పౌర సేవల్లో డ్రోన్ల వినియోగం
ABN , Publish Date - Nov 20 , 2024 | 05:02 AM
పౌర సేవల రంగంలోకి డ్రోన్ల వినియోగాన్ని తీసుకొస్తూ రాష్ట్ర ప్రభుత్వ మౌలిక సదుపాయాల కల్పన శాఖ ‘డ్రోన్ 2024-29 పాలసీ 4.ఓ’ను విడుదల చేసింది.
వేలాది మందికి శిక్షణ... ఏపీ డ్రోన్ పాలసీ విడుదల
అమరావతి, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): పౌర సేవల రంగంలోకి డ్రోన్ల వినియోగాన్ని తీసుకొస్తూ రాష్ట్ర ప్రభుత్వ మౌలిక సదుపాయాల కల్పన శాఖ ‘డ్రోన్ 2024-29 పాలసీ 4.ఓ’ను విడుదల చేసింది. ఈ మేరకు మౌలిక సదుపాయాల శాఖ కార్యదర్శి సరేశ్ కుమార్ మంగళవారం ఉత్తర్వు జారీ చేశారు. దేశీయ డ్రోన్ మార్కెట్‌ను విస్తరించేలా.. వ్యవసాయం, సర్వే, మౌలిక సదుపాయాలు, విపత్తు నిర్వహణ, ఆరోగ్యం, రవాణా ఇలా అన్ని రంగాల్లోనూ ఈ సేవలను విస్తృతం చేసేలా డ్రోన్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ ఈ పాలసీని రూపొందించింది. దేశీయంగా డ్రోన్ వినియోగం క్రమంగా పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో రాష్ట్రంలో డ్రోన్ సిస్టమ్ డిజైన్ అండ్ మాన్యుఫాక్చరింగ్ (డీఎ్‌సడీఎం), డ్రోన్ ఎనేబుల్డ్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్ (డీఈటీఎ్‌స)ను అమలులోకి తీసుకువస్తున్నట్టు మౌలిక సదుపాయాల కల్పన శాఖ వెల్లడించింది. అయితే డ్రోన్ల వినియోగించడంలో నిష్ణాతులు లేరు కాబట్టి.. ఈ రంగంలో శిక్షణ అందించే సంస్థను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. దీనికోసం కర్నూలు జిల్లా ఓర్వకల్లును డ్రోన్ హబ్‌గా తయారు చేయాలని నిర్ణయించింది. ఇక్కడ వేలాది మందికి డ్రోన్ పైలట్లుగా శిక్షణ ఇవ్వనున్నారు. అలాగే డ్రోన్ వినియోగానికి సంబంధించి 2021లో కేంద్ర పౌర విమానయాన శాఖ జారీచేసిన మార్గదర్శకాలను సడలించే దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.