Share News

గతానికి భిన్నంగా ముందే మొదలైన ప్రలోభాల పర్వం

ABN , Publish Date - May 09 , 2024 | 12:51 AM

ఈసారి సార్వత్రిక ఎన్నికలకు ప్రఽధాన పార్టీల తరఫున ప్రలోభాల పర్వం ముందే మొదలైపోయింది. పోలింగ్‌ ముందు రోజు రాత్రి చేపట్టే పంపకాలు వారం రోజుల ముందే మొదలు కావడం గమనార్హం. పోలింగ్‌ తేదీ సమీపించే కొద్దీ పోలీసులతో పాటు ప్రత్యర్థుల నిఘా పెరుగుతుందని భావించి వీలైనంత ముందుగా ఓటర్లకు నగదు చేర్చేందుకు నేతలు ముందస్తు పంపకాలకు సిద్ధపడిపోతున్నారు.

గతానికి భిన్నంగా ముందే మొదలైన ప్రలోభాల పర్వం

తిరుపతి, మే 8 (ఆంధ్రజ్యోతి) : ఈసారి సార్వత్రిక ఎన్నికలకు ప్రఽధాన పార్టీల తరఫున ప్రలోభాల పర్వం ముందే మొదలైపోయింది. పోలింగ్‌ ముందు రోజు రాత్రి చేపట్టే పంపకాలు వారం రోజుల ముందే మొదలు కావడం గమనార్హం. పోలింగ్‌ తేదీ సమీపించే కొద్దీ పోలీసులతో పాటు ప్రత్యర్థుల నిఘా పెరుగుతుందని భావించి వీలైనంత ముందుగా ఓటర్లకు నగదు చేర్చేందుకు నేతలు ముందస్తు పంపకాలకు సిద్ధపడిపోతున్నారు. వెంకటగిరి, తిరుపతి నియోజకవర్గాల్లో సోమవారం నుంచే నగదు పంపిణీ ప్రారంభం కాగా చంద్రగిరి, గూడూరు, సత్యవేడుల్లో వైసీపీ వర్గీయులు మంగళవారం పంపిణీకి శ్రీకారం చుట్టగా శ్రీకాళహస్తిలో బుధవారం నుంచీ నగదు, చీరల పంపకాలు మొదలయ్యాయి. చంద్రగిరిలో రెండు విడతల పంపిణీకి చెవిరెడ్డి వర్గీయులు వ్యూహం పన్నినట్టు సమాచారం. సూళ్ళూరుపేటలో విద్యుత్‌ సరఫరా ఆపేసి మరీ చీకట్లో నగదు పంపిణీ చేశారు. పుత్తూరులో నగదు కంటే ముందుగా అధికార పార్టీ నేతలు మద్యం పంపిణీకి శ్రీకారం చుట్టేశారు.

తిరుపతిలో పోటాపోటీగా

తిరుపతిలో వైసీపీ, జనసేన పార్టీల నేతలు సోమవారం నుంచే నగదు పంపిణీ చేపట్టారు. సోమవారం ఉదయం నుంచే బూత్‌ స్థాయిలో ఓటర్లకు నగదు పంచడం మొదలైంది. ఓటుకు రూ. 2వేల చొప్పున ముట్టజెపుతుండగా కొన్ని చోట్ల స్థానిక నేతలు చేతివాటం చూపి రూ. వెయ్యి, రూ. 1500 చొప్పున మాత్రమే అందజేసినట్టు సమాచారం. ఓటరు స్లిప్పులు చూసి నంబర్లు నమోదు చేసుకుని మరీ నగదు పంపిణీ చేస్తున్నట్టు సమాచారం. అధికార పార్టీ నేతలు మాత్రం ఓటుకు రూ. 3 వేల వంతున ఓటరు స్లిప్పులతో నిమిత్తం లేకుండా పంపకాలు చేస్తుండడంతో జనమే విస్తుపోతున్నారు. ఏ స్థాయిలో అక్రమార్జన వుంటే ఈ స్థాయిలో నగదు పంపకాలు జరుగుతాయని చర్చించుకుంటున్నారు.

