Share News

మున్సిపాలిటీలో కొనసాగుతున్న విచారణ

ABN , Publish Date - Nov 21 , 2024 | 01:14 AM

తిరుపతి నగర పాలకసంస్థలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పూర్వ అధికారుల అక్రమాలపై జరుగుతున్న విచారణ మూడు రోజుల విరామం అనంతరం బుధవారం తిరిగి ప్రారంభమైంది.

మున్సిపాలిటీలో కొనసాగుతున్న విచారణ

మరో రెండు రోజుల్లో పూర్తి

తిరుపతి, నవంబరు20(ఆంధ్రజ్యోతి): తిరుపతి నగర పాలకసంస్థలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పూర్వ అధికారుల అక్రమాలపై జరుగుతున్న విచారణ మూడు రోజుల విరామం అనంతరం బుధవారం తిరిగి ప్రారంభమైంది. గత వారం మూడు రోజుల పాటు అనంతపురం రీజనల్‌ డైరెక్టర్‌ విశ్వనాథ్‌ నేతృత్వంలో మూడు బృందాలు తిరుపతిలో విచారణ చేపట్టాయి. ఆతర్వాత మళ్లీ తిరుపతికి చేరుకున్న విచారణ బృందం తమ పని చేసుకుపోతోంది. ఇటీవల బదిలీఅయిన రెవెన్యూ అధికారి కేఎల్‌ వర్మ, మేనేజర్‌ చిట్టిబాబు, డీఈ విజయకుమార్‌ రెడ్డిపై అక్రమ ఆరోపణలపై లోతుగా విచారణ చేస్తున్నట్టు తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వంలో పుంగనూరు మున్సిపల్‌ కమిషనర్‌గా కూడా పనిచేసిన వర్మ అవకతవకలపై ప్రత్యేక దృష్టిపెట్టినట్టు సమాచారం. ఇప్పటికే విచారణకమిటీ బృందంపై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు వస్తున్నట్టు తెలిసింది. అయితే ఆర్డీ విశ్వనాథ్‌ ముక్కుసూటిగా వ్యవహరిస్తారన్న పేరుండడంతో విచారణ ఎదుర్కొంటున్న వారి ఎత్తులు పారడంలేదన్న ప్రచారం జరుగుతోంది. మరో రెండు రోజుల్లో విచారణ పూర్తికానుందని, నివేదికను డైరెక్టర్‌ ఆఫ్‌ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌కు అందజేయనున్నట్టు సమాచారం.

Updated Date - Nov 21 , 2024 | 01:14 AM