి కూడా అంతే..
సెప్టెంబర్ 2న తొలి విడతలో డబుల్ బెడ్రూం ఇళ్లు అందుకున్న లబ్ధిదారులకు కూడా నిరాశే ఎదురవుతోంది. ఇళ్ల పట్టాలు ఇచ్చి దాదాపు మూడు వారాలైంది. కానీ ఇంకా లోపలికి అనుమతించలేదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందన్న సంతోషం లేకుండా చేస్తున్నారు. లబ్ధిదారులు.. వచ్చి చూసి వెళ్లిపోతున్నారు. కనీసం లోపలికి వెళ్లి చూసుకునేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా అధికారులు గేటుకు తాళాలు వేసి వెళ్లిపోయారు. దీంతో ఇంట్లోకి ఎప్పుడు వెళ్లాలి? నీళ్లు ఎప్పుడొస్తాయి. కరెంట్ కనెక్షన్ ఎప్పుడిస్తారు?, ఇంకోవైపు దసరా పండగ సమీపిస్తోంది. పండగకైనా కొత్త ఇంట్లోకి అడుగుపెట్టాలని లబ్ధిదారులు ఆశిస్తున్నారు. కానీ అసలేం జరుగుతుందో అర్థం కాక లబ్ధిదారులు సతమతం అవుతున్నారు.