చంద్రగిరిలో రెండు విడతలకు వైసీపీ వ్యూహం

చంద్రగిరి నియోజకవర్గంలో మంగళవారం వైసీపీ వర్గీయులు నగదు పంపిణీ ప్రారంభించారు. చంద్రగిరి పట్టణంలో పంపిణీ ప్రారంభించిన వైసీపీ వర్గీయులు ఓటుకు రూ. 2 వేల వంతున అందజేస్తున్నారు. పార్టీలు, వర్గాలతో నిమిత్తం లేకుండా అందరికీ పంచుతున్నట్టు సమాచారం. రెండు విడతల్లో నగదు పంపిణీ చేయాలనే వ్యూహం సిద్ధం చేసుకున్నట్టు తెలిసింది. గత ఎన్నికల్లో తొలి విడత ఓటుకు రూ. వెయ్యి అందజేసి చివరలో మరో విడత ఇంటికి రూ. 1500 చొప్పున పంపిణీ చేశారు. ఇపుడు కూడా అదే వ్యూహంతో తొలి విడత రూ. 2 వేల చొప్పున పంపిణీ చేస్తున్నారని, టీడీపీ వర్గీయుల పంపకాలను బట్టి మలి విడత అదనపు నగదు పంపిణీకి ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు సమాచారం. కాగా టీడీపీ వర్గీయులు బుధవారం నుంచీ రూ.2 వేల చొప్పున పంపిణీ చేస్తున్నారు.

గూడూరులో వైసీపీ ప్రలోభాలు ప్రారంభం

గూడూరు పట్టణంలో రూ. 1500 చొప్పున పంచిన వైసీపీ నేతలు గ్రామాల్లో రూ. వెయ్యి చొప్పున పంపిణీ చేస్తున్నారు. చిట్టమూరులో సోమవారం రాత్రి నుంచీ, గూడూరు పట్టణంలో మంగళవారం రాత్రి నుంచీ, మిగిలిన మండలాల్లో బుధవారం నుంచీ పంపకాలు మొదలయ్యాయి. టీడీపీ నేతలు బుధవారం మధ్యాహ్నం నుంచీ నియోజకవర్గవ్యాప్తంగా ఓటుకు రూ. వెయ్యి చొప్పున పంపిణీ ప్రారంభించారు.

పుత్తూరులో ఇంటింటికీ మద్యం పంపిణీ

నగరి నియోజకవర్గంలో భాగమైన పుత్తూరు, వడమాలపేట మండలాల్లో ప్రధాన పార్టీల నేతలు ఇంకా నగదు పంపకాలు మొదలు పెట్టలేదు. అయితే అధికార పార్టీ వర్గీయులు మాత్రం ఆదివారం నుంచే ఇంటింటికీ మద్యం పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు సమాచారం. బూత్‌ స్థాయిలో రోజుకు ఒక కేస్‌ మద్యం బాక్స్‌ అంటే 48 క్వార్టర్‌ బాటిళ్లు చేరవేస్తుండగా బాటిళ్ళను ప్రతి ఇంటికీ రోజు మార్చి రోజు అందజేస్తున్నట్టు చెబుతున్నారు. పోలింగ్‌ రోజు వరకూ రోజూ మద్యం పంపిణీ చేయాలని ముఖ్యనేత ఆదేశించినప్పటికీ కిందిస్థాయి నేతలు చేతివాటం చూపి రోజు మార్చి రోజు అందజేస్తున్నట్టు సమాచారం. అయితే టీడీపీ వైపు నుంచీ ఇంకా నగదు గానీ, మద్యం గానీ పంపిణీ మొదలు కాలేదు.

శ్రీకాళహస్తిలో వైసీపీ నగదు, చీరల పంపిణీ

శ్రీకాళహస్తిలో వైసీపీ వర్గీయులు బుధవారం నుంచీ ఓటుకు రూ. 2 వేలు నగదుతో పాటు చీరలు పంపిణీ చేయడం ప్రారంభించారు. అయితే చీరలు మరీ నాసిరకంగా వున్నాయని మహిళలు వాపోవడం కనిపించింది. కాగా ఓటర్లకు పంపిణీ చేసేందుకు వైసీపీ నేతలు భారీగా చీరలు తెప్పించారని సమాచారం. వాటిని పలుచోట్ల నిల్వ వుంచారని, ఆ క్రమంలో మంగళవారం అర్థరాత్రి దాటాక ప్రభుత్వాస్పత్రి చేరువలోని ఓ గోదాము నుంచీ చీరలను ఆటోలో తరలిస్తుండగా టీడీపీ వర్గీయులు పట్టుకుని పోలీసులకు పట్టించారు. కాగా టీడీపీ వర్గీయులు సైతం బుధవారం నుంచీ ఓటుకు రూ. 2 వేల వంతున పంపిణీ మొదలు పెట్టారు.

