Share News

వరికోతలకు కూలీలు కరువు

ABN , First Publish Date - 2023-11-29T00:17:08+05:30 IST

వాన కాలం పంటల కోత పనులు కొనసాగుతున్నాయి. వరి, మొక్కజొన్న కోతలు, పత్తితీత పనులు మొదలయ్యాయి. కొన్ని రోజులుగా వాతావరణం మబ్బు పట్టి కురుస్తున్న చిన్నపాటి వర్షాలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. చేతికొచ్చిన పంట ఎక్కడ తడుస్తుందో అని భయపడుతున్నారు.

వరికోతలకు కూలీలు కరువు

కోతకొచ్చిన వరి, మొక్కజొన్న, పత్తి పంటలు

కూలీల కొరత, మిషన్‌ల కోసం ఎదురుచూపు

ఎన్నికల ప్రచారానికి పోతున్న కూలీలు

పంటలు పాడవుతుండటంతో రైతుల ఆందోళన

చౌదరిగూడ, నవంబరు 28 : వాన కాలం పంటల కోత పనులు కొనసాగుతున్నాయి. వరి, మొక్కజొన్న కోతలు, పత్తితీత పనులు మొదలయ్యాయి. కొన్ని రోజులుగా వాతావరణం మబ్బు పట్టి కురుస్తున్న చిన్నపాటి వర్షాలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. చేతికొచ్చిన పంట ఎక్కడ తడుస్తుందో అని భయపడుతున్నారు. ప్రారంభ దశలో కురవని వానలు ఇప్పుడు పంటలు చేతికొచ్చే దశలోనూ వెంటాడుతున్నాయి. వర్షాలతో పంటలు పాడవుతున్నాయి. వాటిని కోయడం కూడా కష్టంగా మారింది. కోయకుండా పొల్లాల్లో ఉన్న ధాన్యం రంగు మారుతోంది.

ప్రచారంలో కూలీలు.. పనులు సాగేదెలా?

పత్తి తీయాలి. వరి కోయాలి. పల్లి చేలల్లో కలుపు తీయాలి. ఈ పనులన్నింటికీ కూలీలు కావాలి. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తెల్లారగానే పార్టీల జెండాలు పట్టుకొని కూలీలు పోతున్నారు. కోతకొచ్చిన పత్తి, మొక్కజొన్న, వరి కోతకు కూలీలు దొరకక రైతులు ఆందోళన చెందుతున్నారు. పొలాల్లో తడి ఆరకపోవడంతో హార్వెస్టర్లు దిగబడుతున్నాయి. కూలీలేమో దొరకడంలేదు. పత్తి కాయలు పగిలి పత్తి బయటికొచ్చింది. తీయడం అలస్యమైతే రాలిపోతుంది. వర్షం పడితే పంటలన్నీ తడిసి దెబ్బతింటాయని రైతు ఆందోళన చెందుతున్నారు. ఒకవైపు పొలం పనులు జోరుగా సాగే కాలం.. మరోవైపు ఎన్నికల సీజన్‌ కావడంతో కూలీలకు డిమాండ్‌ పెరిగింది. వ్యవసాయ పనులు తర్వాత చేసుకోవచ్చు అని చాలామంది ప్రచారానికి వెళ్తున్నారు. దీంతో రైతులకు తిప్పలు తప్పడం లేదు.

కోత యంత్రాల కొరత

ప్రస్తుతం గ్రామాల్లో పంటలు కోతకొచ్చాయి. ఇప్పుడు అల్పపీడనంతో వర్షాలు కురుస్తుండటంతో పంట తడిసి పోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు హార్వెస్టర్లు లేక సమస్యగా మారింది.

వరి కోసే పరిస్థితి లేదు

నేను 3 ఎకరాల్లో వరి వేశాను. ప్రస్తుతం పంట కోతకొచ్చింది. కానీ కోయించలేని పరిస్థితి నెలకొంది. కురిసిన వర్షాల కారణంగా పొలమంతా నీరు ఉబికి వస్తోంది. టైర్‌ హార్వెస్టర్లు నడిచే పరిస్థితి లేదు. చైన్‌ హార్వెస్టర్లు లేవు. కూలీలేమో దొరకడం లేదు. కూలి రేట్లు కూడా పెంచారు. ఇన్ని ఇబ్బందుల్లో వరి కోయించడం మాకు ఇబ్బందిగా మారింది.

- మహమూద్‌ షరీఫ్‌, తుమ్మలపల్లి

కూలీలకు పెరిగిన డిమాండ్‌

నేను 13ఎకరాల్లో పత్తి పంట సాగు చేశా. ఎన్నికల ప్రచారాలు కొనసాగుతుండంతో స్థానికంగా కూలీలు రావడం లేదు. పత్తి తీసేందుకు మేం కర్నూల్‌ జిల్లా నుంచి కూలీలను తీసుకొచ్చుకొని పత్తి తీత పనులు చేయిస్తున్నాం. గ్రామాల్లో కూలీలకు భారీగా డిమాండ్‌ పెరిగింది.

Updated Date - 2023-11-29T00:17:18+05:30 IST