Excise stations : కోట్లలో కిక్కు
ABN , Publish Date - Oct 12 , 2024 | 03:13 AM
మద్యం షాపుల కోసం దరఖాస్తులు వెల్లువెత్తాయి. దరఖాస్తుల ద్వారా కనీసం రూ.వెయ్యి కోట్లయినా వస్తాయా... అనే ఆందోళనలు, అనుమానాలు పటాపంచలయ్యాయి. శుక్రవారం అర్ధరాత్రి సమయానికి 89,643 దరఖాస్తులు అందాయి. ఒక్కో దరఖాస్తుకు రూ.2 లక్షల చొప్పున... 1792.86 కోట్ల ఆదాయం సమకూరింది.
దరఖాస్తుల ఆదాయం రూ.1792.86 కోట్లు
మద్యం షాపుల కోసం 89,643 దరఖాస్తులు
ఎల్లుండి లాటరీ ద్వారా షాపుల కేటాయింపు
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
మద్యం షాపుల కోసం దరఖాస్తులు వెల్లువెత్తాయి. దరఖాస్తుల ద్వారా కనీసం రూ.వెయ్యి కోట్లయినా వస్తాయా... అనే ఆందోళనలు, అనుమానాలు పటాపంచలయ్యాయి. శుక్రవారం అర్ధరాత్రి సమయానికి 89,643 దరఖాస్తులు అందాయి. ఒక్కో దరఖాస్తుకు రూ.2 లక్షల చొప్పున... 1792.86 కోట్ల ఆదాయం సమకూరింది. ఇది కాస్త అటూ ఇటుగా ఒక ఏడాదికి లైసెన్సీలు చెల్లించే ఫీజుతో సమానం! తుది లెక్కలు తేలే సరికి దరఖాస్తుల సంఖ్య 90వేలకు చేరవచ్చని ఎక్సైజ్ అధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాలను రద్దు చేసి... రాష్ట్రంలోని 3396 మద్యం దుకాణాలను ప్రైవేటుకు అప్పగించాలని కూటమి సర్కారు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
దుకాణాల కోసం ఈనెల 1వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. శుక్రవారం రాత్రి 7గంటల వరకు రిజిస్ర్టేషన్, రుసుము చెల్లింపులకు అవకాశం కల్పించారు. రుసుములు చెల్లించిన వారు పలుచోట్ల రాత్రి 12గంటల వరకు దరఖాస్తులు సమర్పించారు. అటు ఆన్లైన్లో కొందరు... ఎక్సైజ్ స్టేషన్ల క్యూల్లో నిలబడి కొందరు దరఖాస్తులు సమర్పించారు.
ఎల్లుండి లాటరీ
మద్యం షాపులను సోమవారం లాటరీ ద్వారా కేటాయిస్తారు. 3396 షాపులకు వేర్వేరుగా లాటరీలు తీస్తారు. ప్రతి దరఖాస్తుదారునికి ఒక నంబరు కేటాయించి, మాన్యువల్‌గా లాటరీ తీస్తారు. దీనికోసం అన్ని జిల్లాల్లో కలెక్టర్ల సమక్షంలో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. లాటరీలో షాప్ దక్కిన వారు ఈనెల 16 నుంచి షాపులు ప్రారంభించుకోవచ్చు. అయితే, లైసెన్స్ పొందిన 24గంటల్లో మొదటి విడత లైసెన్స్ ఫీజు చెల్లించాలి.
దరఖాస్తుల లెక్క...
మద్యం దుకాణాల కోసం మొదటి ఏడు రోజులు పెద్దగా దరఖాస్తులు అందలేదు. రాజకీయ నాయకుల జోక్యం దీనికి ప్రధాన కారణం. నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరికలు జారీ చేయడంతో అందరూ దారికి వచ్చారు. ఆ తర్వాత ఒక్కసారిగా దరఖాస్తులు వెల్లువెత్తడం మొదలైంది. ఇవీ లెక్కలు...
ఎన్టీఆర్ జిల్లాలో షాపుల కోసం భారీ పోటీ నెలకొంది. జిల్లాలో 113 షాపులుండగా... ఏకంగా 5787 దరఖాస్తులు అందాయి. అంటే... ఒక్కో షాపునకు సగటున 51 మంది పోటీపడుతున్నారు.
పశ్చిమ గోదావరిలో ఒక్కో షాపునకు 31 మంది పోటీలో ఉన్నారు. అతి తక్కువగా... తిరుపతి జిల్లాలో ఒక్కో షాప్ కోసం సగటున 16 దరఖాస్తులు మాత్రమే అందాయి.
ఎన్టీఆర్ జిల్లాలో ఒక షాప్ కోసం ఏకంగా 132 దరఖాస్తులు అందడం విశేషం. మరో దుకాణం కోసం 120 మంది దరఖాస్తులు వేశారు. వంద దరఖాస్తులు దాటిన షాపులు రాష్ట్రం మొత్తంలో ఈ రెండే!
పశ్చిమ గోదావరి జిల్లాలో 8 షాపుల కోసం భారీ పోటీ నెలకొంది. ఒక్కో షాప్ కోసం 70కిపైగా దరఖాస్తులు అందాయి.
శ్రీసత్యసాయి జిల్లాలో చాలా షాపులకు దరఖాస్తులు రెండంకెల సంఖ్య చేరలేదు.
కాకినాడ, శ్రీసత్యసాయి, ప్రకాశం జిల్లాలు బాగా వెనకబడిపోయాయి. ఇవి కూడా మెరుగ్గా ఉండి ఉంటే ప్రభుత్వం అంచనా వేసినట్లుగా లక్ష దరఖాస్తుల సంఖ్య వచ్చేది.