Share News

sun shade స్కూల్లో కుప్పకూలిన సన్‌షేడ్‌

ABN , Publish Date - Jul 27 , 2024 | 01:48 AM

నెల్లూరులోని కేఎన్‌ఆర్‌ పాఠశాలలో శుక్రవారం సాయంత్రం నిర్మాణంలో ఉన్న భవనం గోడ కూలి కిందపడడంతో ఓ విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు.

sun shade స్కూల్లో కుప్పకూలిన సన్‌షేడ్‌
ఘటనాస్థలిని పరిశీలిస్తున్న డీఈవో రామారావు

నెల్లూరు (విద్య/క్రైం), జూలై 26 : నెల్లూరులోని కేఎన్‌ఆర్‌ పాఠశాలలో శుక్రవారం సాయంత్రం నిర్మాణంలో ఉన్న భవనం గోడ కూలి కిందపడడంతో ఓ విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు.వెంకటగిరి ప్రాంతానికి చెందిన కొత్తపాలెం గురవయ్య, రూప దంపతులకు ఇద్దరు కుమారులు. బిడ్డల చదువుల కోసం వీరు నెల్లూరుకు వలసొచ్చారు.ఇస్కాన్‌ సిటీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో గురవయ్య వాచ్‌మన్‌గా పని చేస్తుండగా, రూప కూలి పనులకు వెళుతోంది. వీరి చిన్న కుమారుడు గురుమహేంద్ర (14) కేఎన్‌ఆర్‌ నగరపాలక సంస్థ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు.శుక్రవారం ఉదయం పాఠశాలకు వెళ్లిన మహేంద్ర సాయంత్రం లాంగ్‌బెల్‌ తర్వాత నిర్మాణంలో ఉన్న నాడు-నేడు రెండవ దశ అదనపు తరగతి గదుల మొండి గోడల వద్దకు వెళ్లి గోడపైన ఉన్న లింటల్‌ను పట్టుకొని ఆడుకుంటున్న సమయంలో లింటల్‌, దానిమీద ఉన్న గోడ విరిగి గురుమహేంద్రపై పడ్డాయి.గమనించిన తోటి విద్యార్థులు అక్కడే ఉన్న ఉపాధ్యాయులకు తెలిపారు. హుటాహుటిన వారు గోడకింద ఉన్న విద్యార్థిని బయటకు తీశారు. గోడ బలంగా గురుమహేంద్ర తలపై పడటంతో తల పగిలి అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు.ప్రధానోపాధ్యాయుడు ఎం.విజయ ప్రకాష్‌ వేదాయపాలెం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో డీఎస్పీ శ్రీనివాసులరెడ్డితోపాటు సీఐ నారాయణ సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. జీజీహెచ్‌లో పోస్టుమార్టం అనంతరం విద్యార్థి మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. వందల మంది విద్యార్థులకు ఇద్దరే ఉపాధ్యాయులు ఉండటంతో విద్యార్ధులను అదుపు చేయడం కష్టంగా మారుతోందని, అందుకే ప్రమాదం జరిగిందని పాఠశాల హెచ్‌ఎం పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ సంఘటనతో కేఎన్‌ఆర్‌ నగరపాలక ప్రాథమిక పాఠశాలలో నాడు-నేడు కింద జరిగిన భవన నిర్మాణ పనుల్లో డొల్లతనం బయటపడింది. పనులు నాసిరకంగా జరగడంతో లింటల్‌ లెవల్‌ సన్‌షేడ్‌ శుక్రవారం కూలిపోయింది. కాంక్రీట్‌ బీమ్స్‌లో నుంచి ఇనుపచువ్వలు సైతం బయటకు పొడుచుకుని వచ్చాయి.చనిపోయిన విద్యార్థి గురుమహేంద్ర కుటుం సభ్యులకు ప్రభుత్వం తరఫున అండగా నిలుస్తామని, రూ.5లక్షల పరిహారం అందచేస్తామని మంత్రి నారాయణ ఓ ప్రకటనలో తెలిపారు. శనివారం బాధిత కుటుంబాన్ని పరామర్శించి చెక్కును అందజేస్తామని తెలిపారు. కేఎన్‌ఆర్‌ పాఠశాలలో జరిగిన ప్రమాద ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ది పేరెంట్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఏపీ నేతలు డిమాండ్‌ చేశారు.

Updated Date - Jul 27 , 2024 | 01:49 AM