Share News

Andhra Pradesh: భోగాపురంలో తవ్వేకొద్దీ భూదందాలు

ABN , Publish Date - Jun 01 , 2024 | 03:58 AM

సాధారణంగా పరిశ్రమల స్థాపన కోసమో, ఇతర అవసరాల కోసమో ప్రభుత్వం రైతుల నుంచి భూములు సేకరిస్తుంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కొత్త విషయం ఏంటంటే.. ఓ ప్రైవేటు వ్యక్తి గ్రామాలకు గ్రామాలనే తన వశం చేసుకుంటున్నాడు.

Andhra Pradesh: భోగాపురంలో తవ్వేకొద్దీ భూదందాలు

భోగాపురంలో తవ్వేకొద్దీ భూదందాలు

సాధారణంగా పరిశ్రమల స్థాపన కోసమో, ఇతర అవసరాల కోసమో ప్రభుత్వం రైతుల నుంచి భూములు సేకరిస్తుంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కొత్త విషయం ఏంటంటే.. ఓ ప్రైవేటు వ్యక్తి గ్రామాలకు గ్రామాలనే తన వశం చేసుకుంటున్నాడు. అందులోనూ ఎకరా 2 కోట్లకు పైగా విలువ చేసే భూములను కారుచౌకగా 20-30 లక్షలకే బెదిరించి మరీ లాక్కొంటున్నాడు.

ఆయన లీలలు రోజుకొకటి బయటపడుతున్నాయి. ఆ ప్రైవేటు వ్యక్తి... మరెవరోకాదు. ‘పెద్దసారు’కు స్వయానా మేనల్లుడేనట. బాధిత రైతులే ఈ విషయం చెబుతున్నారు. ఆయన సేవలో ఓ సీనియర్‌ రెవెన్యూ అధికారి, విశాఖ, విజయనగరం జిల్లాలకు చెందిన ఇద్దరు అధికారులు తరించిపోయారు. ఆయన వందలాది ఎకరాలు సొంతం చేసుకునే పనిలో ఉన్నారు.

కొత్తగా మరో 225 ఎకరాల

‘వ్యవహారం’ వెలుగులోకి

అందులో 45 ఎకరాలు జిరాయితీ

30 లక్షల చొప్పున రిజిస్ట్రేషన్‌

180 ఎకరాల అసైన్డ్‌ భూములకు

రైతులతో అగ్రిమెంట్లు

‘కడప’ వ్యక్తి గుప్పిట్లో 6 గ్రామాలు

ఆయన ‘పెద్దసారు’కు మేనల్లుడట

గుట్టు విప్పిన బాధిత రైతులు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

భోగాపురంలో తవ్వే కొద్దీ పెద్దల భూబాగోతం బయటపడుతోంది. జగన్‌ ప్రభుత్వంలోని ‘పెద్దసారు’ సొంత మనిషి, కడప జిల్లా వ్యక్తి భూదాహం అంతా ఇంతా కాదు. విశాఖపట్నం పక్కనే ఉన్న భోగాపురం మండలంలో ఇప్పటి వరకు 698 ఎకరాల ‘లెక్కే’ తేలింది. ఇప్పుడు కొత్తగా మరో 225 ఎకరాల ‘వ్యవహారం’ వెలుగులోకి వచ్చింది. అందులో 45 ఎకరాల జిరాయితీ భూములను సొంతం చేసుకున్నారు.

మార్కెట్లో ఎకరా 2 కోట్లకు పైగా విలువ చేసే భూములను 30 లక్షల చొప్పున చేజిక్కించుకున్నారు. మరో 180 ఎకరాల అసైన్డ్‌ భూములను దక్కించుకునేందుకు అగ్రిమెంట్లు చేసుకున్న విషయం బయటకొచ్చింది. కోట్లాది రూపాయలు విలువ చేసే జిరాయితీ, అసైన్డ్‌ భూములను కారుచౌకగా కొట్టేస్తున్నారు.


భోగాపురం మండలంలో కడప జిల్లా వ్యక్తి సాగించిన భూ అక్రమాలను ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే 218 ఎకరాల అసైన్డ్‌ భూములను ఆయన సొంతం చేసుకున్నారు. మరో 160 ఎకరాల కొనుగోలుకు అగ్రిమెంట్లు చేసుకున్నారు. మరో 320 ఎకరాలకు అగ్రిమెంట్లు సిద్ధం చేసుకున్నారు.

