Share News

తిరుమల రెవెన్యూలో అవినీతి తిమింగలాలు

ABN , Publish Date - Jul 26 , 2024 | 01:40 AM

తిరుమల రెవిన్యూ విభాగంలో అవినీతి తిమింగలాలు హల్‌చల్‌ చేస్తున్నాయి. గత ఐదేళ్ళుగా కొండపై దుకాణాల దందాలో వీరి పేర్లు మారుమోగాయి.

తిరుమల రెవెన్యూలో అవినీతి తిమింగలాలు

ఐదేళ్ళుగా కొండపై దుకాణాల దందా

గత బోర్డు ముఖ్యుల పేరిట భారీగా వసూళ్ళు

విజిలెన్స్‌ విచారణలో వెల్లడైనా వేటు వేయని ధర్మారెడ్డి

ప్రభుత్వం మారినా నిక్షేపంగా కొనసాగుతున్న ప్రాబల్యం

తిరుమల రెవిన్యూ విభాగంలో అవినీతి తిమింగలాలు హల్‌చల్‌ చేస్తున్నాయి. గత ఐదేళ్ళుగా కొండపై దుకాణాల దందాలో వీరి పేర్లు మారుమోగాయి. నాటి పాలకమండలి ముఖ్యుల పేరిట భారీగా వసూళ్ళకు పాల్పడ్డారని, ఆ క్రమంలో టీటీడీ ఆదాయానికి సైతం భారీగా గండి కొట్టారన్న ఆరోపణలున్నాయి. అవినీతి, అక్రమాలపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో గతేడాది ఆఖరులో టీటీడీ విజిలెన్స్‌ విచారణకు ఆదేశించింది.ఈ విచారణలో రెవిన్యూ విభాగానికి చెందిన పలువురి నిర్వాకాలు వెలుగు చూశాయి. విజిలెన్స్‌ నివేదికలో టీటీడీ ఆదాయానికి గండి పడడానికి ప్రధాన బాఽధ్యత వారిదేనని వెల్లడైనా చర్యలు లేకుండానే ఈ ఏడాది ఎన్నికల దాకా మిన్నకుండిపోయింది టీటీడీ. ప్రభుత్వం మారిన తర్వాతైనా ఇలాంటి వారికి కీలక విభాగం నుంచీ ఉద్వాసన పలుకుతారని వేచి చూసిన బాధితులకు నిరాశే మిగులుతోంది. ప్రస్తుత కీలక అధికారుల వద్ద కూడా ఈ వసూల్‌ రాజాలప్రభ ఏమాత్రం తగ్గలేదని, ఇప్పటికీ దుకాణాల దందా నిక్షేపంగా కొనసాగిస్తున్నారని ప్రక్షాళన కోసం నిరీక్షిస్తున్న వారు వాపోతున్నారు. పాలకపక్ష యువనేత రెడ్‌బుక్‌లో ఈ అధికారి పేరుందని ప్రచారం జరుగుతున్న నేపఽథ్యంలో రెడ్‌ బుక్‌లో పేరుంటే ఏమిటట.... కీలక అధికారులు తమకు క్లోజ్‌ అని, రాబోయే బోర్డు ఛైర్మన్‌కు కాబోయే పీఏలమంటూ కాలరెగరేస్తున్నారని సమాచారం. దీంతో ప్రభుత్వం మారినా ఉపయోగమేమిటంటూ కొండపై టీడీపీ శ్రేణులు సైతం నిట్టూరుస్తున్నాయి.

