Share News

ఆంబోతు కొమ్ములు విరిచేయండి

ABN , Publish Date - May 08 , 2024 | 01:27 AM

పెద్దిరెడ్డిపై చంద్రబాబు ధ్వజం

ఆంబోతు కొమ్ములు విరిచేయండి
పుంగనూరు సభలో మాట్లాడుతున్న చంద్రబాబు

పుంగనూరు, మే 7(ఆంధ్రజ్యోతి): ‘మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కాంట్రాక్టర్లు వీళ్లే. ఇసుక, మద్యం, మైనింగ్‌ వ్యాపారాలు వీళ్లవే. ఇలా పెద్దిరెడ్డి కుటుంబం రూ.వేల కోట్లను దోచేసింది’ అని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. పుంగనూరులో మంగళవారం సాయంత్రం జరిగిన ప్రచార సభలో ఆయన మాట్లాడారు. రాజంపేట పార్లమెంటు బీజేపీ అభ్యర్థి కిరణ్‌కుమార్‌రెడ్డి, పుంగనూరు అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డిని గెలిపించాలని కోరారు. పెద్దిరెడ్డి పొగరుబోతు. ఆంబోతులా తయారయ్యారు. కొమ్ములు విరిచేయండి. వీరి కుటుంబ రాజకీయ ఆధిపత్యానికి గండి పెట్టడానికి కిరణ్‌కుమార్‌రెడ్డి వచ్చారు. పాపాల పెద్దిరెడ్డికి నిద్రలేని రాత్రులు చూపిస్తాం. మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రజలకు మేలు చేసే వ్యక్తి. గతంలో రాజకీయపరంగా విభేదించామే తప్ప కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదు. శివశక్తి డెయిరీ ద్వారా పుంగనూరు నియోజకవర్గ రైతుల్ని దోచేశారు. చివరికి మా హెరిటేజ్‌ను కూడా వీరి ప్రాంతానికి రానివ్వరు. మామిడి ధరల్ని తగ్గించి రైతులకు అన్యాయం చేసి.. అక్కడా కమీషన్లు తీసుకున్నారు. అనుమతుల్లేని రిజర్వాయర్ల ద్వారా రైతులకు అన్యాయం చేశారు. పెద్దిరెడ్డికి, కిరణ్‌కుమార్‌రెడ్డి పోలిక అస్సలు లేదు అని చంద్రబాబు అన్నారు.

టీడీపీ శ్రేణులపై వేధింపులు మరచిపోలేను

‘పుంగనూరులో దాడులు జరగని రోజు, అక్రమ కేసులు పెట్టని రోజు, అరెస్టులు జరగని రోజు లేదు. చౌడేపల్లె బస్టాండు వద్ద టీడీపీ జెండా దిమ్మె తొలగించారు. సదుంలో టీడీపీ నేత రాజారెడ్డిని కిడ్నాప్‌ చేసి కొట్టారు. పుంగనూరులో టీడీపీ కార్యాలయానికి భవనం అద్దెకిచ్చిన యజమానిని బెదిరించి ఖాళీ చేయించారు. పెద్దిరెడ్డికి స్వాగత బ్యానర్లను తన ఇంటి వద్ద కట్టొద్దని చెప్పినందుకు నవీన్‌కుమార్‌ను అరెస్టు చేశారు. మృత్యుంజయస్వామి ఆలయాన్ని పునర్నిర్మించిన టీడీపీ నేత రమణారెడ్డిపై తప్పుడు కేసులు పెట్టారు. సోమల మండలం పెద్దఉప్పరపల్లెలో చల్లా బాబుపై దాడిచేసి 13 మందిపై కేసులు పెట్టారు. వైసీపీ జెండా కట్టొద్దని చెప్పినందుకు చౌడేపల్లె టీడీపీ నేత రమే్‌షరెడ్డి సహా 41 మంది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు. వాళ్లు జైల్లో ఉన్నప్పుడు కూడా స్థానికంగా ఎవరూ లేకుంటే వేరే ప్రాంతం నుంచి మనుషుల్ని పంపించి వారి కుటుంబాలకు ఆర్థిక సాయం చేశాం. గతేడాది పుంగనూరులో నాపై దాడి చేయించి నాపైనే కేసులు పెట్టించారు. 800 మంది టీడీపీ శ్రేణులపై కేసులు పెట్టి 450 మందిని జైల్లో పెట్టడంతో తన గుండె రగిలిపోతోంది’ అన్నారు. ‘పాపాల పెద్దిరెడ్డిని శాశ్వతంగా రాజకీయాల నుంచి భూస్థాపితం చేయండి. పెద్దిరెడ్డి చేతిలో ఓసారి చల్లా ఓడిపోయారు. ఈసారి చల్లా చేతిలో పెద్దిరెడ్డి ఓడిపోతున్నారు. పెద్దిరెడ్డిని ఎదుర్కొనే దీటైన నాయకుడు చల్లా బాబు’ అన్నారు. ‘బీసీవై పార్టీ అధినేత రామచంద్రయాదవ్‌ పెద్దిరెడ్డి సొంతూరు సదుంకు వెళ్లినందుకు అక్కడి వైసీపీ శ్రేణులు అతనిపై అతని అనుచరులపై దాడి చేశారు. వాహనాల్ని స్టేషన్‌ ఎదుటే తగలబెట్టారు. కొవ్వు పట్టి పెద్దిరెడ్డి చేస్తున్న పనుల్ని అణిచివేస్తా’నని చంద్రబాబు చెప్పారు. మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ పుంగనూరు కేంద్రంగా మంత్రి పెద్దిరెడ్డి ఆయన కుమారుడు ఎంపీ మిధున్‌రెడ్డికి వస్తున్న అవినీతి ఆదాయాన్ని లెక్క కట్టి ప్రజలకు వివరించారు. క్షణం సంతోషం కోసం జీవితాన్ని పాడు చేసుకోవద్దని ఎయిడ్స్‌ ప్రకటన వచ్చేది. ఇప్పుడు వీళ్లు ఇచ్చే డబ్బుల కోసం జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. పెద్దిరెడ్డి ఎయిడ్స్‌ కంటే ప్రమాదకరం అని చెప్పారు. ‘పెద్దిరెడ్డి అక్రమాలు అవినీతి గురించి మాట్లాడితే దానికి స్పందించడకుండా ఏదేదో మాట్లాడుతున్నాడు. నేను ఎవరి కాళ్లో పట్టుకున్నానని చెప్పాడు. డీసీసీ పదవి కోసం నా కాళ్లను పట్టుకున్న వ్యక్తి అతడు. దానికి కూడా సమాధానం లేదు. జగన్‌రెడ్డిని నేను అరెస్టు చేయించానని చెప్పాడు. షర్మిలనే చెప్పింది సోనియాకు సంబంధంలేదని. సాయిబాబా ట్రస్టు నుంచి బంగారమంతా తీసుకెళ్లానని చెప్పాడు. నేను అయ్యప్పస్వామి గుడి వద్ద, కాణిపాకం వచ్చి ప్రమాణం చేస్తానని చెప్పాను. దానికీ పెద్దిరెడ్డి స్పందించలేదని కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