ఇవిగాక ఈ భూముల పక్కనే ఉన్న మరో 225 ఎకరాలను చేజిక్కించుకునేందుకు ‘స్కెచ్‌’ వేసిన విషయం తాజాగా బయటపడింది. అధికారుల అండతో రైతుల నుంచి తక్కువ ధరకు బలవంతంగా భూములు లాక్కొంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు తమ పట్టా భూములను కూడా అమ్ముకునేలా ఒత్తిడి చేశారు. ఈ తప్పుడు పనికి రెవెన్యూ యంత్రాంగాన్ని వాడుకున్నట్లు తెలిసింది.

  • త్రిముఖ వ్యూహం

భోగాపురం మండలంలో సముద్రం పక్కన కంచేరు, కొంగవానిపాలెం గ్రామాలు ఉన్నాయి. అక్కడ నిషేధిత విముక్తి పొందిన అసైన్డ్‌ భూములు, జిరాయితీ (పట్టా) భూములు ఉన్నాయి. పక్కనే భోగాపురం ఉంటుంది. ఆ భూముల చుట్టే బీచ్‌ కారిడార్‌. వీటిని తమ మాస్టర్‌ప్లాన్‌లో బంధించేలా పెద్దసారు మేనల్లుడు వ్యూహం పన్నారు. మొదట భోగాపురం మండలంలోని ఆరు గ్రామాలను గుప్పిటపట్టారు.

అసైన్డ్‌ భూములను చేజిక్కించుకున్నారు. తర్వాత వాటి మధ్యలో ఉన్న జిరాయితీ భూములపై కన్నేశారు. పెద్ద పరిశ్రమలు రాబోతున్నాయని, భూ సేకరణ కింద తక్కువ రేటుకు భూములు తీసుకుంటారని రైతులను భయపెట్టారు. కడప అల్లుడి టీమ్‌కు భూములు ధారాదత్తం అయ్యేలా ఓ సీనియర్‌ రెవెన్యూ అధికారి చాపకింద నీరులా పనిచేశారని తెలిసింది. ఇందుకు విశాఖ, విజయనగరం జిల్లాలకు చెందిన ముఖ్య అధికారులు ఇద్దరు బహిరంగంగానే అన్నివిధాలా సహకరించారు.

పెద్దసారు ఆశీస్సులు, మెప్పుకోసం అడ్డదారులు తొక్కారు. రెవెన్యూ యంత్రాంగాన్ని పురమాయించి ఎక్కడా ఇబ్బంది రాకుండా భూముల దందా సాఫీగా సాగిపోయేలా తమ వంతు కృషి చేశారు. పెద్దసారు దృష్టిలో మంచి మార్కులు కొట్టేశారు. ఫలితంగా కంచేరు, కొంగవానిపాలెం గ్రామాల పరిధిలో 45 ఎకరాల జిరాయితీ భూమిని మేనల్లుడి టీమ్‌ దక్కించుకోగలింది.


దీంతో ఆ రెండు గ్రామాల పరిధిలో అతిపెద్ద భూస్వామిగా ఆయనే నిలిచారు. ఆ భూములతో ఏం చేస్తారో, ఏ ప్రాజెక్టులు చేపడుతారో తెలియదు కానీ రైతులకు సెంటు భూమి కూడా లేకుండా మొత్తం కొనాలని టార్గెట్‌గా పెట్టుకున్నట్టు తెలిసింది.

గత ఏడాది సెప్టెంబరులో జగన్‌ సర్కారు ఆంధ్రప్రదేశ్‌ అసైన్‌మెంట్‌ భూముల చట్టం-1977(పీఓటీ) సవరించడానికి ముందే పెద్దసారు మేనల్లుడి టీమ్‌ విశాఖలో దిగింది. భోగాపురం మండలంలోని కంచేరు, కొంగవానిపాలెం, ముంజేరు, బసవపాలెం, క వులరాడ, పోలిపల్లి తదితర గ్రామాల్లో వాలిపోయింది.

