Share News

భువనేశ్వరి యుద్ధ భేరి!

ABN , Publish Date - May 09 , 2024 | 12:48 AM

‘ఓటు మన ఆయుధం, ఈనెల 13న జరిగేది యుద్ధం. గురిచూసి ఆయుధం వదలాలి. ఫ్యాను రెక్కలు ఊడి కింద పడాలి’ అంటూ తన భర్త చంద్రబాబు నియోజకవర్గమైన కుప్పం గడ్డమీద నిలబడి నారా భువనేశ్వరి మోగించిన యుద్ధభేరి ఇది. ఆమె భేరీ నినాదానికి, ఉద్రేకమైన కుప్పం నారి అడుగడుగునా కదం తొక్కింది.

భువనేశ్వరి యుద్ధ భేరి!

కుప్పం, మే 8: ‘ఓటు మన ఆయుధం, ఈనెల 13న జరిగేది యుద్ధం. గురిచూసి ఆయుధం వదలాలి. ఫ్యాను రెక్కలు ఊడి కింద పడాలి’ అంటూ తన భర్త చంద్రబాబు నియోజకవర్గమైన కుప్పం గడ్డమీద నిలబడి నారా భువనేశ్వరి మోగించిన యుద్ధభేరి ఇది. ఆమె భేరీ నినాదానికి, ఉద్రేకమైన కుప్పం నారి అడుగడుగునా కదం తొక్కింది. ఐదేళ్ల తమ కష్టాలు తలచుకుని, రాబోయే ‘చంద్ర’ రాజ్యాన్ని మనసున నిలుపుకుని గ్రామగ్రామానా ఆమెపై ప్రజల అభిమానం పోటెత్తింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం రాత్రి శాంతిపురం మండలం బెల్లకోగిలలో మొదలైన ఆమె రోడ్‌ షోలు, రెండో రోజైన బుధవారం రామకుప్పం మండలం మీదుగా కుప్పం మండలం కంగుంది, దాసేగౌనూరు మీదుగా కొనసాగి తంబిగానిపల్లెలో ముగిసింది. ముందుగా నిర్ణయించిన రూట్‌ మ్యాప్‌ మార్గంలోనే కాదు, అడుగడుగునా వెల్లువెత్తిన అభిమానం చూసిన భువనేశ్వరి అదనపు గ్రామాలనూ సందర్శించారు. ఇలా రామకుప్పం మండలంలో షెడ్యూల్‌లో లేని సుమారు పది గ్రామాలను చుట్టేశారు. ఎక్కడా తడబడకుండా వైసీపీ ప్రభుత్వ అరాచకాలను ఎండగట్టారు. ముఖ్యంగా ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ గురించి ప్రభుత్వ మోసపూరిత కుట్రను ప్రజలకు అర్థమయ్యేలా వివరించారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలను ప్రశ్నించారు. క్రమేణా భువనేశ్వరిలో వచ్చిన ఈ మార్పు పార్టీ శ్రేణులను ఉత్తేజితులను చేసింది. రాష్ట్రమంతా పర్యటించే క్రమంలో చంద్రబాబు ప్రచారానికి తరచూ రాలేకపోతున్న లోటు తీరినట్లుగా వారు ఇప్పుడు భావిస్తున్నారు.

అలుపెరగని పలకరింపు

గతంలో భువనేశ్వరి కుప్పం పర్యటనకు వచ్చినప్పుడు ఒకట్రెండు కార్యక్రమాల్లో పాల్గొనేవారు. అదీ మండల కేంద్రాలు, ఈ సమీప గ్రామాల్లో మాత్రమే. పొద్దు వాలకుండా ఆయా కార్యక్రమాలు ముగించేసి బస చేరేవారు. ఈసారి ఆమె మారుమూల గ్రామాలు సైతం పర్యటించారు. మంగళవారం రాత్రి 8.30 గంటలకు రోడ్డుషో ప్రారంభమై, 10 గంటలకు ముగిసింది. మంగళవారంనాడు ఉదయం పదిన్నర గంటలకు కుప్పం నుంచి బయలుదేరిన ఆమె రామకుప్పం మండలంలోని మూలమూలనున్న గ్రామాలను సైతం చుట్టేశారు. ఆ మండల కేంద్రం నుంచి 30కిలోమీటర్లకుపైగా దూరాన ఉన్న వీర్నమలతాండాలో మహిళలతో సమావేశమయ్యారు. రెండో రోజూ ఆమె పర్యటన ముగిసే సరికి రాత్రి పది గంటలైంది. ఎక్కడా అలుపెరగకుండా ప్రసంగాలు చేశారు. చిరునవ్వుతో ప్రజలను, కార్యకర్తలను, అభిమానులను పలకరించారు. రెండు రోజుల భువనేశ్వరి పర్యటన టీడీపీ శ్రేణుల్లో జోష్‌ నింపింది.

తమ్ముడు తోడుగా: ఈసారి ఎన్టీఆర్‌ కుమారుడు నందమూరి రామకృష్ణ ఎన్నికల ప్రచారానికి అక్క భువనేశ్వరితో కలిసి వచ్చారు. రోడ్‌ షోల పొడవునా ఆమె వెంటే ఉన్నారు. అక్కడక్కడా మాట్లాడారు. ఆయన్ను చూడడానికి జనం పోటీ పడ్డారు.

Updated Date - May 09 , 2024 | 12:48 AM