Share News

AP Rains: వైఎస్ జగన్‌పై అమరావతి రైతులు ఫైర్

ABN , Publish Date - Sep 06 , 2024 | 08:02 PM

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్ ఇంకా విషం కక్కుతుండడంపై ఆ ప్రాంతానికి చెందిన రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీ వర్షాల కారణంగా రాజధాని అమరావతి ప్రాంతంలో ఎక్కడా నీరు నిలవ లేదని వారు స్పష్టం చేశారు.

AP Rains: వైఎస్ జగన్‌పై అమరావతి రైతులు ఫైర్

అమరావతి, సెప్టెంబర్ 06: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్ ఇంకా విషం కక్కుతుండడంపై ఆ ప్రాంతానికి చెందిన రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీ వర్షాల కారణంగా రాజధాని అమరావతి ప్రాంతంలో ఎక్కడా నీరు నిలవ లేదని వారు స్పష్టం చేశారు. ఈ సందర్బంగా ఇప్పటికైనా నీచ రాజకీయాలు మానుకోవాలనంటూ మాజీ సీఎం వైఎస్ జగన్‌కు వారు హితవు పలికారు.


అసలు విషయం వెలుగులోకి తెచ్చిన ఏబీఎన్..

ఇటీవల భారీ వర్షాల కారణంగా ఉమ్మడి విజయవాడ, ఉమ్మడి గుంటూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వరద పోటెత్తింది. అలాగే విజయవాడలోని బుడమేరు వాగు సైతం పొంగడంతో నగరంలోని వివిధ ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. అయితే రాజధాని అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లోని వరద పరిస్థితి ఇలా ఉందంటూ వైసీపీ సోషల్ మీడియా ఓ విధమైన విష ప్రచారానికి తెర తీసింది. అలాంటి పరిస్థితుల్లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రాజధాని ప్రాంతం ముంపునకు గురి కాలేదంటూ... డ్రోన్ విజువల్స్ ద్వారా అసలు విషయాన్ని వెలుగులోకి తీసుకు వచ్చింది.

తద్వారా సీడ్ యాక్సిస్ రోడ్, హైకోర్టుకు వెళ్లే మార్గం, ఏపీ సచివాలయానికి వెళ్లే మార్గంలో చుక్క నీకు కనిపించ లేదంటూ ఈ విజువల్స్‌లో స్పష్టం చేసింది. దీంతో రాజధాని ప్రాంతం వరద నీటిలో మునగలేదనే విషయం ప్రపంచానికి అర్థమైంది. దాంతో రాజధాని అమరావతి ప్రాంతంలో ముంపు లేదని.. కానీ విషం మాత్రం వారి ఆలోచనల్లో, కుట్రలు వారి రాజకీయాల్లో ఉన్నాయనే విషయం మరోసారి బహిర్గతమైనట్లు అయింది. అలాంటి వేళ.. రాజధాని ప్రాంత రైతులు పైవిధంగా తమదైన శైలిలోల స్పందించారు.


2014లో రాష్ట్ర విభజన..

2014లో రాష్ట్ర విజభన నేపథ్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయింది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాజధాని లేని రాష్ట్రంలోగా మిగిలింది. అదే సమయంలో అసెంబ్లీ ఎన్నికలు జరగడంతో.. ఆంధ్రప్రదేశ్ ఓటరు చంద్రబాబు సారథ్యంలోని టీడీపీకి పట్టం కట్టారు. దాంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సమాన దూరంలో రాజధాని ఉండాలని నాటి సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఆ క్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలోని తుళ్లూరు, వెలగపూడి తదితర 29 గ్రామాలను కలిపి రాజధాని ప్రాంతంగా ఎంపిక చేసి.. దానికి అమరావతి అని పేరు పెట్టారు.


ప్రతిపక్షనేతగా మద్దతు ఇచ్చి.. సీఎం కాగానే మాట తప్పిన వైనం..

నాటి ప్రతిపక్ష నేత వైయస్ జగన్.. రాజధాని అమరావతికి అసెంబ్లీ సాక్షిగా మద్దతు ప్రకటించారు. ఇక 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రా ఓటరు వైసీపీ పట్టం కట్టాడు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. అంతే ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధాను ఉండాలని నిర్ణయించారు. ఇదే నిర్ణయాన్ని ఆయన అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. ఈ ప్రకటనతో రాజధానికి వేలాది ఎకరాల భూములు ఇచ్చిన 29 గ్రామాల రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.


రైతుల పాదయాత్రలపై ఉక్కుపాదం..

నాటి నుంచి వారు చేపట్టిన ఆందోళనలు, దీక్షలు వేలాది రోజుల పాటు కొనసాగాయి. ఈ తమ గోడు వెళ్లబోసుకునేందుకు సీఎం వైఎస్ జగన్ అపాయింట్‌మెంట్ సైతం ఇవ్వలేదు. దాంతో వారు న్యాయస్థానం నుంచి దేవస్థానం, అలాగే అమరావతి నుంచి అరసవల్లి వరకు పాదయాత్రలు సైతం చేపట్టారు. అలా తమ మొర ఆ దేవదేవుడితో చెప్పుకునేందుకు రాజధాని ప్రాంత రైతులు ప్రయత్నించారు. ఆ సమయంలో సీఎం వైఎస్ జగన్ వారిపై తీవ్ర ఆంక్షలు సైతం విధించిన విషయం విధితమే.


2024 ఎన్నికల్లో ఓటరు కీలక నిర్ణయం..

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఓటరు కూటమికి పట్టం కట్టారు. దీంతో సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టారు. మళ్లీ రాజధాని అమరావతిలో నిర్మాణాలు జోరుందుకున్నాయి. అలాంటి వేళ రాజధాని అమరావతిపై వైసీపీ మళ్లీ విష ప్రచారానికి తెర తీసింది. అందులోభాగంగా భారీ వరదలతో అమరావతి ముంపునకు గురయిందంటూ ఓ విష ప్రచారం చిమ్మేందుకు ప్రయత్నాలు చేపట్టింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తలతోపాటు తెలుగు వార్తల కోసం..

Updated Date - Sep 06 , 2024 | 08:02 PM