SUISIDE ATTEMPT: చదువుకోరా.. తమ్ముడూ..!
ABN , Publish Date - Nov 05 , 2024 | 12:05 AM
తమ్ముడు పదో తరగతి చదువుతున్నాడు. బడికి సరిగా వెళ్లడం లేదు. చిన్నోడు ఏమైపోతాడో అని తల్లిదండ్రులు బాధపడుతున్నారు. ఇంటర్ చదువుతున్న అన్నకు ఆవేదన కలిగింది. ‘జులాయిగా తిరిగితే పాడైపోతావురా..! బాగా చదువుకో.. బడికి వెళ్లు.. అమ్మానాన్న నీ గురించి ఎంతగా బాధపడుతున్నారో చూడు..’ అని చాలా చెప్పి చూశాడు.
తమ్ముడు పదో తరగతి చదువుతున్నాడు. బడికి సరిగా వెళ్లడం లేదు. చిన్నోడు ఏమైపోతాడో అని తల్లిదండ్రులు బాధపడుతున్నారు. ఇంటర్ చదువుతున్న అన్నకు ఆవేదన కలిగింది. ‘జులాయిగా తిరిగితే పాడైపోతావురా..! బాగా చదువుకో.. బడికి వెళ్లు.. అమ్మానాన్న నీ గురించి ఎంతగా బాధపడుతున్నారో చూడు..’ అని చాలా చెప్పి చూశాడు. కానీ తమ్ముడిలో మార్పు రాలేదు. ‘రేయ్.. నేను చస్తేనైనా నువ్వు మారుతావా..?’ అని తీవ్ర ఆవేదన చెందాడు. అన్నంత పనీ చేసేందుకు రైలు కింద పడేందుకు వెళ్లాడు. సమయానికి పోలీసులు గమనించి.. అడ్డుకున్నారు. ఈ ఘటన గుత్తి పట్టణంలో ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. సీపీఐ కాలనీకి చెందిన ఓ వ్యక్తి ఆటో డ్రైవర్. ఆయన భార్య కూలి పనులకు వెళుతుంటారు. వారికి ఇద్దరు కుమారులు. పెద్దోడు ఇంటర్, చిన్నోడు పదో తరగతి చదువున్నారు. తల్లిదండ్రుల దిగులంతా చిన్నోడి గురించే. తమ్ముడిలో మార్పు కోసం అన్న ఏకంగా ప్రాణాలు తీసుకోబోయాడు. ఇంటి నుంచి అర్ధరాత్రి బయటకు వచ్చి.. గుంతకల్లు రోడ్డులోని రైల్వే గేటు వైపు వెళుతుండగా నైట్బీట్ కానిస్టేబుల్ కిరణ్, హోంగార్డు శ్రీరాములు అనుమానించి, విచారించారు. విషయం తెలుసుకుని పోలీస్ స్టేషనకు తరలించారు. తల్లిదండ్రులను స్టేషనకు పిలిపించి, అందరికీ కౌన్సెలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు. విద్యార్థి ప్రాణాలు కాపాడిన సిబ్బందిని సీఐ వెంకటేశ్వర్లు అభినందించారు.
- గుత్తి, ఆంధ్రజ్యోతి