Share News

Chief Minister Chandrababu : పైశాచికానికి పరాకాష్ఠ

ABN , Publish Date - Jul 26 , 2024 | 04:22 AM

ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్ర ప్రజలు పడిన కష్టాలు.. ప్రతిపక్షాలు ఎదుర్కొన్న హింసా రాజకీయాలు.. బాధితులే నిందితులైన ప్రభుత్వ టెర్రరిజాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో ఆవిష్కరించారు. కట్టుతప్పిన శాంతి భద్రతలు, హత్యలు, అత్యాచారాలు, బెదిరింపులు, గంజాయి, డ్రగ్స్‌ దిగుమతితో ఆంధ్రప్రదేశ్‌ ఎంత నష్టపోయిందో వివరించారు. శాంతి భద్రతల విషయంలో నూతన అధ్యాయం ప్రారంభించబోతున్నామని చంద్రబాబు వెల్లడించారు. జగన్‌ హయాంలో జరిగిన అరాచకాలపై

Chief Minister Chandrababu : పైశాచికానికి  పరాకాష్ఠ

ఐదేళ్లూ ఎమర్జెన్సీని మించిన చీకటి రోజులు’

శాంతిభద్రతలు మృగ్యం.. సర్వత్రా అరాచకపర్వం

ఉమ్మడి ఏపీలో నాపై బాబ్లీ కేసు ఒక్కటే

ఐదేళ్లలోనే 17 కేసులు పెట్టి పైశాచికానందం

జగన్‌ పాలనలో 300 మంది బీసీల హత్య

ఎస్సీలపై 10,377 నేరాలు, మహిళలపై 89,875

నాటి అక్రమ కేసులు, అణచివేతపై కమిషన్‌!

నాడు అక్రమ కేసులు పెట్టిన అధికారులను శిక్షిస్తాం

ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టీకరణ

శాంతిభద్రతలపై శాసనసభలో శ్వేతపత్రం

‘‘మహిళల జోలికి ఎవరైనా వస్తే 21 రోజుల్లో ఉరేస్తామని నాడు ముఖ్యమంత్రిగా జగన్‌ ఆర్భాటపు ప్రకటనలు గుప్పించారు. మరి ఆయన తన పాలనలో ఎంతమందికి ఉరిశిక్షలు వేయించారు? ఐదేళ్ల జగన్‌ పాలనలో ఎస్సీలపై 10,377 నేరాలు చోటుచేసుకున్నాయి. 300 మంది బీసీలు హత్యకు గురయ్యారు. మహిళలపై 89,875 నేర ఘటనలు జరిగాయి. ఇన్ని జరుగుతుంటే కనీసం సమీక్ష కూడా చేయలేదు. కానీ, వైసీపీకి చెందిన ఇద్దరు గంజాయి మత్తులో పరస్పర దాడులు చేసుకున్న ఘటనపై ఢిల్లీలో రాజకీయాలు చేయడమేంటి?’’

‘‘శాంతిభద్రతల పరిరక్షణలో నూతన అధ్యాయం మొదలైంది. అక్రమ కేసులు పెట్టిన, పెట్టించిన అధికారులను చట్టపరంగా శిక్షించబోతున్నాం. టీడీపీ కూటమి సభ్యులెవరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు. బాధితులు సైతం చట్టపరంగా బాధ్యుల్ని ఎదుర్కోవాల్సిందే తప్ప ప్రతీకార దాడులు చేస్తామంటే కుదరదు’’

