Share News

AP News : సాహసమే!

ABN , Publish Date - Aug 16 , 2024 | 06:07 AM

నాడు దివి నుంచి భువికి గంగను దించేందుకు భగీరథ మహర్షి మహా ప్రయత్నమే చేశారు. నేడు... తుంగభద్రమ్మను కాపాడుకునేందుకు ఇంజనీర్లు భగీరథ ప్రయత్నం చేస్తున్నారు.

AP News : సాహసమే!

  • వరద ఉండగానే స్టాప్‌లాగ్‌ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం

  • తుంగభద్ర జలాలను కాపాడటమే లక్ష్యంగా ప్రయత్నం

  • జిందాల్‌ నుంచి ప్రాజెక్టుకు చేరుకున్న మొదటి బ్లాక్‌

  • వెడల్పు రెండు అంగుళాలు ఎక్కువవడంతో సమస్య

  • అటూ ఇటూ అంగుళం చొప్పున తగ్గిస్తున్న కార్మికులు

  • నేడు గైడ్‌ యాంగిల్‌లోకి స్టాప్‌లాగ్‌ ఎలిమెంట్‌

  • 1624 అడుగుల వద్ద ప్రవహిస్తున్న తుంగభద్ర

  • అక్కడి నుంచి 11 అడుగులు నీటిలోనే కిందికి దించాలి

  • ప్రక్రియలో అత్యంత కీలకమైన దశ ఇదే

  • పాత గేటు ముక్క గాడిలో ఇరుక్కున్నట్లు గుర్తింపు

(రాయదుర్గం/బళ్లారి/కర్నూలు - ఆంధ్రజ్యోతి)

నాడు దివి నుంచి భువికి గంగను దించేందుకు భగీరథ మహర్షి మహా ప్రయత్నమే చేశారు. నేడు... తుంగభద్రమ్మను కాపాడుకునేందుకు ఇంజనీర్లు భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. తుంగభద్ర జలాశయంలో కొట్టుకుపోయిన 19వ నంబరు క్రస్టుగేటు స్థానంలో స్టాప్‌లాగ్‌ బిగించే ప్రక్రియ గురువారం పకడ్బందీగా మొదలైంది. ‘ప్లాన్‌ -ఏ’లో భాగంగా అత్యంత సున్నితమైన, ప్రమాదకరమైన పనులను చేపట్టారు. జిందాల్‌లో తయారు చేయించిన స్టాప్‌లాగ్‌ తొలిబ్లాక్‌ను గురువారం భారీ వాహనంపై ఆనకట్ట వద్దకు తరలించారు.

క్రస్ట్‌గేట్ల నిపుణుడు కన్నయ్యనాయుడు, ఐదుగురు ఇంజనీర్ల పర్యవేక్షణలో తమిళనాడుకు చెందిన కార్మికులు బ్లాక్‌ను కిందికి దించారు. గేటు అమరిక కోసం కౌంటర్‌ వెయిట్‌ కింది భాగంలో గంట పాటు వెల్డింగ్‌ చేశారు. 1635 అడుగుల వద్ద స్టాప్‌లాగ్‌ను ‘గైడ్‌ యాంగిల్‌’లోకి (గేటును అటూఇటు పట్టి ఉంచే నిర్మాణం) దించాల్సి ఉంది. 60 అడుగుల వెడల్పు... నాలుగు అడుగుల ఎత్తు... 13 టన్నుల బరువైన భారీ ఇనుప నిర్మాణమిది!

అయితే... కొలతల్లో కాస్త తేడా వచ్చింది. రాతి గేట్‌వాల్‌ కన్నా ప్రస్తుతం తయారు చేయించిన స్టాప్‌లాగ్‌ రెండు అంగుళాలు ఎక్కువైంది. దీంతో... రెండు వైపులా ఒక్కో అంగుళం చొప్పున అరగదీయాల్సి వస్తోంది. రాత్రి 10 గంటల దాకా ఆ పని కొనసాగింది. ఆ తర్వాత పనులను నిలిపివేశారు. శుక్రవారం స్టాప్‌లాగ్‌ బ్లాక్‌ను అమర్చే ప్రక్రియ తిరిగి ప్రారంభిస్తారు. సుమారు 110 మంది కార్మికులు ఇందులో భాగస్వాములయ్యారు.


