Share News

ఊపందుకున్న క్రిస్‌సిటీ పనులు

ABN , Publish Date - Nov 29 , 2024 | 05:14 AM

దేశవ్యాప్తంగా సముద్రతీర ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రత్యేక కారిడార్‌లను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఈ కారిడార్‌లను ఎన్‌ఐసీడీసీ (నేషనల్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌) కింద అభివృద్ధి చేయనున్నారు.

ఊపందుకున్న  క్రిస్‌సిటీ పనులు

  • ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అభివృద్ధికి బాటలు

  • సీబీఐసీలో తొలివిడతగా 2,500 ఎకరాల్లో క్రిస్‌సిటీ

  • పూర్తయిన భూసేకరణ, జోరుగా మొదలైన పనులు

  • పరిశ్రమలకు భూముల విక్రయానికి చర్యలు

నెల్లూరు (వెంకటేశ్వరపురం), నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా సముద్రతీర ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రత్యేక కారిడార్‌లను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఈ కారిడార్‌లను ఎన్‌ఐసీడీసీ (నేషనల్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌) కింద అభివృద్ధి చేయనున్నారు. ఇందులో భాగంగా సీబీఐసీ (చెన్నై- బెంగళూరు ఇండస్ట్రియల్‌ కారిడార్‌) ఏర్పాటు కానుంది. దాదాపు 13 వేల ఎకరాల్లో రూ. 37,500 కోట్లతో ఈ కారిడార్‌ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ కారిడార్‌ తొలివిడతలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టుకు సమీపంలో 2,500 ఎకరాల్లో రూ. 2,139.44 కోట్ల వ్యయంతో క్రిస్‌సిటీ (కృష్ణపట్నం ఇండస్ట్రియల్‌ సిటీ) రూపుదిద్దుకోనుంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని కోట, చిల్లకూరు మండలాల పరిధిలోని కొత్తపట్నం, తమ్మినపట్నం గ్రామాల్లో క్రిస్‌సిటీ ఏర్పాటు కానుంది. ఇప్పటికే ఈ గ్రామాల్లో 2,500 ఎకరాల వరకు భూసేకరణ పూర్తి చేయగా, రూ. 600 కోట్లతో బీవీఎ్‌సఆర్‌ సంస్థ ద్వారా అభివృద్ధి పనులు చేపట్టారు. ప్రధానంగా తమ్మినపట్నం ప్రాంతంలోని బీచ్‌ కెనాల్‌పై వంతెన నిర్మాణం, రోడ్లు, కాలువలతోపాటు అనేక వసతులు కల్పించనున్నారు. కృష్ణపట్నం పోర్టుతోపాటు చెన్నై పోర్టుకు దగ్గరగా ఈ ప్రాంతం ఉండటంతో ఎగుమతులు, దిగుమతులకు సౌకర్యంగా ఉండనున్నది. ప్రస్తుతం క్రిస్‌సిటీ అభివృద్ధి పనులు వేగంగా జరుగుతుండటంతో అనేక పరిశ్రమలు ఈ ప్రాంతానికి రానున్నట్లు తెలుస్తోంది.

  • త్వరలో భూముల విక్రయం

క్రిస్‌సిటీలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్న నేపథ్యంలో పలు అంతర్జాతీయ పరిశ్రమల ప్రతినిధులు ఈ ప్రాంతంపై ఆసక్తి చూపుతున్నారు. ఇందుకోసం ఎన్‌ఐసీడీసీ ఆధ్వర్యంలో త్వరలోనే పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూమిని విక్రయించేందుకు చర్యలు చేపడుతున్నటు సమాచారం. ఈ క్రిస్‌సిటీ ఏర్పాటుతో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

Updated Date - Nov 29 , 2024 | 05:14 AM