POLICE COMMARATION DAY: పోలీసుల త్యాగాలు మరువలేనివి
ABN , Publish Date - Oct 21 , 2024 | 11:47 PM
SP Ratna paying homage at the police martyrs' stupa
అమరవీరుల ఆశయాల స్ఫూర్తితో విధులకు పునరంకితమవుదాం
జిల్లా ఎస్పీ రత్న
పుట్టపర్తిరూరల్, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): దేశభద్రత, సమాజ రక్షణలో పోలీసుల త్యాగాలు మరువలేనివని జిల్లా ఎస్పీ రత్న పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని, విధులకు పునరంకితమవుదామని పిలుపునిచ్చారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా స్థానిక జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలోని అమరవీరుల స్థూపం వద్ద సోమవారం ఘన నివాళి అర్పించారు. తొలుత సాయుధ పోలీసు బలగాల నుంచి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన, ఎస్పీ, ఏడీజే శైలజ, జూనియర్ సివిల్ న్యాయాధికారి రాకేష్, ఎమ్యెల్యేలు పల్లె సింధూరారెడ్డి, ఎంఎస్ రాజు, ఏఎస్పీ ఆర్ల శ్రీనివాసులు, మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఎస్పీ రత్న మాట్లాడుతూ... పోలీసులపై ప్రజలు పెట్టుకున్న విశ్వాసాన్ని వమ్ముచేయకుండా సమాజానికి సేవలందిద్దామన్నారు. విధుల్లో వీరోచితంగా పోరాడి అసువులు బాసిన పోలీసుల త్యాగాలు వృథాకారాదన్నారు. వారిత్యాగాలను నిత్యం స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన మాట్లాడుతూ.. దేశం, సమాజం కోసం పోలీసుల సేవలు మరువలేనివన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలొదిలిన ప్రతి అమర పోలీసుకు నివాళులు అర్పిస్తున్నామన్నారు.
చెక్కుల పంపిణీ: విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరుల కుటుంబాలకు కలెక్టర్, ఎస్పీ.. పోలీసుశాఖ తరఫున ఆర్థికసాయం చేశారు. అందుకు సంబంధించిన చెక్కులను పంపిణీ చేశారు. ఎమ్యెల్యే పల్లె సింధూరారెడ్డి సొంత నిధుల నుంచి చంద్రశేఖర్, బాబావలి కుటుంబాలకు రూ.20 వేల చొప్పున ఆర్థికసాయం చేశారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ విజయ్‌కుమార్, డీఎస్పీలు విజయ్‌కుమార్, శ్రీనివాసులు, శివన్నారాయణస్వామి, వెంకటేశ్వర్లు, పోలీసు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.