టీటీడీలో తిరుమల పంచాయతీ అండ్‌ రెవిన్యూ విభాగం అత్యంత కీలకమైంది. తిరుమలలో నిర్మాణాలకు, మరమ్మతులకు ఈ విభాగమే అనుమతులు ఇవ్వాల్సి వుంటుంది. అలాగే దుకాణాలు, తట్టలుగా పిలిచే హాకర్ల నుంచీ టీటీడీకి అద్దెలు వసూలు చేసే విభాగమిది. తరచూ తనిఖీలు చేస్తూ దుకాణాలు, తట్టల నిర్వాహకులు నిబంధనలు ఉల్లంఘించకుండా పర్యవేక్షించడం కూడా ఈ విభాగం ప్రధాన బాధ్యత. గత వైసీపీ ప్రభుత్వంలో ఈ విభాగ అధికారులు, ఉద్యోగులు కొందరు దుకాణాలను, హాకర్లను పర్యవేక్షించే పేరిట అక్రమ దందాలకు తెరలేపారనే ఆరోపణలున్నాయి. అనధికారిక దుకాణాలు, హాకర్‌ వ్యాపారాలను ప్రోత్సహించారని, టీటీడీకి చేరాల్సిన ఆదాయానికి గండి కొట్టి కొందరు పాలకమండలి ముఖ్యులకు మళ్ళించారనే ఆరోపణలున్నాయి. దాని మాటున తాము కూడా రూ. కోట్లకు పడగలెత్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారంపై గతేడాది టీటీడీకి, ప్రభుత్వానికి విపరీతంగా ఫిర్యాదులు వెళ్ళాయి. ఆ క్రమంలో టీటీడీ గతేడాది జూన్‌లో విజిలెన్స్‌ విచారణకు ఆదేశించింది. దానికనుగుణంగా గత జూన్‌ 15 నుంచీ 27 వరకూ 13 రోజుల పాటు విజిలెన్స్‌ సిబ్బంది జీఎన్‌సీ, పీఏసీ 1, 2, 3... ఆర్టీసీ బాలాజీ బస్టాండు, సప్తగిరి, వీజీవో ఆఫీసు ఏరియా, ఎన్‌సీ 1, 2... లేపాక్షి ఎంపోరియం, లేపాక్షి అండర్‌ బ్రిడ్జి, ఎస్‌ఎన్‌సీ, టీబీసీ, హెచ్‌వీసీ, ఏఎన్‌సీ, ఏటీసీ, పాంచజన్యం, నందకం కేకేసీ, కళ్యాణ వేదిక, శ్రీవారి పాదాలు, మేదరమిట్ట, గుబ్బా సత్రం, శిలాతోరణం, వీఎ్‌సజీహెచ్‌ ఏరియా, ఏబీఎస్‌, డీఎంబీ రోడ్డు, ఎస్‌ఎంసీ రోడ్డు, వైకుంఠం-1 క్యూలైన్‌ ఏరియా, ఎస్‌బీఐ రాగిమాను, ఎస్‌బీఐ ఏటీఎం, అన్నదానం వెలుపలికి వెళ్ళే గేటు, అన్నపూర్ణ క్యాంటీన్‌, డీఎంబీ, మోకాలిమిట్ట, షాపింగ్‌ కాంప్లెక్సు, షాపింగ్‌ కాంప్లెక్సు ఎక్సా్ట్ర తట్టలున్న ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

రెవిన్యూ విభాగం వైఫల్యాన్ని నిర్ధారించిన విజిలెన్స్‌ నివేదిక

హాకర్ల నుంచీ అద్దెలు సక్రమంగా వసూలు చేయడంతో రెవిన్యూ విభాగం విఫలమైందని విజిలెన్స్‌ విభాగం ఇచ్చిన నివేదికలో స్పష్టంగా వెల్లడించింది. మరోవైపు అక్రమాలను అరికట్టడంలో విఫలం కావడంతో టీటీడీ ఆదాయానికి గండి పడిందని పేర్కొంది. రెవిన్యూ విభాగంలో ఏఈవోలు భాస్కర నారాయణ చౌదరి, సత్రే నాయక్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ మురుగేశన్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ యుగంధర్‌ దీనికి బాధ్యులుగా విజిలెన్స్‌ విభాగం నివేదికలో నిర్ధారించింది. వీరు సక్రమంగా తనిఖీలు చేయడం లేదని, అద్దెలు వసూలు చేయడం లేదని, అక్రమాలను గుర్తించి చర్యలు తీసుకోలేదని నివేదికలో పేర్కొంది. తిరుమలలో అక్రమ వ్యాపారాలకు సంబంధించి రెవిన్యూ విభాగం ఏఈవో ఒకరు తెర వెనుక కీలక పాత్ర పోషిస్తున్నట్టు పేర్కొంది. అయితే ఆ అధికారి ఎవరన్నది స్పష్టంగా తెలిసినా, కొండపై వ్యాపారవర్గాల్లో బహిరంగ రహస్యమే అయినా విజిలెన్స్‌ ఆ అధికారి వివరాలు వెల్లడించడానికి మొహమాటపడినట్టు సమాచారం. అందుకే నివేదికలో.... హాకర్ల వర్గాలలో రెవిన్యూ విభాగానికి సంబంధించిన ఓ ఏఈవో స్థాయి అధికారి ‘‘కింగ్‌పిన్‌’’గా వ్యవహరిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది...అని మాత్రమే వ్యాఖ్యానించి వదిలిపెట్టేసింది.