ఆ 11 అడుగులు అత్యంత కీలకం

స్టాప్‌లాగ్‌ను 1635 అడుగుల ఎత్తులో గైడ్‌ యాంగిల్‌లో అమర్చడం ఈ మొత్తం ప్రక్రియలో తొలిఘట్టం. స్టాప్‌లాగ్‌ను అటూ ఇటూ అంగుళం చొప్పున తగ్గించిన అనంతరం... గైడ్‌ యాంగిల్‌లో కూర్చోబెడతారు. అక్కడి నుంచి నీటిమట్టం తగిలే దాకా... అంటే 1624 అడుగుల వరకు సులువుగానే స్టాప్‌లాగ్‌ బ్లాక్‌ను కిందికి దించవచ్చు. ఆ తర్వాతి నుంచి 11 అడుగులు కిందికి, స్పిల్‌వే లెవెల్‌ వద్ద బెడ్‌ మీద కూర్చోబెట్టాలి! ఈ ప్రక్రియలో అత్యంత సంక్లిష్టమైనది, కీలకమైనది ఇదే!

Untitled-4 copy.jpg

స్పిల్‌వే నుంచి శరవేగంగా దూసుకొస్తున్న నీటి ప్రవాహాన్ని ఆపుతూ... స్టాప్‌లాగ్‌ బ్లాక్‌ను లోపలికి దించాలి. ఈ 11 అడుగుల ప్రయాణం నీళ్లలోనూ సాగుతుంది. అయితే... కొట్టుకుపోయిన 19వ గేటు తాలూకు ముక్క ఒకటి లోపలే ఇరుక్కున్నట్లు గుర్తించారు. దానిని కూడా తొలగించాల్సి ఉంది.

ఇది రాతి కట్టడం కావడంతో... ఒక్క రాయి దెబ్బ తిన్నా పెను ప్రమాదం తలెత్తే ప్రమాదముందని ఇంజనీర్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి అడుగూ ఆచితూచి వేస్తున్నారు. పనుల నేపథ్యంలో డ్యామ్‌ సమీపానికి ఎవ్వరినీ అనుమతించడం లేదు. తుంగభద్ర ఆనకట్ట కింది భాగంలో నది రెండు పాయలుగా ప్రవహిస్తోంది. అక్కడికి కూడా ప్రజలను వెళ్లనివ్వడం లేదు. పూర్తి స్థాయిలో నిషేధం విధించారు. ప్రస్తుతం జిందాల్‌లో తయారైన స్టాప్‌లాగ్‌ ఎలిమెంట్‌ను అమర్చే ప్రక్రియ మొదలుపెట్టారు. ఇంకా... నారాయణ ఇంజనీరింగ్‌ హిందూస్థాన్‌ ఇంజనీరింగ్‌ వర్క్‌షా్‌పలలోనూ బ్లాక్‌లు దాదాపుగా సిద్ధమయ్యాయి.


నీటిని కాపాడాలనే లక్ష్యంగా..

ఇంజనీర్ల శ్రమ ఫలించి స్టాప్‌లాగ్‌ ఏర్పాటు విజయవంతం కావాలని... కర్ణాటకలోని బళ్లారి, రాయచూరు, కొప్పళ్‌, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, అనంతపురం, కడప ఆయకట్టు రైతులు ప్రార్థిస్తున్నారు. ఈ నేపథ్యంలో... వరద వేగంలోనూ ప్రాణాలను పణంగాపెట్టి ఇంజనీర్లు, సిబ్బంది సాహసోపేతంగా పని చేస్తున్నారు. డ్యామ్‌ 19వ గేటు ఈనెల 10వ తేదీన కొట్టుకుపోయింది.

ఆ సమయంలో 105.788 టీఎంసీల నీటి నిల్వ ఉంది. స్పిల్‌వే లెవల్‌ 1,613 అడుగుల వరకు డ్యాంను ఖాళీ చేసి ఆ తరువాత స్టాప్‌లాగ్‌ ఎలిమెంట్‌ ఏర్పాటు చేయాలని మొదట్లో భావించారు.

అంటే.. దాదాపు 62 టీఎంసీల నీటిని వృథాగా కిందికి వదిలేయడమే! అదే జరిగితే కర్ణాటక సహా కరువు రాయలసీమ జిల్లాలు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంది. దీంతో వీలైనంతగా నీటిని కాపాడుకోవాలనే సంకల్పంతో గురువారం 1625.22 అడుగుల లెవల్‌లో 77.21 టీఎంసీలు నీటి నిల్వ ఉండగానే స్టాప్‌లాగ్‌ను అమర్చే పని ప్రారంభించారు.


ఇది మోడల్‌ కావాలి..

ఉధృతంగా ప్రవహిస్తున్న నీటికి అడ్డుకట్ట వేస్తున్న స్టాప్‌లాగ్‌ ఏర్పాటు ప్రక్రియ సాహసోపేతమైనదని క్రస్ట్‌గేట్‌ నిపుణుడు కన్నయ్య నాయుడు అన్నారు. దేశంలో మొదటి సారి ఇలాంటి ప్రయత్నం జరుగుతోందని, ఇది విజయవంతం కావాలని, ఇలాంటి సమస్యలకు మున్ముందు మార్గదర్శకంగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు.

Updated Date - Aug 16 , 2024 | 06:51 AM