-చంద్రబాబు

అమరావతి, జూలై 25 (ఆంధ్రజ్యోతి): ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్ర ప్రజలు పడిన కష్టాలు.. ప్రతిపక్షాలు ఎదుర్కొన్న హింసా రాజకీయాలు.. బాధితులే నిందితులైన ప్రభుత్వ టెర్రరిజాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో ఆవిష్కరించారు. కట్టుతప్పిన శాంతి భద్రతలు, హత్యలు, అత్యాచారాలు, బెదిరింపులు, గంజాయి, డ్రగ్స్‌ దిగుమతితో ఆంధ్రప్రదేశ్‌ ఎంత నష్టపోయిందో వివరించారు. శాంతి భద్రతల విషయంలో నూతన అధ్యాయం ప్రారంభించబోతున్నామని చంద్రబాబు వెల్లడించారు. జగన్‌ హయాంలో జరిగిన అరాచకాలపై గురువారం అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు. శాంతి భద్రతలను టీడీపీ కూటమి ప్రభుత్వం ఎలా పరిరక్షిస్తుందో వివరించారు. గంజాయి, డ్రగ్స్‌ మహమ్మారిని తరిమి కొడతామన్నారు. జగన్‌ హయాంలో జరిగిన టీడీపీ నేతల హత్యల ప్రస్తావన వచ్చినప్పుడల్లా చంద్రబాబు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. 2019-24 మధ్య స్టేట్‌ టెర్రరిజం చూశామని, ఎమర్జెన్సీ కన్నా దారుణమైన చీకటి పాలనతో అన్ని వర్గాలూ ఇబ్బంది పడ్డాయన్నారు. పోలీసులను చెప్పుచేతల్లో పెట్టుకుని ప్రజాస్వామ్యంపై గొడ్డలి పోటు వేసిన జగన్‌ లాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉంటే ప్రమాదకరన్నారు. ‘’అలిపిరిలో క్లైమోర్‌మైన్ల పేలుళ్లకు భయపడని నేను ఇదే సభలో కన్నీరు పెట్టుకోలేదా? పల్నాడు చంద్రయ్య పాడె మోయడాన్ని మర్చిపోతానా? పవన్‌ కల్యాణ్‌ వ్యక్తిత్వ హననానికి గురికాలేదా? అన్నింటికీ చట్టపరంగా సమాధానం చెప్పే బాధ్యత ప్రభుత్వానిది. కార్యకర్తల ఒత్తిళ్లతో మీరెవ్వరూ ప్రతీకార దాడులకు దిగొద్దు’’ అంటూ ఎమ్మెల్యేలకు సూచించారు. ప్రజలు అధికారం ఇచ్చింది ప్రతీకారం తీర్చుకోవడానికి కాదని స్పష్టం చేశారు. అయితే తప్పు చేసిన వారిని వదిలేస్తే అది ప్రభుత్వ అసమర్థత అవుతుందని.. ఏకపక్ష అధికారులు, రెచ్చిపోయి నేరాలు చేసిన వారిని చట్టపరంగా శిక్షించడంలో రాజీ ఉండదని స్పష్టం చేశారు. ఇంకా ఏమన్నారంటే..