సత్యవేడులో టీడీపీ ఓటమికి ఎంపీ మిధున్‌ యత్నాలు

సత్యవేడులో వైసీపీ వర్గీయులు మంగళవారం రాత్రి నుంచీ నగదు పంపిణీ ప్రారంభించారు. ఓటుకు రూ. 1500 చొప్పున పంపిణీ చేస్తున్నట్టు సమాచారం. రాజీనామా చేసిన వలంటీర్ల ద్వారా ఓటర్లకు నగదు చేరుస్తున్నట్టు చెబుతున్నారు.ఇక్కడ టీడీపీ అభ్యర్థి ఓటమికి వైసీపీ ఎంపీ మిధున్‌రెడ్డి వర్గీయులు రంగంలోకి దిగారని, వారే పట్టుదలగా ఈ ఏర్పాట్లు చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది. రాజంపేట, పీలేరు తదితర ప్రాంతాల నుంచీ వచ్చిన మిఽధున్‌ వర్గీయులు సత్యవేడులో మకాం వేసి మొత్తం ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నట్టు సమాచారం. కింది స్థాయి నేతలు చేతివాటం చూపకుండా మొత్తం నగదు ఓటర్లకు చేరేందుకు వీరు వెంట వుండి మరీ పంపకాలు చేపడుతున్నట్టు చెబుతున్నారు. టీడీపీ వర్గీయులు బుధవారం రాత్రి నుంచీ పంపిణీ మొదలు పెట్టారు. వీరు ఓటుకు రూ. వెయ్యి వంతున ముట్టజెపుతున్నారు.

సత్యవేడులో స్వతంత్ర అభ్యర్థి హల్‌చల్‌

సత్యవేడు నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో వున్న రమేష్‌ బాబు వర్గీయులు హల్‌చల్‌ చేస్తున్నారు. ప్రధాన పార్టీలకు మించి హడావిడి చేస్తున్నారు. ఎక్కడికి ప్రచారం వెళ్ళినా వెంట 500 మందికి తగ్గకుండా చూసుకుంటున్నారని, ప్రచారానికి వచ్చే ప్రతి ఒక్కరికీ రోజుకు రూ. 500 చొప్పున చెల్లిస్తున్నారని సమాచారం. దానికి తోడు అభ్యర్థి పది మంది బౌన్సర్లను వెంటపెట్టుకోవడంతో నియోజకవర్గంలో హడావిడి పెరిగిందని చెబుతున్నారు. ఈ అభ్యర్థి అనుచరులు పంపకాలకు కూడా సిద్ధపడ్డారని, ఓటుకు రూ. 2 వేలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారని సమాచారం.

సూళ్ళూరుపేటలో విద్యుత్‌ ఆపేసి నగదు పంపిణీ

సూళ్ళూరుపేటలో వైసీపీ వర్గీయులు నగదు పంపిణీ మొదలు పెట్టారు. మంగళవారం రాత్రి నుంచీ ఓటుకు రూ. వెయ్యి చొప్పున అందజేస్తున్నారు. నాయుడుపేట పట్టణంలో నగదు పంపిణీ ప్రారంభించిన ఆ పార్టీ నేతలు మంగళవారం రాత్రి విద్యుత్‌ సరఫరా ఆపివేయించి మరీ చీకటిలో నగదు అందజేసినట్టు చెబుతున్నారు.టీడీపీ వైపు కూడా నిధులు చేరుతున్నాయని, అయితే ఓటరుకు రూ. 500 చొప్పున ఇవ్వాలా లేక రూ. వెయ్యి చొప్పున ఇవ్వాలా అన్నది నిర్ణయించుకోలేదని సమాచారం.

వెంకటగిరిలో టీడీపీ ముందంజ

వెంకటగిరిలో నగదు పంపకాల్లో టీడీపీ ముందంజ వేసింది. వైసీపీ వర్గీయులు ఓటుకు రూ. 3 వేల చొప్పున పంపిణీ చేస్తారని మూడు రోజులుగా ప్రచారం జరుగుతుండగానే టీడీపీ వర్గీయులు ఓటుకు రూ. 2 వేల వంతున నియోజకవర్గంలో ఇప్పటికే 70 శాతం మందికి చేరవేసినట్టు తెలిసింది. హైదరాబాదు నుంచీ ఓ పారిశ్రామికవేత్త మనుషులు, చెన్నై, గుంటూరు నుంచీ ముఖ్యనేత సన్నిహితులు స్థానిక పార్టీ నేతల సమక్షంలో నగదు పంపిణీ చేస్తున్నారు. మద్యం పంపిణీ చేయనప్పటికీ మండలాలకు చేరిపోయినట్టు సమాచారం. వైసీపీ వర్గీయులు మాత్రం ఓటుకు రూ. 2500 వంతున ఇవ్వాలని ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలిసింది.నగదు పంపిణీ కోసం వాకాడులో ఆ పార్టీ ముఖ్యనేతకు చెందిన విద్యా సంస్థ నుంచీ ఉద్యోగులు రంగప్రవేశం చేశారు. మద్యం కూడా మండలాలకు తరలించి పంపిణీకి సిద్ధం చేశారని సమాచారం.

Updated Date - May 09 , 2024 | 12:51 AM