APPSC Group-1: గ్రూప్-1లో గోల్‌మాల్?
ABN , Publish Date - Jul 05 , 2024 | 04:04 AM
యూపీఎస్సీ ఇటీవల విడుదల చేసిన సివిల్స్ పరీక్షల తుది ఫలితాల్లో టాపర్‌కు వచ్చిన మార్కులు 2,025కి గాను 1,099. అందులో 275 మార్కుల ఇంటర్వ్యూలో టాపర్ సాధించింది 200(72.72ు) మార్కులు.
అస్మదీయ అభ్యర్థులకు మార్కుల వరద
2022 గ్రూప్-1 ఇంటర్వ్యూల్లో మతలబు?
ఒక అభ్యర్థికి 75కు గాను 74.5 మార్కులు
ఆయన గతంలో డీజీపీ కార్యాలయ ఉద్యోగి
ధనుంజయ్‌రెడ్డి బంధువుకు 74 మార్కులు
చాలామంది అభ్యర్థులకు 99 శాతానికి పైగా
అక్రమాలంటూ తొలుత ఇంటర్వ్యూలు రద్దు
మళ్లీ కొన్నాళ్లకు ఆకస్మికంగా పునరుద్ధరణ
మార్కుల విషయంలో ఏపీపీఎస్సీ గోప్యత
(అమరావతి-ఆంధ్రజ్యోతి):
వీరికే ఎందుకు?.. ఎలా?
ఇంటర్వ్యూలో ఒక అభ్యర్థికి ఏకంగా 74.5 (99.33ు) మార్కులు వచ్చాయి. ఏపీపీఎస్సీ మాజీ చైర్మన్ గౌతం సవాంగ్ డీజీపీగా ఉన్నప్పుడు ఆయన కార్యాలయంలోని టెక్నికల్ విభాగంలో ఆ అభ్యర్థి ఎస్‌ఐగా పనిచేశారు.
మరో అభ్యర్థి 74 మార్కులు సాధించారు. ఆయన మాజీ సీఎం జగన్‌కు కార్యదర్శిగా పనిచేసిన ధనుంజయ్‌రెడ్డి బంధువు.
వీరిద్దరే కాదు. టాపర్లలో దాదాపు తొమ్మిది మందికి 74 మార్కులు వచ్చాయని విశ్వసనీయ సమాచారం.
యూపీఎస్సీ ఇటీవల విడుదల చేసిన సివిల్స్ పరీక్షల తుది ఫలితాల్లో టాపర్‌కు వచ్చిన మార్కులు 2,025కి గాను 1,099. అందులో 275 మార్కుల ఇంటర్వ్యూలో టాపర్ సాధించింది 200(72.72ు) మార్కులు. ‘ఏపీపీఎస్సీ 2022లో నిర్వహించిన గ్రూప్-1 ఇంటర్వ్యూల్లో మార్కుల వరద పారించారు. కమిషన్ చరిత్రలోనే ఎన్నడూ లేనట్లుగా ‘కొందరికి’ 99శాతానికి పైగా మార్కులు వేసేశారు. గతంలో జరిగిన పోస్టుల భర్తీలో ఇలా 99శాతానికి పైగా మార్కులు ఎవరూ సాధించలేదు.
ఇంటర్వ్యూలు చేసే బోర్డులు అన్ని మార్కులు వేయవు. కానీ జగన్ ప్రభుత్వంలో ఇన్ని మార్కులు ఎలా వేశారు? కళ్లు తిరిగే స్థాయిలో అన్నేసి మార్కులు వేయడం వెనుక ఆంతర్యం ఏమిటి? అనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.
2022లో నిర్వహించిన గ్రూప్-1 పరీక్షల్లో 75 మార్కులకు ఇంటర్వ్యూలు జరగ్గా ఒక అభ్యర్థికి ఏకంగా 74.5 (99.33ు) మార్కులు వచ్చాయి. ఆ అభ్యర్థి గతంలో గౌతం సవాంగ్ డీజీపీగా ఉన్నప్పుడు ఆయన కార్యాలయంలో టెక్నికల్ విభాగంలో ఎస్‌ఐగా పనిచేశారు. 2022లో గ్రూప్-1 జరిగినప్పుడు సవాంగ్ ఏపీపీఎస్సీ చైర్మన్‌గా ఉన్నారు. మరో అభ్యర్థి 74 మార్కులు సాధించారు.
