Share News

Gudivada: కొడాలి నాని సన్నిహితుడి బంకులో కల్తీ పెట్రోలు.. సగానికిపైగా నీళ్లే..!

ABN , Publish Date - Jul 14 , 2024 | 08:07 AM

మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని (Kodali Nani) సన్నిహితుడు షా కీర్తికుమార్‌ జీవావత్‌కు చెందిన షా గులాబ్‌చంద్‌ జీవావత్‌ అండ్‌ కో పెట్రోలు బంకులో (Petrol Bunk) కల్తీ పెట్రోలు విక్రయం కలకలం సృష్టించింది. శనివారం సాయంత్రం 50 మందికి పైగా బైక్‌లలో 75 లీటర్ల మేర పెట్రోలు కొట్టించుకున్నారు..

Gudivada: కొడాలి నాని సన్నిహితుడి బంకులో కల్తీ పెట్రోలు.. సగానికిపైగా నీళ్లే..!

ఎన్టీఆర్ జిల్లా/గుడివాడ : మల్లాయిపాలెం పరిధిలోని ముదినేపల్లి రోడ్డులో మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని (Kodali Nani) సన్నిహితుడు షా కీర్తికుమార్‌ జీవావత్‌కు చెందిన షా గులాబ్‌చంద్‌ జీవావత్‌ అండ్‌ కో పెట్రోలు బంకులో (Petrol Bunk) కల్తీ పెట్రోలు విక్రయం కలకలం సృష్టించింది. శనివారం సాయంత్రం 50 మందికి పైగా బైక్‌లలో 75 లీటర్ల మేర పెట్రోలు కొట్టించుకున్నారు. కొద్దిదూరం వెళ్లగానే వాహనాలు ఆగిపోయాయి. వాహనాలు స్టార్ట్‌ అవ్వలేదు. దీంతో బైక్‌లను బంకు వద్దకు తీసుకొచ్చి సిబ్బంది ఎదుట పెట్రోలు ట్యాంకులను తెరచి చూపించారు. కంపెనీ ప్రతినిధి తమ తప్పేం లేదని, పెట్రోలుతో పాటు ఇథనాల్‌ కలవకపోవడంతో వాహనాలు ఆగిపోతున్నాయని, బైక్‌కు ఏ ఇబ్బందీ ఉండదని 75లీటర్లు పెట్రోలు అమ్మకాలు జరిగాయని, తిరిగి వచ్చిన వారందరికి పవర్‌ పెట్రోలును కొట్టించి పంపుతున్నట్లు తెలిపారు. మరికొందరు పాత ద్విచక్రవాహనదారులు వాహనం ఎందుకు ఆగిందో తెలియక మెకానిక్‌లను ఆశ్రయించారు. ట్యాంకు నుంచి పెట్రోలును తీసి కల్తీపెట్రోలు కారణంగానే ఆగిపోయాయని, నెలలో రెండోసారి వాహనాల ట్యాంకులను శుభ్రపరిచామని మెకానిక్‌లు చెబుతున్నారు.


Adulterated-Petrol-1.jpg

నెలలో రెండోసారి..

15 రోజుల క్రితం గుడ్లవల్లేరు కళాశాలలో సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ ఉండటంతో పెట్రోలు కొట్టించుకుని అంగలూరు వద్దకు వెళ్లేసరికి బైక్‌ ఆగిపోయిందని ఓ విద్యార్థి తెలిపాడు. మెకానిక్‌ వద్దకు తీసుకువెళ్లి చూపిస్తే కల్తీ పెట్రోలు వల్లే ఆగిపోయిందని చెప్పాడని, వాహనాన్ని బాగు చేయించకున్నానని వాపోయాడు.

పట్టించుకోరేం..?

వైసీపీ ప్రభుత్వ హయాంలో కొడాలి నాని అండతో ఆ బంకులో పలు అక్రమాలు జరిగినా అధికారులు మిన్నకుండిపోయారని, పలుమార్లు పెట్రోలు కొలతల్లో తేడా ఉందని, కల్తీ పెట్రోలు కొడుతున్నారని అధికారులకు ఫిర్యాదులందినా నానికి సన్నిహితుడు కావడంతో తనిఖీలు చేసేందుకు పౌరసరఫరాలు, తూనికలు కొలతల శాఖ అధికారులు సాహసించలేదని వినియోగదారులు ఆరోపిస్తున్నారు.

తోసుకుంటూ వచ్చాం

కల్తీ పెట్రోలుతో తామంతా ఇబ్బందులు పడ్డామని, వాహనాలను తోసుకుంటూ వచ్చామని, మెకానిక్‌ వద్ద బాగు చేయించుకోవలసిన దుస్దితి ఏర్పడిందని వినియోగదారులు వాపోయారు. విజయవాడ నుంచి మల్లాయిపాలెం వెళుతూ బంకులో పెట్రోలు కొట్టించుకున్నానని మహ్మమద్‌ ఇషాక్‌ తెలిపారు. మల్లాయిపాలెం గేటు దాటగానే అరకిలోమీటర్‌ దూరానికే ఆగిపోయిందని, దీంతో ఆటోలో వాహనాన్ని మెకానిక్‌ వద్దకు తీసుకెళ్లానని ఇప్పటికే 15వాహనాలు ఇలా వచ్చాయని మెకానిక్‌ చెప్పాడని తెలిపారు. 30 మందికిపైగా ద్విచక్రవాహనదారులు వేరే వాహనాల సహకారంతో బంకు వద్దకు చేరుకున్నారు.


Petrol-And-Diesel.jpg

జారుకున్న పోలీసులు

బంకు వద్ద ద్విచక్రవాహనాలు బారులు తీరి, ఆందోళనకు సిద్ధమవుతున్నారనే సమాచారంతో గుడివాడ తాలుకా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కొడాలి నాని సన్నిహితుడు కీర్తికుమార్‌ బంకు కావడంతో పోలీసు ఉన్నతాధికారి ఆదేశాలతో వచ్చిన ఇద్దరు అక్కడి నుంచి చల్లగా జారుకున్నారు.

మీడియాకు తాయిలాలు ఎర

జరిగింది చిన్న విషయమని, కల్తీ పెట్రోలు విషయాన్ని పేపర్లు, టీవీల్లో రాకుండా చూడాలని మీడియా ప్రతినిధులకు తాయిలాలు ఇచ్చేందుకు సైతం బంకు యాజమాన్యం తెగపడింది.

కొడాలి నాని ఆరా

బంకు వద్ద ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఓ వైసీపీ నాయకుడిని కొడాలి నాని పంపించారు. అక్కడి పరిస్ధితిని తెలపాలని, వినియోగదారులు ఆందోళన చేయకుండా చూడాలని ఆదేశాలిచ్చినట్లు సమాచారం.

Updated Date - Jul 14 , 2024 | 08:54 AM