విజిలెన్స్‌ విచారించి దోషిగా తేల్చినా చర్యలేవీ?

రెవిన్యూ విభాగం వైఫల్యం కారణంగానే కొండమీద తట్టల ఏర్పాటు, నిర్వహణల్లో అక్రమాలు జరుగుతున్నాయని విజిలెన్స్‌ విభాగం నివేదికలో తేల్చినా అవినీతి తిమింగలంపై ఇప్పటి వరకూ చర్యలు తీసుకోకపోవడం ఆశ్యర్యం కలిగిస్తోంది. కొందరిని సంబంధిత విభాగం నుంచీ ఇతర విభాగాలకు బదిలీ చేసినా తెర వెనుక కీలక పాత్ర వహిస్తున్న అధికారిని, ఆ అధికారికి సహకరిస్తున్న సిబ్బందిని మాత్రం నిక్షేపంగా కొనసాగిస్తున్నారు. టీటీడీ ముఖ్య అధికారి వద్ద ఈ అవినీతి అధికారే ఇపుడు హల్‌ చల్‌ చేస్తుండడం పట్ల టీటీడీ వర్గాలే విస్తుపోతున్నాయి. వైసీపీ ప్రభుత్వంలో అప్పటి పాలకమండలి ముఖ్యులతో, వైసీపీ కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడిన ముఖ్య అధికారితో అంటకాగిన వ్యక్తి ప్రభుత్వం మారాక కూడా అదే స్థానంలో కొనసాగుతూ తన హవా నడుపుతుండడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. టీటీడీ నుంచే రాష్ట్ర పాలనను ప్రక్షాళన చేస్తామని సాక్షాత్తూ సీఎం చంద్రబాబు తిరుమలలోనే వ్యాఖ్యానించిన నేపధ్యంలో అవినీతికి పేరుమోసిన అధికారి కీలక విభాగంలో కొనసాగుతుండడాన్ని టీడీపీ వర్గీయులు సైతం ప్రశ్నిస్తున్నారు. గత పాలకమండలి ముఖ్యులకు భారీగా ఆక్రమార్జన రుచి చూపించిన ఈ అధికారి పేరు టీడీపీ యువనేత నారా లోకేశ్‌ రెడ్‌ బుక్‌లో కూడా నమోదై వుందని ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో తన సామాజికవర్గం కారణంగా బుక్‌లో పేరున్నా తనకేమీ కాదని, కొత్తగా ఏర్పడే పాలకమండలిలో ఛైర్మన్‌ ఎవరైనా వారికి పీఏగా వ్యవహరించేది తానేనంటూ టీటీడీలో ఇతర అధికారులను కూడా సదరు తిమింగలం హడలగొడుతున్నట్టు సమాచారం. ఈ నేపధ్యంలో ప్రక్షాళన తిరుమల పంచాయతీ మరియు రెవిన్యూ విభాగం నుంచే మొదలు పెట్టాలన్న డిమాండ్‌ పలు వర్గాల నుంచీ వినిపిస్తోంది.

