Share News

లిస్టుల్లో పేర్లు గల్లంతు.. ఆందోళనలో ఓటర్లు

ABN , First Publish Date - 2023-11-29T00:09:31+05:30 IST

రేపు పోలింగ్‌ ఉన్నందున చాలా మంది ఓటర్లు ఓటరు లిస్టులో తమ పేరు ఉందా? లేదా? అని వెతుక్కుంటున్నారు.

లిస్టుల్లో పేర్లు గల్లంతు.. ఆందోళనలో ఓటర్లు
ఓటరు లిస్టులో తన పేరు వెతుక్కుంటున్న మహిళ

మేడ్చల్‌ టౌన్‌, నవంబరు 28: రేపు పోలింగ్‌ ఉన్నందున చాలా మంది ఓటర్లు ఓటరు లిస్టులో తమ పేరు ఉందా? లేదా? అని వెతుక్కుంటున్నారు. కొందరికి బీఎల్వోలు ఓటరు స్లిప్పులు ఇచ్చినా.. స్లిప్పులు రాని వారు.. అలాగే ఒకే ఇంట్లో కొందరికి స్లిప్‌లు వచ్చినా మరి కొందరికి రాలేదు. అలాంటి వారు తమ పేరు లిస్టులో ఉందా? లేదా? అని కొత్త ఓటరు లిస్టుల్లో వెతుకుతున్నారు. ఈ సారి వార్డుల వారీగా కాకుండా బూత్‌ల వారీగా ఓటరు లిస్టును తయారు చేశారు. కొన్నిచోట్ల ఒక ఇంట్లో నాలుగైదు ఓట్లుంటే వారి ఓట్లు వేర్వేరు బూత్‌లతో ఉన్న పరిస్థితి ఉంది. తమ పేర్లు గల్లంతయ్యాయంటూ చాలా మంది నాయకుల వద్ద ఉన్న ఓటరు లిస్టుల్లో చెక్‌ చేసుకుంటున్నారు. విద్యావంతులు తమ ఓటరు ఐడీ లేదా ఫోన్‌ నెంబర్లతో ఈసీఐ పోర్టల్‌లో ఓటు ఎక్కడుందో తెలుసుకుంటున్నారు. నిరక్షరాస్యులు, పోర్టల్‌పై అవగాహన లేని వారు లిస్టులు వెతుకుతున్నారు. మున్సిపాలిటీలో పది వరకు పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

లిస్టులో పేరు లేకుంటే చేతికందని డబ్బు!

రాజకీయ పార్టీలు ఓటరు లిస్టు ప్రకారం డబ్బు పంపకాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో లిస్టులో పేరు లేని వారికి డబ్బులివ్వడం లేదు. నాయకులు, కార్యకర్తలు ఓటరు లిస్టును చేతిలో పెట్టుకొని ఓటరు ఐడీ కార్డులు చూసి మరీ డబ్బులు ఇస్తూ పేర్లు రాసుకుంటున్నారు. ఒకే ఇంటికి సంబంధించి లిస్టులో సీరియల్‌ నంబర్‌ ప్రకారం పేర్లు లేవు. ఒకింట్లో నలుగురైదుగురు ఓటర్లు ఉంటే రెండు మూడు పేర్లు సీరియల్‌గా వస్తున్నాయి. మరికొన్ని పేర్లు వేరే బూత్‌లో ఉంటున్నాయి. పేర్లున్న వారికి డబ్బులిస్తున్నారు. బూత్‌ల వారీగా కార్యకర్తలు డబ్బు పంపిణీ చేస్తున్నారు. దీంతో కొందరు మహిళలు తమ పేరు ఓటరు లిస్టులో తీసేశారంటూ ఏడుస్తూ తిరుగుతున్నారు.

Updated Date - 2023-11-29T00:09:32+05:30 IST