Share News

CM YS Jagan: ఎవరి కోసం బుల్లెట్‌ ప్రూఫ్‌ బస్సులు!

ABN , Publish Date - Feb 25 , 2024 | 03:26 AM

ముఖ్యమంత్రి భద్రత కోసమో!.. ఢిల్లీ పెద్దలకు గిఫ్ట్‌గా ఇవ్వటం కోసమో తెలియదు కానీ.. అత్యంత ఖరీదైన రెండు బుల్లెట్‌ ప్రూఫ్‌ బస్సులు విజయవాడకు చేరుకున్నాయి! రాజస్థాన్‌ నుంచి రోడ్డు మార్గాన పది రోజుల పాటు ట్రాలీలో ప్రయాణిస్తూ వచ్చిన ఈ బస్సులు శనివారం ఆర్టీసీ విజయవాడ డిపో గ్యారేజీకి చేరాయి.

CM YS Jagan: ఎవరి కోసం బుల్లెట్‌ ప్రూఫ్‌ బస్సులు!

  • బెజవాడకు చేరిన 2 ఓల్వో బస్సులు

  • ఆర్టీసీ డిపోలో పరదాలు కప్పి.. సెక్యూరిటీ

  • ఖరీదు రూ.20 కోట్లు..

  • ఢిల్లీ పెద్దలకు గిఫ్ట్‌ ఇస్తారనే వదంతులు

  • క్యారవాన్‌లా మరో 3 మినీ బస్సుల రాక

  • ఎన్నికల కోసమే ఆర్టీసీతో ఖర్చు చేయించారా?!

(ఆంధ్రజ్యోతి-విజయవాడ)

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి (CM YS Jagan Reddy) భద్రత కోసమో!.. ఢిల్లీ పెద్దలకు గిఫ్ట్‌గా ఇవ్వటం కోసమో తెలియదు కానీ.. అత్యంత ఖరీదైన రెండు బుల్లెట్‌ ప్రూఫ్‌ బస్సులు విజయవాడకు చేరుకున్నాయి! రాజస్థాన్‌ నుంచి రోడ్డు మార్గాన పది రోజుల పాటు ట్రాలీలో ప్రయాణిస్తూ వచ్చిన ఈ బస్సులు శనివారం ఆర్టీసీ విజయవాడ డిపో గ్యారేజీకి చేరాయి. ఎవరి కంట పడకుండా రాత్రి సమయంలో వీటిని విజయవాడ గ్యారేజీకి చేర్చి పరదాలు కట్టారు. ఓల్వో కంపెనీకి చెందిన ఈ బస్సులు సకల హంగులతో సిద్ధమై వచ్చాయి. వీటి కోసం రూ.20 కోట్లను ఖర్చు చేయడం గమనార్హం. ఇవి కాకుండా ఐషర్‌ కంపెనీకి చెందిన మరో మూడు నాన్‌ బుల్లెట్‌ ప్రూఫ్‌ బస్సులు రెండు, మూడు రోజుల్లో విజయవాడ గ్యారేజీకి చేరుకోనున్నాయి. మొత్తంగా బస్సులన్నిటికీ కలిపి దాదాపుగా రూ.40 కోట్ల మేర ఆర్టీసీ ఖర్చు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ బస్సులను ముఖ్యమంత్రి జగన్‌ పర్యటనల కోసం కొనుగోలు చేసినట్టుగా ఆర్టీసీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ బస్సుల గురించి ఎవరూ బయటకు చెప్పవద్దని, మీడియాకు అస్సలు తెలియకూడదంటూ ఆర్టీసీ ఉన్నతాధికారులు.. అధికారులకు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. గ్యారేజీలో ఈ బస్సులకు పూర్తిగా పరదా కప్పి గట్టి సెక్యూరిటీ ఏర్పాటు చేసిన వైనం ‘ఆంధ్రజ్యోతి’ కంటపడింది.

ఇప్పటికే రెండు బస్సులున్నాయి!

సీఎం పర్యటనలకైతే ఇప్పటికే రెండు అత్యాధునిక బుల్లెట్‌ ప్రూఫ్‌ బస్సులు ఉన్నాయి. మూడేళ్లపాటు నిరుపయోగంగా ఉన్న ఆ బస్సులను సీఎం జగన్‌ ఏడాదిన్నరగా తన పర్యటనల్లో వినియోగిస్తున్నారు. ఇటీవలే వీటి మెయింటెనెన్స్‌ పేరుతో ఆర్టీసీ ఉన్నతాఽధికారులు రూ.1.50 కోట్లను ఖర్చు చేశారు. నాన్‌ బుల్లెట్‌ ప్రూఫ్‌ బస్సులను క్యారవాన్‌లుగా, ప్రచార రథాలుగా కూడా ఉపయోగించేలా తీర్చిదిద్దినట్టుగా సమాచారం. ఈ బస్సులను ఎన్నికల ప్రచార సభలలో ఉపయోగించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

Updated Date - Feb 25 , 2024 | 08:21 AM