రూ. కోట్లు కొల్లగొడుతున్న తెర వెనుక తిమింగలం

టీటీడీ తిరుమల రెవిన్యూ విభాగంలో పేరుకు ఏఈవో అయినప్పటికీ రూ. కోట్లు కొల్లగొడుతున్నారనే ఆరోపణలున్నాయి. 1990వ దశకం తొలినాళ్ళలో జూనియర్‌ అసిస్టెంట్‌గా టీటీడీలో ప్రవేశించిన ఆ ఉద్యోగి అంచెలంచెలుగా ఇపుడు ఏఈవో స్థాయికి చేరుకున్నారని, ఆ క్రమంలో అనేక విభాగాల్లో పనిచేసి తీవ్ర అవినీతి ఆరోపణలు మూటగట్టుకున్నారని కొండ మీద ప్రచారం జరుగుతోంది. గతంలో రెండు సార్లు బోర్డు ఛైర్మన్‌గా పనిచేసిన ఒకరి వద్ద పీఏగా పనిచేసి దర్శనాల టికెట్లు, గదుల కేటాయింపుల్లో భారీగా అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. ముఖ్యంగా గత వైపీపీ ప్రభుత్వంలో సైతం వైవీ సుబ్బారెడ్డి ఛైర్మన్‌గా వుండగా ఆయన కార్యాలయంలో కొంతకాలం పనిచేశారని, ఆ పలుకుబడి ఉపయోగించి రెవిన్యూ విభాగంలో తిష్ట వేశారని టీటీడీ వర్గాలు చెబుతున్నాయి. గత పాలకమండలిలో ఓ ముఖ్యనేత తనకు అవసరమైన వారికి 30 మందికి అనధికారికంగా తట్టలు పెట్టించాలని హుకుం జారీ చేయగా దాన్ని అడ్డుపెట్టుకుని ఈ అధికారి ఏకంగా 300 దాకా అక్రమ తట్టలు పెట్టించేశారని సమాచారం. ముఖ్యనేత సిఫారసు కలిగిన తట్టల వ్యాపారుల నుంచీ రూ. 20లక్షల వంతున వసూలు చేసి పెట్టారని, అలాగే దుకాణాలు, తట్టలను ఒకచోట నుంచీ మరోచోటికి మార్పించే ప్రక్రియకు సంబంధించి కూడా భారీ మొత్తాలు వసూలు చేసి ముఖ్యనేతకు ముట్టజెప్పారని సమాచారం. తాను సొంతంగా పెట్టించిన అనధికార తట్టల వ్యాపారుల నుంచీ తొలుత భారీ మొత్తాలు రాబట్టుకున్నారని, అనంతరం నెలవారీ అద్దెలు తానే వసూలు చేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. అదనంగా ముట్టజెప్పే వారు ఒక లైసెన్సుతో రెండు మూడు చోట్ల వ్యాపారాలు చేసుకునేందుకు అనుమతిస్తున్నారని సమాచారం. పాలక మండలి కీలక నేత అక్రమార్జన ఒక్కసారికి పరిమితం కాగా ఈ అధికారి అక్రమార్జన దానికి పలు రెట్లు అధికంగా నెలనెలా కొనసాగుతోందన్న ఆరోపణలున్నాయి.

విజిలెన్స్‌ తనిఖీల్లో దిమ్మదిరిగే అక్రమాలు

మొత్తం 667మంది హాకర్లను తనిఖీ చేస్తే అందులో 165 మంది హాకర్లు టీటీడీకి అద్దె చెల్లించడం లేదని విజిలెన్స్‌ సిబ్బంది గుర్తించారు. అందులో 86 మందికి టీటీడీ జారీ చేసిన ప్రొసీడింగ్‌ కాపీలున్నాయి. కానీ వారు అద్దెలు చెల్లించకుండానే వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. 13 మంది వద్ద టీటీడీ జారీ చేసిన ప్రొసీడింగ్‌ కాపీలు కూడా లేవు కానీ ఆశ్చర్యకరంగా వారి వద్ద టీటీడీ హాకర్‌ ఐడీ కార్డులున్నాయి. వాటిని అడ్డుపెట్టుకుని వ్యాపారాలు చేసుకుంటున్నా టీటీడీకి అద్దెలు మాత్రం చెల్లించడం లేదు. 23మంది హాకర్లు దుకాణాల ఎదుట తట్టలు నడుపుతున్నారు. వారు టీటీడీకి అద్దెలు చెల్లించకుండా దుకాణదారులకు అద్దెలు చెల్లిస్తున్నారు. దుకాణాల ముందు వైపు వ్యాపారం చేసుకునేందుకు అనుమతించినందుకు దుకాణాల యజమానులు వీరి నుంచీ రోజువారీ అద్దెలు వసూలు చేసుకుని ఆదాయం పొందుతున్నారు.14 మంది ఇతరుల నుంచీ హాకర్‌ లైసెన్సులు కొనుగోలు చేసినట్టు స్టాంపు పత్రాలపై అగ్రిమెంట్లు రాసుకుని వ్యాపారాలు చేస్తున్నారు. ఇందులో టీటీడీకి సమాచారం గానీ, అనుమతులు గానీ లేవు. మరో 29మంది తాము లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకున్నామని, టీటీడీ పరిశీలనలో వున్నాయని చెబుతూ అద్దెలు చెల్లించకుండానే వ్యాపారాలు నడుపుతున్నారు. మొత్తం మీద 165 మంది హాకర్లు టీటీడీ నియమ నిబంధనలకు విరుద్ధంగా కొండపై అక్రమంగా వ్యాపారాలు నడుపుతున్నట్టు విజిలెన్స్‌ సిబ్బంది గుర్తించారు.

