Share News

Godavari: ఉగ్రరూపం దాల్చుతున్న గోదావరి.. పరివాహక ప్రాంత ప్రజలకు బిగ్ అలర్ట్..

ABN , Publish Date - Jul 27 , 2024 | 08:01 AM

గోదావరి వరద ఉధృతి మరింత పెరుగుతోంది. భద్రాచలం వద్ద గోదావరి పరవళ్ళు తొక్కుతోంది. మూడో ప్రమాద హెచ్చరిక దిశగా గోదావరి ఉగ్ర ప్రవాహం కొనసాగుతోంది. 50.80 అడుగులకు నీటిమట్టం చేరుకుంది

Godavari: ఉగ్రరూపం దాల్చుతున్న గోదావరి.. పరివాహక ప్రాంత ప్రజలకు బిగ్ అలర్ట్..

అమరావతి: గోదావరి వరద ఉధృతి మరింత పెరుగుతోంది. భద్రాచలం వద్ద గోదావరి పరవళ్ళు తొక్కుతోంది. మూడో ప్రమాద హెచ్చరిక దిశగా గోదావరి ఉగ్ర ప్రవాహం కొనసాగుతోంది. 50.80 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. 53 అడుగులు దాటితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. వరద ఉధృతి 13,01,496 క్యూసెక్కులకు చేరుకుంది. భద్రాచలం నుంచి ఆంధ్రా ఒడిషా, ఛత్తీస్ గడ్ కు నిలిచిన రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం నుంచి దుమ్ముగూడెం చర్ల స్టేట్ హైవే పై రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు ధవళేశ్వరం వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 12.49 లక్షల క్యూసెక్కులు కావడం గమనార్హం. మొదటి ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. విపత్తుల సంస్థలోని స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.


అత్యవసర సహాయక చర్యల కోసం స్టేట్ కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ 1070,112,18004250101 నెంబర్లు సంప్రదించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాధ్ వెల్లడించారు. ఇక శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వ 200 టీఎంసీలకు చేరితే గేట్లు ఎత్తేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గేట్లు ఎత్తివేత కార్యక్రమానికి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు హాజరుకానున్నారు. నేడు పోతిరెడ్డిపాడు గేట్లను ఇరిగేషన్ అధికారులు ఎత్తనున్నారు. మరో రెండు రోజుల్లో మల్యాల హంద్రీనీవా ఎత్తిపోతల పథకం నుంచి కూడా ఇరిగేషన్ అధికారులు నీటిని విడుదల చేయనున్నారు. మరోవైపు సుంకేసుల ప్రాజెక్టు 28 గేట్లను అధికారులు ఎత్తివేసి నీటిని విడుదల చేశారు.


80 వేల క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. మత్స్యకారులు నదిలోకి దిగవద్దని అధికారులు సూచిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అల్లూరి జిల్లా సీలేరు కాంప్లెక్స్ డొంకరాయి జలాశయానికి వరద నీటి తాకిడి పెరిగింది. ప్రమాద స్థాయి నీటిమట్టానికి అల్లూరి జిల్లా సీలేరు కాంప్లెక్స్ లోని డొంకరాయి జలశయం చేరుకుంది. డొంకరాయి జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1037 అడుగులు కాగా ప్రస్తుతం 1037 అడుగులకూ చేరుకుంది. దీంతో శుక్రవారం అర్ధరాత్రి డొంకరాయి జలాశయంలోని రెండు గేట్లు ఎత్తి 4,500 క్యూసెక్కుల నీటిని జెన్కో అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

YS Jagan : అసెంబ్లీపై అలిగిన జగన్‌

జగన్‌ పత్రికకు జనం సొమ్ము

Read more AP News and Telugu News

Updated Date - Jul 27 , 2024 | 08:01 AM