రాజకీయ అరాచకం

‘‘ఐదేళ్లు స్టేట్‌ టెర్రరిజాన్ని కొనసాగించిన వైసీపీ ప్రభుత్వం వేలాది తప్పుడు కేసులు పెట్టింది. ప్రజాప్రతినిధులు, ప్రతిపక్ష నేతలు, న్యాయమూర్తులు, మీడియా ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరినీ వేధించింది. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, పి.నారాయణను వేధించారు. పులివెందులలో అత్యాచారం, హత్యకు గురైన దళిత మహిళ విషయంలో నిరసన తెలిపారని ఎస్‌సీ వర్గానికి చెందిన అనిత, ఎం.ఎ్‌స.రాజుపైనే అట్రాసిటీ కేసులు పెట్టారు. ఫర్నిచర్‌ కోసం మాజీ స్పీకరు కోడెల శివప్రసాద్‌ను వేధించి పొట్టన బెట్టుకున్న జగన్‌ ఇంట్లో ఇప్పటికీ ప్రభుత్వ ఫర్నిచర్‌ ఉంది. సొంత పార్టీ ఎంపీ రఘురామరాజుపై థర్డ్‌ డిగ్రీ ఉపయోగించి ఆ దృశ్యాలను జగన్‌ వీడియో ద్వారా చూసి పైశాచికానందం పొందారు. ఉమ్మడి రాష్ట్రంలో నాపై బాబ్లీ ప్రాజెక్టు కోసం పోరాడిన కేసు ఒక్కటే ఉండేది. జగన్‌ కక్షపూరితంగా 17 కేసులు పెట్టించారు. అంగళ్లు, పుంగనూరులో నాపై పలు కేసులు పెట్టించి 700మంది టీడీపీ కార్యకర్తల్ని నిందితులుగా చేర్చి అన్యాయంగా జైల్లో పెట్టించారు. తోట చంద్రయ్య, కంచర్ల జాలయ్య, నందం సుబ్బయ్య, ప్రకాశంలో మునిస్వామి....ఇలా ఎందరో టీడీపీ కార్యకర్తలను పొట్టన బెట్టుకున్నారు. మా ఇంటిపైకి వచ్చిన వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్‌కు మంత్రి పదవి ఇచ్చి తన నైజమేంటో జగన్‌ తెలియజేశారు. టీడీపీ, జనసేన కార్యాలయాలపై దాడులు చేసిన వైసీపీ మూకలను అరెస్టు చేయలేదు. ఇప్పుడు దానిపై చర్యలు ప్రారంభమయ్యాయి. కొందరు పోలీసులను అనుకూలంగా మార్చుకుని జగన్‌ అరాచకాలు చేయించారు. సహకరించని పోలీసులను వీఆర్‌లో ఉంచారు. ఏబీ వెంకటేశ్వరరావు వంటి వారిని కక్షపూరితంగా వేధించారు. ఏబీఎన్‌ చానెల్‌ ప్రసారం కాకుండా నిషేధించారు. రామోజీరావుపై కేసులు పెట్టారు. పలు మీడియా సంస్థలు, పాత్రికేయులను వేధించారు. మాస్క్‌ అడిగిన డాక్టర్‌ సుధాకర్‌ను పోలీసులతో కొట్టించి వైసీపీ ప్రభుత్వం బలి తీసుకుంది. డ్రైవర్‌ సుబ్రమణ్యంను ఆ పార్టీ ఎమ్మెల్సీ చంపేసి శవాన్ని ఇంటికి పార్శిల్‌ పంపారు. ఇసుక అక్రమాలను ప్రశ్నించిన యువకుడికి పోలీసుస్టేషన్లో శిరోముండనం చేయించారు. గిరిజన మహిళను ట్రాక్టర్‌తో తొక్కించి చంపేశారు. సొంత సోదరి మానాన్ని కాపాడుకునే క్రమంలో అల్లరి మూకల చేతిలో అమర్నాథ్‌ గౌడ్‌ అగ్నికి ఆహుతయ్యాడు. అవినీతిని ప్రశ్నించిన నందం సుబ్బయ్యను పొద్దుటూరులో పొట్టన బెట్టుకున్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో ఎస్‌సీలపై 10,377నేరాలు జరిగితే.. 300మంది బీసీలు హత్యకు గురయ్యారు. అబ్దుల్‌ సలామ్‌ కుటుంబం నంద్యాలలో ఆత్మహత్యకు వైసీపీ నేతలే కారణం. మదనపల్లెలో మిస్బాకు మొదటి ర్యాంకు వస్తే తట్టుకోలేని వైసీపీ నేత వేధింపుల వల్ల ఆ బాలిక ఆత్మహత్యకు పాల్పడింది’’


ఇక గుడి, సమాజం పదిలమే..

‘‘రాజధానికి భూములిచ్చిన పాపానికి అమరావతి రైతులపై నాడు 269 కేసులు పెట్టారు. టీడీపీ, జనసేన, బీజేపీ, వామపక్షాలతోపాటు సొంత చెల్లెలు షర్మిలపైనా కేసులు పెట్టించిన ఘనుడు జగన్‌. సోషల్‌ మీడియాలో వంగలపూడి అనిత, ఆదిరెడ్డి భవాని, గౌతు శిరీష అసభ్యకరమైన ట్రోలింగ్‌ను ఆనాడు ఎదుర్కొన్నారు. ఇప్పుడు అందుకు తావు లేదు. సోషల్‌ మీడియాపై నిఘా పెట్టి హద్దుమీరే వారికి తగిన బుద్ది చెబుతాం. జగన్‌ పాలనలో అరసవెల్లి, అంతర్వేది ఇతర ఆలయాలకు రక్షణ లేదు. కూటమి ప్రభుత్వంలో అన్ని మతాల ఆలయాలకు పూర్తి రక్షణ ఉంటుంది’’

బాబాయి.. గులక రాయి..