ఒక లైసెన్సుతో రెండు మూడు చోట్ల వ్యాపారం

విజిలెన్స్‌ అధికారుల తనిఖీల్లో పలువురు హాకర్లు ఒకటికి రెండు చోట్ల వ్యాపారాలు సాగిస్తున్న వైనం వెలుగు చూసింది. ఉదాహరణకు 483, 248, 221, 312, 491, 321, 39, 55, 478, 480, 123-2006, 71, 40, 409, 425, 33 తదితర లైసెన్సు నంబర్లు కలిగిన హాకర్లు ఒక చోట వ్యాపారం నడుపుకునేందుకు లైసెన్సు తీసుకుని రెండేసి చోట్ల వ్యాపారం చేస్తున్నట్టు విజిలెన్స్‌ విభాగం గుర్తించింది. 423వ నంబరు లైసెన్సు కలిగిన హాకర్‌ అయితే ఏకంగా మూడు చోట్ల వ్యాపారం నడుపుతున్నట్టు గుర్తించారు. ఈ 17 మందిలో ఆరుగురు మాత్రమే తాము లైసెన్సు తీసుకున్న ఒక వ్యాపారానికి గానూ టీటీడీకి అద్దెలు కడుతున్నారు. మిగిలిన వారు అద్దె కూడా ఎగ్గొడుతున్నారు.

తండళ్ళలోనూ తిమింగలానికే భారీ లబ్ది

తిరుపతి, తిరుమలలో వ్యాపార వర్గాల్లో విస్తృత ప్రచారంలో వుండే వ్యాపారం తండల్‌. వ్యాపార అవసరాల కోసం వడ్డీ వ్యాపారుల నుంచీ అప్పుగా తీసుకుని రోజువారీ లేదా వారం వారం కంతులు చెల్లించడమే తండల్‌. తిరుమల కొండపై హాకర్‌ లైసెన్సులు కలిగిన వారు, అనధికారికంగా వ్యాపారం చేసుకునే హాకర్లు మొత్తం రెవిన్యూ విభాగంలో పనిచేసే తిమింగలం గుప్పిట్లో చిక్కుకుని వున్నారనే ఆరోపణలున్నాయి. తిరుమల కొండపై తండల్‌ ఇచ్చే ఓ పేరుమోసిన వడ్డీ వ్యాపారి ఈ అవినీతి అధికారికి సన్నిహితుడు కావడంతో ఈ అధికారి తన డబ్బునే వడ్డీ వ్యాపారి ద్వారా హాకర్లకు అప్పుగా ఇప్పిస్తున్నాడని చెబుతున్నారు. హాకర్లను ఒత్తిడి చేసి వారితో తన స్నేహితుడి వద్ద అప్పు తీసుకునే చేస్తున్నారని, అలా తీసుకోని వారిని తనిఖీలు, జరిమానాల పేరిట వేధించుకుతింటున్నారని సమాచారం. హాకర్లకు ఇచ్చిన రుణాల మొత్తం రూ. 10 కోట్లకు పైబడి వుంటుందని, దానికి రోజువారీ లేదా వారం వారం వసూలు చేసే వడ్డీలు కూడా భారీగానే వుంటున్నాయని సమాచారం. ఈ దందాలో ఎన్నికల ముందు వరకూ పాలకమండలి ముఖ్యనేతకు, అప్పటి కీలక అధికారికి వాటాలు సమర్పించేవారనే ఆరోపణలున్నాయి. మరో అధికారికి తిరుపతి నగరం కరకంబాడి రోడ్డులో ఏకంగా ఇల్లే కొని బహుమతిగా ఇచ్చారని సంబంధిత విభాగాల్లో ప్రచారం జరుగుతోంది.

Updated Date - Jul 26 , 2024 | 01:40 AM