Share News

Amaravati : చిరుద్యోగులపై చిన్నచూపు

ABN , Publish Date - Jul 08 , 2024 | 04:13 AM

గత వైసీపీ ప్రభుత్వం నిర్వాకం కారణంగా వ్యవసాయ అనుబంధ శాఖల్లోని పలు విభాగాల ఉద్యోగులకు నెలల తరబడి జీతాలు అందకుండా పోయాయి. ఇంకా అనేక శాఖల్లోని క్షేత్రస్థాయి, దిగువ శ్రేణి చిరుద్యోగులకు చిన్న మొత్తాల్లో ఇవ్వాల్సిన జీతాలను....

Amaravati : చిరుద్యోగులపై చిన్నచూపు

  • నెలల తరబడి వేతనాలివ్వని జగన్‌ సర్కార్‌

  • సహకార అభివృద్ధి ప్రాజెక్ట్‌ ఉద్యోగులకు 22 నెలలు

  • ప్రకృతి సేద్య కార్యకర్తలకు 17 నెలలు.. ఆత్మ ప్రాజెక్ట్‌ ఉద్యోగులకు 5 నెలలు

  • కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందిదీ అదే దారి..

  • జీతాలందక ఇంకా అనేక శాఖల్లో బాధితులు

  • ఇప్పుడిక కూటమి ప్రభుత్వంపైనే వారి ఆశలు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

గత వైసీపీ ప్రభుత్వం నిర్వాకం కారణంగా వ్యవసాయ అనుబంధ శాఖల్లోని పలు విభాగాల ఉద్యోగులకు నెలల తరబడి జీతాలు అందకుండా పోయాయి. ఇంకా అనేక శాఖల్లోని క్షేత్రస్థాయి, దిగువ శ్రేణి చిరుద్యోగులకు చిన్న మొత్తాల్లో ఇవ్వాల్సిన జీతాలను కూడా జగన్‌ సర్కార్‌ పేరబెట్టడంతో ఇప్పుడు ఆ భారమంతా కూటమి ప్రభుత్వంపై పడింది. ప్రకృతి సేద్యంలో ఏపీ రైతు సాధికార సంస్థ అనేక అంతర్జాతీయ అవార్డులు పొందినట్లు ప్రచారం చేసిన జగన్‌ సర్కార్‌.. ఆ సంస్థ ఆధ్వర్యంలోని ప్రకృతి సేద్య విభాగంలో పని చేస్తున్న 9,352 మంది కార్యకర్తలకు మాత్రం ఏడాదిపైగా జీతం ఇవ్వకుండా ఊడిగం చేయించింది. ఒక్కొక్కరికి రూ.6నుంచి రూ.16వేల వరకు నెల వేతనాలుండగా, దాదాపు రూ.100కోట్లు బకాయి విడుదల కావాల్సి ఉంది. తాజా సమాచారం ప్రకారం ప్రకృతి సేద్య కార్యకర్తలకు 17 నెలల జీతం ఇవ్వాల్సి ఉంది. ‘గౌరవవేతనానికి దిక్కులేదు’ శీర్షికన ఇటీవల ‘ఆంధ్రజ్యోతి’లో ప్రత్యేక కథనం వచ్చాక.. రెండు నెలలకు వేతనాలు జమ చేసినట్లు అధికారులు చెప్తున్నారు. వ్యవసాయశాఖలోని ఆత్మ ప్రాజెక్ట్‌ ఉద్యోగులకు 120 మందికి ఐదు నెలలుగా జీతాలు పడలేదు. ఇందులో కొందరిని ఆర్బీకేలు, రైతు సమాచార కేంద్రంలో వినియోగించుకుంటూ కూడా జీతాలివ్వకపోవడంపై ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు.

సహకార శాఖలో సమగ్ర సహకార అభివృద్ధి ప్రాజెక్ట్‌ కింద పని చేస్తున్న ఉద్యోగులకు 22 నెలల జీతాలు ఇవ్వలేదు. ఉమ్మడి చిత్తూరు, కర్నూలు, తూర్పుగోదావరి జిల్లాల్లో ఐదేళ్ల పాటు అమలు చేసిన ఈ ప్రాజెక్ట్‌లో పని చేస్తున్న కొద్ది మంది ఉద్యోగులకు కూడా జీతాలివ్వలేదు. గతేడాది ముగిసిన ఈప్రాజెక్ట్‌కు ఎన్సీడీసీ రూ.139 కోట్లు ఏపీ ప్రభుత్వానికి ఇస్తే.. ఆ మొత్తాన్ని జగన్‌ సర్కార్‌ వాడేసింది. దీంతో ఎన్సీడీసీ ప్రత్యేక అకౌంట్‌ తెరిచినా..


నిధుల మంజూరుకు జీవో ఇవ్వకుండా వైసీపీ సర్కార్‌ కొర్రీ వేసింది. ఈ కారణంగా ప్రాజెక్ట్‌ నిర్వహణకు ఎన్సీడీసీ విడుదల చేసిన నిధులు కూడా స్తంభించిపోయాయని, గత ప్రభుత్వ విధానాలతో చిరుద్యోగులు ఇప్పటికీ ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఏపీ కో-ఆపరేటివ్‌ సర్వీస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఫణి పేర్రాజు శనివారం విజయవాడలో జరిగిన అసోసియేషన్‌ సమావేశంలో వ్యాఖ్యానించారు.

గత ప్రభుత్వం జగనన్న పాలవెల్లువ పథకం అమలు కోసం తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకు సహకార ఉద్యోగులను ఇబ్బంది పెట్టడమే కాకుండా, నెలకు రూ.15-20వేల ప్రయాణ ఖర్చులు భరించాల్సిన పరిస్థితి కల్పించిందని, రవాణా సదుపాయం కల్పించకుండా, కనీసం ఒక్క రూపాయి టీఏ బిల్లు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిందని వాపోయారు. ఇలాగే రాష్ట్రంలోని వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య, మత్స్య విశ్వవిద్యాలయాల బోధనేతర సిబ్బందికి జీతాలు సక్రమంగా పడని పరిస్థితి నెలకుంది. ముఖ్యంగా కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి నెలనెలా వేతనాలు అందడం లేదు. తమ జీతాల సమస్యపై సంబంధిత శాఖ మంత్రి దృష్టి సారించాలని ఆయా శాఖ ఉద్యోగులు కోరుతున్నారు.

Updated Date - Jul 08 , 2024 | 04:13 AM