‘‘ఎన్నికల్లో లబ్ధి కోసం సొంత చిన్నాన్న వివేకానంద రెడ్డిపై గొడ్డలి పోటు వేసి సొంత మీడియాలో గుండెపోటు అని మాజీ సీఎం ప్రచారం చేయించారు. మరోసారి ప్రజల్ని మభ్యపెట్టేందుకు గులక రాయి డ్రామా ఆడారు. కోడికత్తి కేసులో దళిత యువకుడిని, గులక రాయి కేసులో అన్యాయంగా బీసీ మైనర్‌ను వేధించారు.బాబాయ్‌ హత్య విషయంలో మాత్రం నిందితుడైన ఎంపీ అవినాశ్‌రెడ్డిని రక్షించారు. శాంతి భద్రతల అంశంపై బడ్జెట్‌ సమావేశాల్లో మరోమారు సుదీర్ఘంగా చర్చిద్దాం. పవన్‌ కల్యాణ్‌ సూచన మేరకు రోజంతా చర్చ పెడతాం. రానున్న రోజుల్లో పోలీసుశాఖ ప్రవర్తనలో మార్పు తీసుకొచ్చి టెక్నాలజీకి పెద్దపీట వేసి నేరస్థుల్లో భయం పుట్టిస్తాం.’’

జగన్‌.. ఎస్కోబార్‌ ఇద్దరూ ఒక్కటే..

‘‘నా రాజకీయ చరిత్రలో జగన్‌ లాంటి వ్యక్తిని చూడలేదు. ప్రపంచంలో ఇలాంటి వ్యక్తి ఒక్కరే ఉన్నారు. అతడు కొలంబియాకు చెందిన ఎస్కోబార్‌ అనే డ్రగ్‌ డీలర్‌. ఎస్కోబార్‌ రాజకీయాల్లోకి ప్రవేశించి ఏకంగా డ్రగ్‌ కారిడార్లు ఏర్పాటు చేశాడు. అమెరికా అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తే ఎంపీగా గెలిచి సొంత జైలు నిర్మించుకుని అందులో ఉన్నాడు.. జైలు నుంచి తప్పించుకుని వచ్చి కొలంబియా న్యాయ మంత్రిని హత్య చేశాడు.. ఆ దేశ సుప్రీం కోర్టుపై దాడిచేసి 11మంది జడ్జీలను చంపేశాడు. ఆ తర్వాత తన పాపాలకు తగిన శిక్ష ప్రజల చేతిలో అనుభవించాడు. రాజకీయాల్లో ఎవరున్నా పర్లేదు కానీ ఎస్కోబార్‌, జగన్‌ లాంటి వారు ఉండకూడదు’’ అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.

కక్షతో కేసులు..

నాటి విపక్ష నేత చంద్రబాబు 17 కేసులు

జేసీ ప్రభాకర్‌ రెడ్డి 66 కేసులు

చింతమనేని ప్రభాకర్‌ 48 కేసులు

పులివర్తి నాని 31 కేసులు

లోకేశ్‌ 17 కేసులు

పవన్‌ కల్యాణ్‌ ఏడు కేసులు

అయ్యన్నపాత్రుడు 17 కేసులు

అమరావతి రైతులు 269 కేసులు

వంగలపూడి అనిత (ఎస్సీ) ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ ఫర్నిచర్‌ దొంగతనం కేసు

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు కస్టడీలో థర్డ్‌ డిగ్రీ కోటింగ్‌

నాలుగు లక్ష్యాలతో పనిచేస్తాం..

1) పోలీసుశాఖను ప్రక్షాళన చేసి రాష్ట్రాన్ని సున్నా నేరాల ఏపీగా మారుస్తాం.

2) లా అండ్‌ ఆర్డర్‌లో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే

అగ్రస్థానంలో నిలబెడతాం.

3) రాజకీయ కక్షతో పెట్టిన కేసులను సమీక్షించి ఐదేళ్ల వైసీపీ పాలనలో మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా అణచివేతకు గురైన

వారికి సాంత్వన చేకూరుస్తాం.

4) గత ఐదేళ్లలో అక్రమ కేసులు, అణచివేతపై కమిషన్‌ వేయడంపై మంత్రివర్గంలో చర్చించి

నిర్ణయం తీసుకుంటాం.

Updated Date - Jul 26 , 2024 | 04:23 AM