Share News

AP News : జెత్వానీ ఐఫోన్లు హ్యాక్‌!

ABN , Publish Date - Sep 20 , 2024 | 04:31 AM

ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. గత ప్రభుత్వంలో పోలీసులు ఈ వ్యవహారంలో తప్పుల మీద తప్పులు చేశారు.

AP News : జెత్వానీ ఐఫోన్లు హ్యాక్‌!

  • గత ప్రభుత్వంలో పోలీసుల నిర్వాకం

  • దుబాయ్‌ హ్యాకర్‌ను తీసుకొచ్చినట్టు సందేహాలు

  • తాజాగా సంచలన విషయాలు వెలుగులోకి

  • అరెస్ట్‌ చేశాక 5 మొబైల్‌ ఫోన్లు స్వాధీనం

  • సజ్జన్‌ను కాపాడేందుకు ఆధారాలు చెరిపేసేయత్నం

  • పాస్‌వర్డ్‌లు చెప్పాలని ఒత్తిడి

  • వెబ్‌బ్రౌజర్‌ ద్వారా లాగిన్‌

  • ‘యాపిల్‌’ నుంచి జెత్వానీ మెయిల్‌కు మెసేజ్‌లు

  • నివేదికలో నాటి డీజీపీ పేరు

  • ఆయన అనుమతితోనే ముంబైకి విశాల్‌ గున్నీ

(ఆంధ్రజ్యోతి-విజయవాడ)

ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. గత ప్రభుత్వంలో పోలీసులు ఈ వ్యవహారంలో తప్పుల మీద తప్పులు చేశారు. అవే ఇప్పుడు వారి మెడకు చుట్టుకున్నాయి. కాదంబరి జెత్వానీ, ఆమె తల్లిదండ్రులు ఆశా జెత్వానీ, నరేంద్రకుమార్‌ జెత్వానీ వాంగ్మూలాలతో తయారైన నివేదికలో కీలక అంశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో ప్రధానమైనది కాదంబరి ఐ ఫోన్లను హ్యాక్‌ చేయడం. ముంబైలో ఫిబ్రవరి 3వ తేదీన జెత్వానీ కుటుంబ సభ్యులను అరెస్టు చేసిన తర్వాత ఆమెకు సంబంధించిన ఐదు ఐ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటికి సంబంధించిన పాస్‌వర్డ్‌లు చెప్పాలని ఆమెపై తీవ్రంగా ఒత్తిడి చేశారు.అయినా కాదంబరి పాస్‌వర్డ్‌లు చెప్పలేదు. ముంబైలో న్యాయమూర్తి ఇంట్లో ఆమెను హాజరు పరిచి ట్రాన్సిట్‌ వారెంట్‌పై విజయవాడకు తీసుకొచ్చారు.

Untitled-2 copy.jpg

కోర్టులో హాజరుపరిచిన తర్వాత కాదంబరి కుటుంబ సభ్యులను జైలుకు పంపారు. ఒక కేసులో నిందితులను అరెస్టు చేశాక వారి నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులు, నగదును కోర్టుకు అప్పగించాలి. ఈ కేసులో పోలీసులు, అధికారులు ఆ పని చేయలేదు. ముంబైలో పారిశ్రామికవేత్త సజ్జన్‌ జిందాల్‌పై కాదంబరి పెట్టిన కేసు వ్యవహారం, కుక్కల విద్యాసాగర్‌కు సంబంధించిన ఆధారాలు ఫొటోలు, వీడియోలు ఈ ఫోన్లలో ఉన్నాయి. ఆ ఆధారాలు లేకుండా చేయగలిగితే ముంబై కేసులో జిందాల్‌కు విముక్తి కలుగుతుందని, విద్యాసాగర్‌ ఇబ్రహీంపట్నంలో పెట్టిన కేసులో ఆమె ఇరుక్కుపోతుందని భావించారు.

