Chevella: హైదరాబాద్‌కు కూతవేటు దూరంలో ఉండే చేవెళ్లలో ఇప్పుడు భూములు కొనేవాళ్లు లక్కీ.. ఎందుకంటే..

ABN , First Publish Date - 2023-07-16T13:36:46+05:30 IST

చేవెళ్ల గ్రామ పంచాయతీ పరిధిలోఉన్న సమీప గ్రామాలను కలుపుతూ నూతన మున్సిపాలిటీగా చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఐదు సంవత్సరాల క్రితమే శంకర్‌పల్లితో పాటు చేవెళ్ల మున్సిపాలిటీగా ఏర్పాటు అయ్యే పరిస్థితి ఉన్నా కొన్ని రాజకీయ సమీకరణల మూలంగా అప్పట్లో అది సాధ్యం కాలేదు. ఈ దఫా కచ్చితంగా చేవెళ్ల గ్రామ పంచాయతీ మున్సిపాలిటీగా మారుతుందని.. అందుకు అధికారులు పక్కాగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం

Chevella: హైదరాబాద్‌కు కూతవేటు దూరంలో ఉండే చేవెళ్లలో ఇప్పుడు భూములు కొనేవాళ్లు లక్కీ.. ఎందుకంటే..

చేవెళ్లకు మున్సిపాలిటీ యోగం!

ప్రభుత్వానికి ప్రతిపాదనలు

త్వరలోనే ప్రకటన ఇప్పించేందుకు ఎంపీ, ఎమ్మెల్యే కార్యాచరణ

చేవెళ్ల: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు కూతవేటు దూరంలో ఉన్న చేవెళ్ల గ్రామ పంచాయతీ తొందరలోనే మున్సిపాలిటీగా రూపాంతరం చెందనుంది. అందుకుగాను ఒక్కొక్కటిగా అడుగులు పడుతున్నాయి. చేవెళ్ల గ్రామ పంచాయతీ పరిధిలోఉన్న సమీప గ్రామాలను కలుపుతూ నూతన మున్సిపాలిటీగా చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఐదు సంవత్సరాల క్రితమే శంకర్‌పల్లితో పాటు చేవెళ్ల మున్సిపాలిటీగా ఏర్పాటు అయ్యే పరిస్థితి ఉన్నా కొన్ని రాజకీయ సమీకరణల మూలంగా అప్పట్లో అది సాధ్యం కాలేదు. ఈ దఫా కచ్చితంగా చేవెళ్ల గ్రామ పంచాయతీ మున్సిపాలిటీగా మారుతుందని.. అందుకు అధికారులు పక్కాగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. దీంతో పాటు చేవెళ్ల పార్లమెంట్‌ కేంద్రం, అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంగా ఉండడంతో చేవెళ్ల మున్సిపాలిటీగా చేయడానికి అన్ని అర్హతలు ఉన్నాయని ఎంపీ, ఎమ్మెల్యేలు ఇప్పటికే సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌కు వివరించినట్లు సమాచారం. ఈ మేరకు సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ ఆదేశాలతోనే ఇటీవల జరిగిన తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా చేవెళ్లలో నిర్వహించిన కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ. రంజిత్‌రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్యలు చేవెళ్ల మున్సిపాలిటీగా కాబోతుందని బహిరంగంగా ప్రకటించి చేవెళ్ల గ్రామ ప్రజలకు స్వీట్లు పంచిపెట్టారు.


మున్సిపాలిటీ పరిధిలో కలిసే గ్రామాలు

చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలోకి 10 గ్రామ పంచాయతీలను కలిపేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. దామరిగిద్ద, ఇబ్రహీంపల్లి, కేసారం, దేవునిఎర్రవల్లి, పామెన, కందవాడ, పలుగుట్ట, మల్లారెడ్డిగూడ, మల్కాపూర్‌, ఊరెళ్ల గ్రామ పంచాయతీలను కలిపి చేవెళ్ల మున్సిపాలిటీగా రూపాంతరం చెందుతుందని తెలుస్తుంది. అయితే ఈ గ్రామాల ప్రజల ప్రజాభిప్రాయం లేకుండా విలీనం చేయడాన్ని వివిధ పార్టీల నాయకులు తప్పుపడుతున్నారని కూడా ప్రచారం సాగుతోంది.

చేవెళ్ల మున్సిపాలిటీ కావడం ఖాయం

చేవెళ్ల గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా చేస్తాం. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు విషయాన్ని సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ల దృష్టికి తీసుకెళ్లాం. మున్సిపాలిటీలో విలీనమయ్యే గ్రామాల ప్రజల అభిప్రాయం మేరకు మున్సిపాలిటీగా ఏర్పాటు చేసి చేవెళ్లను మరింత అభివృద్ధి చేస్తాం. మున్సిపాలిటీ అభివృద్దికి ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా నిధులు తెస్తాం.

- కాలె యాదయ్య, ఎమ్మెల్యే

చేవెళ్ల మున్సిపాలిటీని స్వాగతిస్తున్నాం

చేవెళ్లను మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తామని ఎంపీ. ఎమ్మెల్యేలు ప్రకటించడం చాలా సంతోషకరం. హైదరాబాద్‌ నగరానికి చాలా దగ్గరలో ఉన్న చేవెళ్ల మున్సిపాలిటీగా మారితే గ్రామ రూపురేఖలు పూర్తిగా మారిపోతాయి. అభివృద్ధి పరంగా ఈ ప్రాంత ప్రజలకు, నిరుద్యోగ యువతకు అనేక అవకాశాలు వస్తాయి.

- ఎం.మాలతీ కృష్ణారెడ్డి, జెడ్పీటీసీ చేవెళ్ల

అభివృద్ధి వేగంగా జరుగుతుంది

చేవెళ్ల పట్టణ కేంద్రం మున్సిపాలిటీగా ఏర్పాటు అయితే గ్రామ పరిసర ప్రాంతాలు చాలా వేగంగా అభివృద్ధి చెందుతాయి. మున్సిపాలిటీ ఏర్పాటును ప్రజలందరూ స్వాగతిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా మున్సిపాలిటీకి నిధులు విడుదల చేస్తాయి. అభివృద్ధి కూడా అదే స్థాయిలో జరుగుతుంది.

- ఎం.విజయలక్ష్మీ రమణారెడ్డి, ఎంపీపీ. చేవెళ్ల

Updated Date - 2023-07-16T13:36:49+05:30 IST