పుంగనూరు పసుపుమయం

పుంగనూరు వీధుల్లో పసుపుజెండా రెపరెపలాడింది. పట్టణమంతా పసుపుమయంగా మారింది. గతేడాది ఆగస్టు 4న చంద్రబాబునాయుడు పూతలపట్టుకు వెళ్లే క్రమంలో పుంగనూరు వద్ద టీడీపీ శ్రేణలు, పోలీసుల మధ్య జరిగిన గొడవ రణరంగంగా మారింది. ఆ సమయంలో టీడీపీ శ్రేణులు పుంగనూరుకు రావాలంటూ ఆహ్వానించగా త్వరలోనే వస్తానని వెళ్లారు. అనంతరం పోలీసులు ఇష్టారాజ్యంగా నమోదుచేసిన కేసులతో టీడీపీ జెండా పట్టాలంటేనే శ్రేణులు భయపడే పరిస్థితి. ఈ క్రమంలో మంగళవారం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో మోటారు సైకిళ్లు, వాహనాలు, బస్సుల్లో టీడీపీ శ్రేణులు, ప్రజలు తరలివచ్చారు. వీరిలో ఉత్సాహం ఉరకలేసింది. సభ జరిగినంత సేపూ టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు ఆనందంతో కేరింతలు కొడుతూ కనిపించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పాపాల పెద్దిరెడ్డి అంటూ సంబోధిస్తూ తీవ్రస్థాయిలో చంద్రబాబు విమర్శలు చేయడంతో సభికుల నుంచి విశేషస్పందన లభించింది. సీఎం జగన్‌ను జగ్గూబాయ్‌ అనడం, పుంగనూరు ప్రజలు పెద్దిరెడ్డికి బానిసలు కాదని, ఇక్కడి ప్రజల్లో పౌరుషం ఉందా అంటూ పలుమార్లు జనాన్ని ప్రశ్నించారు. పుంగనూరు నుంచే పెద్దిరెడ్డి రాజకీయ పతనం మొదలవుతుందని వ్యాఖ్యానించారు. జనం స్పందన గమనిస్తూ నాలుగు వైపులా తిరుగుతూ చిరునవ్వుతో చంద్రబాబు కనిపించారు.

ఐదేళ్ల తర్వాత..

2019 ఎన్నికల సమయంలో పుంగనూరు మండలం సింగిరిగుంట వద్ద చంద్రబాబునాయుడు హంద్రీనీవా జలాలకు పూజలు చేశారు. నాటి టీడీపీ అభ్యర్థి ఎన్‌.అనీషారెడ్డిని గెలిపించాలని ప్రచార సభలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఇప్పుడు పుంగనూరు వచ్చారు.

Updated Date - May 08 , 2024 | 01:27 AM