218 ఎకరాల అసైన్డ్‌ భూములను బినామీల పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. ఎకరా రెండు కోట్లకు పైగా ధర పలికే భూములను ఎకరా 20 లక్షలు చొప్పున కారు చౌకగా కొట్టేశారు. మరో 160 ఎకరాలకు సంబంధించి ఫ్రీ హోల్డ్‌ దరఖాస్తులు కలెక్టర్‌ పరిశీలన లో ఉన్నాయి. వీటికి ఇప్పటికే అగ్రిమెంట్లు చేసుకున్నారు. ఎకరా 20 లక్షలు ధర చొప్పున 50 శాతం చెల్లింపులు చేశారు. మరో 320 ఎకరాలకు అగ్రిమెంట్లు సిద్ధం చేసుకున్నారు.

ఇవిగాక కొంగవానిపాలెం, కంచే రు గ్రామాల పరిధిలోనే 45 ఎకరాల జిరాయితీ భూమిని రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. ఈ రెండు గ్రామాల పరిధిలోని అసైన్డ్‌ భూములను తీసుకున్నాక, వాటి మధ్యలో ఉన్న జిరాయితీ భూములను లాక్కున్నట్లు తెలిసింది. ఇందుకు రెవెన్యూ శాఖలోని కీలక అధికారిని ఉపయోగించుకున్నట్లు సమాచారం.

ఎకరాకు 30 లక్షల మేర చెల్లింపులు జరిపినట్లు తెలిసింది. ఈ ప్రక్రియలో ఓ ప్రముఖ రిసార్ట్‌ యజమాని కూడా పాల్గొన్నారని సమాచారం. ఆయనకు అదే ప్రాంతంలో ఖరీదైన బీచ్‌ రిసార్ట్‌ ఉంది. కొన్ని అగ్రిమెంట్లు ఆయన పర్యవేక్షణలో జరిగినట్లు తెలిసింది.


కంచేరులో సముద్ర తీరానికి అతి సమీపంలో ఉన్న జిరాయితీ భూములు 18 ఎకరాలను భారీ ప్రాజెక్టుల బూచి చూపి కొనుగోలు చేసినట్లు తెలిసింది. మరో 180 ఎకరాల అసైన్డ్‌ భూములపై స్కెచ్‌ వేశారు. అడ్వాన్స్‌లు ఇచ్చి అగ్రిమెంట్లు చేసుకున్నారు. కంచేరు, కొంగవానిపాలెం, పోలిపల్లి పరిధిలో భూములు ఉన్నాయి. మేనల్లుడి భూ దందాకు పేదలు, దళితులు, గిరిజన రైతులు బలవుతున్నారు.

  • పెద్దసారు కన్నుపడగానే...

భోగాపురంలో గ్రీన్‌ఫీల్డ్‌ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే భూసేకరణ పూర్తయింది. దీన్ని దృష్టిలో పెట్టుకొనే విశాఖ జిల్లా భీమిలి నుంచి విజయనగరం జిల్లా భోగాపురం వరకు బీచ్‌ కారిడార్‌ను ప్రతిపాదించారు.

దీంతో పాటు ఇండస్ట్రియల్‌ కారిడార్‌ను తీసుకొస్తున్నారు. ఇవన్నీ కార్యరూపం దాలిస్తే సముద్రతీరం వెంట ఉన్న కంచేరు, కొంగవానిపాలెం గ్రామాల దిశ, దశ మారుతాయి. భూముల ధరలు ఆకాశాన్నంటుతాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వంలో ముఖ్యస్థానంలో ఉన్న పెద్దసారు కన్నుపడింది. అంతే.. అక్కడి భూములను చేజిక్కించుకునేందుకు కడప జిల్లాకు చెందిన మేనల్లుడిని రంగంలోకి దింపారు.

  • ఇక పెద్దసారే చెప్పాలి

భోగాపురంలో అసైన్డ్‌ భూములు కొన్న వ్యక్తి పెద్దసారుకు సొంత మనిషని తొలుత ప్రచారం జరిగింది. అయితే, భూములను కారుచౌకగా అమ్ముకొని నష్టపోయిన రైతులు ఇప్పుడు గుట్టు విప్పేశారు. పెద్దసారు సొంత మనిషిగా భావిస్తున్న వ్యక్తి ఆయనకు స్వయానా మేనల్లుడని చెబుతున్నారు. ఇక.. పెద్దసారే మేనల్లుడి గురించి చెప్పాలి? పెద్దసారూ... మీరేమైనా చెప్పగలరా?

Updated Date - Jun 01 , 2024 | 03:58 AM