ఆయన మాజీ సీఎం జగన్‌కు కార్యదర్శిగా పనిచేసిన ధనుంజయ్‌రెడ్డి బంధువు’... వీరిద్దరే కాదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం టాపర్లలో దాదాపు తొమ్మిది మందికి 74 మార్కులు వచ్చాయి. ఏపీపీఎస్సీ చరిత్రలోనే ఇన్ని మార్కులు రావడం చాలా అరుదు. అంతా పారదర్శకంగా జరిగితే మార్పులను ఎందుకు బహిర్గతం చేయలేదనే సందేహాలొస్తున్నాయి. అసలు ఇంటర్వ్యూలంటేనే అక్రమాలని సీఎంగా ఉన్నప్పుడు జగన్ ప్రకటించారు. ఆయన ఆదేశాలతో 2021 జూన్‌లో గ్రూప్-1 ఇంటర్వ్యూలు రద్దుచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మళ్లీ ఏమైందో, ఎవరు ఆదేశించారో కానీ 2022లో గ్రూప్-1 నోటిఫికేషన్ ఇచ్చేముందు ఇంటర్వ్యూ విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టారు. వెంటనే గ్రూప్-1 పోస్టులకు పరీక్షలు జరిగాయి. ఆ ఇంటర్వ్యూల్లో కొందరికి కనీవినీ ఎరుగని స్థాయిలో మార్కులొచ్చాయి.
రహస్యం ఎందుకు?
ప్రతిష్టాత్మకమైన యూపీఎస్సీనే అభ్యర్థుల మార్కులను వెల్లడిస్తోంది. కానీ వైసీపీ పాలనలో మార్కులు వ్యక్తిగతంగా ఆ అభ్యర్థులకు తప్ప మూడో కంటికి తెలియవు. 2016లో జరిగిన గ్రూప్-1 పోస్టుల భర్తీకి సంబంధించిన మార్కులను అప్పటి కమిషన్ బహిర్గతం చేసింది. 2018లో ఇచ్చిన గ్రూప్-1 నోటిఫికేషన్ పోస్టులను భర్తీచేసిన వైసీపీ ప్రభుత్వం ఆ మార్కులనూ దాచిపెట్టింది. ఆ తర్వాత 2022 నోటిఫికేషన్ మార్కులనూ గోప్యంగానే ఉంచింది.
2022 గ్రూప్-1 ఇంటర్వ్యూలో గరిష్ఠ మార్కులు ఎన్నో సమాచారం ఇవ్వాలని ‘ఆంధ్రజ్యోతి’ కోరగా... ఏపీపీఎస్సీ కార్యదర్శి స్పందించలేదు. అప్పట్లో ఏపీపీఎస్సీ కార్యదర్శిగా పనిచేసిన హెచ్.అరుణ్‌కుమార్ కూడా ఇదే గోప్యతను కొనసాగించారు. ఫలితాలు ప్రకటించిన రోజున మార్కులు మీడియాకు ఇవ్వాలని అప్పటి చైర్మన్ సవాంగ్ ఆదేశించినా, అరుణ్‌కుమార్ మాత్రం ససేమిరా అనేశారు.
బోర్డుల్లో పారదర్శకత ఎంత?
111 పోస్టుల భర్తీకి 2022లో గ్రూప్-1 నోటిఫికేషన్ జారీ చేశారు. వారిలో మెయిన్స్ నుంచి 1:2 నిష్పత్తిలో ఇంటర్వ్యూలకు అభ్యర్థులను ఎంపిక చేశారు. ఇంటర్వ్యూల కోసం మూడు బోర్డులు ఏర్పాటుచేశారు. ఈ బోర్డుల్లో పారదర్శకత ఎంత అనేది అనుమానమే. 2021లో ఇంటర్వ్యూలను రద్దు చేసినప్పుడు జగన్ ప్రభుత్వం దాన్ని చరిత్రాత్మక నిర్ణయంగా ప్రకటించుకుంది. ఇకపై పారదర్శకంగా గ్రూప్1 ఉద్యోగాల భర్తీ జరుగుతుందని ప్రచారం చేసుకుంది.
కానీ కొద్దికాలంలోనే ఆ నిర్ణయాన్ని కాలగర్భంలో కలిపేస్తూ, ఇంటర్వ్యూ విధానాన్ని తిరిగి తెచ్చింది. ఇది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమని, దానిపై కామెంట్ చేయలేనని అప్పట్లో సవాంగ్ తెలిపారు. దాని వెనుక ఎవరో ఉన్నారని ఆయన చెప్పకనే చెప్పారు. ఆ తర్వాత జరిగిన ఉద్యోగాల భర్తీలో తిరిగి ఇంటర్వ్యూలు ఎందుకు తెచ్చారో బయటపడింది.