MLA Kolikapudi Srinivasa Rao: టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై కేసు నమోదు
ABN , Publish Date - Jul 03 , 2024 | 07:24 PM
ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై కేసు నమోదయింది. ఏ. కొండూరు మండలం కంభంపాడులో నిన్న (మంగళవారం) వైసీపీ ఎంపీపీ కాలసాని నాగలక్ష్మి భర్త కాలసాని చెన్నారావు ఇంటిని కూల్చిన ఘటనపై అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
తిరువూరు: ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై కేసు నమోదయింది. ఏ. కొండూరు మండలం కంభంపాడులో నిన్న (మంగళవారం) వైసీపీ ఎంపీపీ కాలసాని నాగలక్ష్మి భర్త కాలసాని చెన్నారావు ఇంటిని కూల్చిన ఘటనపై అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు తమ ఇంటిని దౌర్జన్యంగా ధ్వంసం చేశారంటూ ఏ. కొండూరు పోలీసు స్టేషన్‌లో ఎంపీపీ కాలసాని నాగలక్ష్మి ఫిర్యాదు చేశారు. దీంతో కొలికపూడి శ్రీనివాసరావుతో పాటు టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన మొత్తం 60 మంది నాయకులపై కేసులు నమోదు చేశారు. 167/2024 గా ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఏ. కొండూరు పోలీసులు వెల్లడించారు.
సోషల్ మీడియాలో ఎమ్మెల్యే ఆసక్తికర పోస్ట్..
కాగా కంభంపాడులో వైసీపీ నేత అక్రమ భవన నిర్మాణం కూల్చివేత, కేసు నమోదైన నేపథ్యంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు సోషల్ మీడియా వేదికగా ఆసక్తికరంగా స్పందించారు. పదవి శాశ్వతం కాదని.. బాధితులకు న్యాయం చేయలేనపుడు తన లాంటి వారు రాజకీయాల్లో కూడా అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఘటనకు ముందు సోషల్ మీడియా ద్వారా ప్రకటించినా అధికారులు స్పందించలేదని, చివరికి తాను స్వయంగా రంగంలోకి దిగి, గత్యంతరం లేక వేలాది మంది బాధితులతో నిరసన చేపట్టిన తర్వాత చివరికి నోటీసులిచ్చి నిర్మాణం ఆపారని పేర్కొన్నారు. చెన్నారావు నలుగురిని కొట్టి వాళ్ల స్థలాలు లాక్కొని, పక్కనున్న ప్రభుత్వ భూమిని ఆక్రమించి కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నాడని, అక్రమ నిర్మాణం ఆపాలని రెవెన్యూ అధికారులకు చెబితే.. అతడిని రక్షించేందుకు వంద కథలు చెప్పారని పేర్కొ్న్నారు.