Share News

60 వేల ఓటరు స్లిప్పులు వెనక్కొచ్చాయ్‌!

ABN , Publish Date - May 09 , 2024 | 12:56 AM

తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3.02 లక్షల మంది ఓటర్లు వుండగా అందులో బుధవారం నాటికి కేవలం 2.40 లక్షల మందికి మాత్రమే ఓటరు స్లిప్పులు అందాయి.మిగిలిన 20 శాతం అంటే 60 వేలమందికి పంపిణీ కావాల్సిన స్లిప్పులు కార్యాయాలకు వెనక్కు వచ్చాయి. అంటే అందులో అధిక శాతం బోగస్‌ ఓట్లుగా భావించాల్సి వస్తోంది.

 60 వేల ఓటరు స్లిప్పులు  వెనక్కొచ్చాయ్‌!

తిరుపతి, మే 8 (ఆంధ్రజ్యోతి): తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3.02 లక్షల మంది ఓటర్లు వుండగా అందులో బుధవారం నాటికి కేవలం 2.40 లక్షల మందికి మాత్రమే ఓటరు స్లిప్పులు అందాయి.మిగిలిన 20 శాతం అంటే 60 వేలమందికి పంపిణీ కావాల్సిన స్లిప్పులు కార్యాయాలకు వెనక్కు వచ్చాయి. అంటే అందులో అధిక శాతం బోగస్‌ ఓట్లుగా భావించాల్సి వస్తోంది.ఈనెల 1వ తేదీ నుంచీ జిల్లావ్యాప్తంగా ఓటర్లకు అధికార యంత్రాంగం స్లిప్పులను పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. స్లిప్పుల పంపిణీకి బుధవారం చివరి రోజు. అయితే తిరుపతి నియోజకవర్గంలో 3,02,503మంది ఓటర్లకు గానూ బుధవారం సాయంత్రానికి 2,41,133 మందికి మాత్రమే స్లిప్పులు చేరాయి. అంటే 79.71 శాతం మందికే ఓటరు స్లిప్పులు అందాయి. మిగిలిన 61,370 మందికి స్లిప్పులు చేరలేదు. ఇళ్ళకు తాళాలు వేసుకుని బయట ప్రాంతానికి వెళ్ళిన వారు, ఇతర ప్రాంతాలకు నివాసం మార్చిన వారు, డబుల్‌ ఎంట్రీలు, మృతులు, బోగస్‌ ఓటర్లు వంటి కారణాలతోనే ఇంతమందికి స్లిప్పులు అందకుండా పోయే అవకాశముంది. అయితే ప్రాక్టికల్‌గా చూస్తే వేసవి సెలవుల్లో స్వస్థలాలకు, బంధువుల ఊళ్ళకు, టూర్లకు వెళ్ళే కుటుంబాలు అత్యల్పంగానే వుంటాయి. శాశ్వతంగా నివాసం మార్చిన వారు కూడా తక్కువే. ఓటర్ల జాబితా నుంచీ తొలగని మృతుల పేర్లు సైతం స్వల్పంగానే వుంటాయి. డబుల్‌ ఎంట్రీలు, దొంగ ఓటర్లే అధికంగా వుండే అవకాశముంది. ఓటర్ల జాబితా సవరణలు చేపట్టినప్పటి నుంచీ ప్రతిపక్షాలు తిరుపతిలో భారీగా దొంగ ఓట్లు చేర్చారని ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. కిందిస్థాయి అధికారుల నుంచీ ఎన్నికల కమిషన్‌ దాకా అసంఖ్యాకంగా ఫిర్యాదులు చేశారు. ఈ ఆరోపణలు, ఫిర్యాదులూ నిజమేనని ఇపుడు 61 వేల స్లిప్పులు మిగిలిపోవడాన్ని బట్టి అనుమానించాల్సి వస్తోంది.జిల్లాలో మిగిలిన ఆరు నియోజకవర్గాల్లో 90శాతానికి పైగా ఓటర్లకు స్లిప్పులు అందాయి.కేవలం తిరుపతిలోనే 20 శాతానికి మించి ఓటర్లకు స్లిప్పులకు చేరకుండా అధికారుల వద్దే మిగిలిపోయాయి. వీటిని ఆబ్సెంట్‌, షిఫ్టెడ్‌, డెత్‌ కేటగిరీల్లో విభజించి బీఎల్‌వోలు తహసిల్దారుకు, ఆయన కలెక్టర్‌కు జాబితా అందజేయాల్సి వుంది.నిజమైన ఓటర్లు నివాసం మార్చడం లేదా తాత్కాలికంగా ఎటైనా వెళ్ళి వుంటే అలాంటి వారికి పోలింగ్‌ కేంద్రాల వద్దే పోలింగ్‌ రోజు స్లిప్పులు అందుబాటులో వుంచుతామని అధికారులు చెబుతున్నారు. అదెలా వున్నా భారీ సంఖ్యలో బోగస్‌ ఓటర్లు వెలుగు చూసే అవకాశమున్నందున అధికారుల తదుపరి చర్యలు ఎలా వుంటాయో వేచి చూడాల్సి వుంది.

Updated Date - May 09 , 2024 | 12:56 AM