కాదంబరి పాస్‌వర్డ్‌లు చెప్పకపోవడంతో ఆమె ఐదు ఐ ఫోన్లను కోర్టులో సమర్పించలేదు. పోలీసులు తమ వద్దే పెట్టుకుని హ్యాక్‌ చేశారు. ఫిబ్రవరి 7న ఒకసారి, 21న ఒకసారి ఇది జరిగింది. వెబ్‌బ్రౌజర్‌ ద్వారా ఐక్లౌడ్‌ను ఉపయోగించినట్టు ఆమె మెయిల్‌కు యాపిల్‌ కంపెనీ నుంచి మెసేజ్‌లు వెళ్లాయి. ఆమె జైలు నుంచి విడుదలైన తర్వాత ఈ-మెయిల్‌ను పరిశీలించగా ఈ విషయం తెలిసింది. దీంతో ఈ ఫోన్ల పాస్‌వర్డ్‌ను ఆమె రీసెట్‌ చేసుకున్నారు.

దీనికి సంబంధించిన మెసేజ్‌ ఆమె మెయిల్‌కు వెళ్లింది. పోలీసులు తమ వద్ద పెట్టుకున్న ఆమె ఫోన్లను హ్యాక్‌ చేయడానికి ప్రత్యేకంగా దుబాయ్‌ నుంచి హ్యాకర్‌ను రప్పించినట్టు అనుమానిస్తున్నారు. దీనిపై అంతర్గతంగా విచారణ సాగుతోంది. ఐక్లౌడ్‌ను పోలీసులు ఏవిధంగా తెరిచారన్నది లాగ్‌ వివరాలను పరిశీలిస్తే తెలుస్తుంది. ఈ లాగ్‌ వివరాలు యాపిల్‌ సంస్థ వద్ద మాత్రమే ఉంటాయి. ఫోన్ల యజమానులు మొయిల్‌లో అప్లికేషన్‌ పంపితేనే ఆ వివరాలను యాపిల్‌ సంస్థ ఇస్తుంది. దీంతో కాదంబరి ఈ లాగ్‌ వివరాలను ఇవ్వాలని యాపిల్‌ సంస్థకు లేఖ రాయబోతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.


  • ఆపరేషన్‌ అక్కడ.. టీఏ బిల్లు ఇక్కడ

జెత్వానీని అరెస్టు చేయడానికి విజయవాడ నుంచి అప్పటి డీసీపీ విశాల్‌గున్నీ ఆధ్వర్యంలో ఒక బృందం ముంబై వెళ్లింది. ఫిబ్రవరి 1న విమాన టికెట్లు బుక్‌ చేసుకుని 2, 3 తేదీల్లో ఈ బృందం ముంబైలో గడిపింది. కాదంబరి అరెస్టు ఆపరేషన్‌కు నేతృత్వం వహించిన విశాల్‌గున్నీ పెట్టిన టీఏ బిల్లు చూసి పోలీసు వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. ఫిబ్రవరి 2న విజయవాడలోని అజిత్‌సింగ్‌ నగర్‌, నున్న, కేదారేశ్వరపేటలో పర్యటించినట్టు విశాల్‌ గున్నీ టీఏ బిల్లు పెట్టారు. 3న కూడా నగరంలోని మరికొన్ని ప్రాంతాల పేర్లు రాసి టీఏ బిల్లు పెట్టారు. ఆ సమయంలో ఆయన ముంబైలో ఉన్నారు. విచారణాధికారులు ఈ బిల్లుల వివరాలు సేకరించినట్టు తెలిసింది.

  • నివేదికలో మాజీ డీజీపీ పేరు

ప్రభుత్వానికి చేరిన విచారణ నివేదికలో మాజీ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి పేరు ఉన్నట్టు సమాచారం. ‘పీఎ్‌సఆర్‌ ఆంజనేయులు అప్పటి సీపీ కాంతిరాణాను, నన్ను సీఎం ఆఫీసుకు పిలిపించారు. అక్కడ జెత్వానీ అరెస్టుకు సంబంధించి టాస్క్‌ మొత్తం వివరించారు. తర్వాత కాంతిరాణా అప్పటి డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డికి ఫోన్‌ చేశారు. కాదంబరి కేసు అరెస్టు విషయంలో నన్ను ముంబైకు పంపుతున్నట్టు వివరించారు. దీనికి రాజేంద్రనాథ్‌రెడ్డి గోహెడ్‌ అన్నారు’ అని గున్నీ వాంగ్మూలంలో పేర్కొన్నట్టు తెలిసింది.

Updated Date - Sep 20 , 2024 | 04:31 AM