Patnam Mahender Reddy: పట్నం మహేందర్ రెడ్డికి మంత్రి పదవి.. ప్రమాణ స్వీకారానికి డేట్, టైం ఫిక్స్

ABN , First Publish Date - 2023-08-23T21:35:09+05:30 IST

రంగారెడ్డి జిల్లాకు చెందిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డికి మరోసారి కేసీఆర్ కేబినెట్‌లోకి అవకాశం దక్కింది. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ఆయన తెలంగాణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తాండూరు నుంచి పోటీ విషయంలో వెనక్కి తగ్గినందుకు ప్రతిఫలంగా పట్నంకు మంత్రి పదవి దక్కింది.

Patnam Mahender Reddy: పట్నం మహేందర్ రెడ్డికి మంత్రి పదవి.. ప్రమాణ స్వీకారానికి డేట్, టైం ఫిక్స్

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాకు చెందిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డికి మరోసారి కేసీఆర్ కేబినెట్‌లోకి అవకాశం దక్కింది. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ఆయన తెలంగాణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తాండూరు నియోజకవర్గం విషయంలో సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. కేసీఆర్‌ అభ్యర్థుల ప్రకటన చేయడానికి ముందు వరకు తాండూరు నుంచి బీఆర్‌ఎస్‌ తరపున పోటీ చేసేది నేనంటే ..నేనంటూ సిట్టింగ్‌ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డిల మధ్య తీవ్ర పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. తాండూరు నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డినే బరిలోకి దించుతూ గులాబీ దళపతి నిర్ణయం తీసుకున్నారు. తాండూరు నుంచి పోటీ చేయడమే తన లక్ష్యంగా ప్రకటించిన మహేందర్‌రెడ్డి.. వచ్చే ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు సాగుతారనేది అధికార పార్టీ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠగా మారింది. అభ్యర్థుల ప్రకటన కంటే ముందు పార్టీ అధినేత కేసీఆర్‌ పట్నం మహేందర్‌రెడ్డి, పైలెట్‌ రోహిత్‌రెడ్డిలను ప్రగతి భవన్‌ పిలిపించుకుని చర్చించినట్లు తెలిసింది.


తాండూరు నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డినే బరిలోకి దింపుతున్నామని, విబేధాలన్నీ మరిచిపోయి ఆయన విజయానికి కృషి చేయాలని మహేందర్‌రెడ్డికి సూచించినట్లు తెలుస్తోంది. దీనికి ప్రతిఫలంగా మహేందర్‌రెడ్డికి కేబినెట్‌లో మంత్రిగా అవకాశం కల్పిస్తామంటూ సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. చివరకు ఆ ప్రచారమే నిజమైంది. పట్నంను మంత్రివర్గంలోకి తీసుకుంటూ కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం జరిగిపోయింది. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి ఇంటికి సోమవారం ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి వెళ్లి మర్యాద పూర్వకంగా కలిసి అరగంట పాటు చర్చించారు. అనంతరం కలిసి తాండూరుకు వెళ్లి పార్టీ ముఖ్యులతో కలవాలని నిర్ణయించారు. తర్వాత రోహిత్‌రెడ్డి మహేందర్‌రెడ్డి నివాసం వద్ద మీడియాతో మాట్లాడుతూ మహేందర్‌రెడ్డి, తాను కలవడం వల్ల ఊహించని రీతిలో కొత్త కోణం చూస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డిది పెద్ద మనసని, ఆయన నాయకత్వంలో తాండూరుతో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అన్ని స్థానాల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ గెలిపించి చూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Updated Date - 2023-08-23T21:35:12+05:30 IST