Share News

Empowerment of women నైపుణ్యాన్ని వెలికితీస్తేనే మహిళా సాధికారత

ABN , Publish Date - Jul 27 , 2024 | 01:46 AM

తమలో దాగిన నైపుణ్యాలను వెలికి తీసి, ఆర్థిక స్వాలంబన దిశగా అడుగులు వేస్తేనే మహిళా సాధికారత సాధ్యమవుతుందని ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్టు మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి అభిప్రాయపడ్డారు. కుప్పంలో శుక్రవారం ఆమె ఎన్టీఆర్‌ ట్రస్టు తరఫున స్కిల్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్‌ను ప్రారంభించారు. అనంతరం పీఈఎస్‌ ఆడిటోరియంలో 31 కుట్టు మిషన్లు, 25 తోపుడు బండ్లు ఉచితంగా పంపిణీ చేశారు.

Empowerment of women  నైపుణ్యాన్ని వెలికితీస్తేనే మహిళా సాధికారత
పీఈఎస్‌ ఆడిటోరియంలో మహిళలకు కుట్టు మిషన్లు, తోపుడు బండ్లు పంపిణీ చేస్తున్న భువనేశ్వరి

కుప్పం, జూలై 26: తమలో దాగిన నైపుణ్యాలను వెలికి తీసి, ఆర్థిక స్వాలంబన దిశగా అడుగులు వేస్తేనే మహిళా సాధికారత సాధ్యమవుతుందని ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్టు మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి అభిప్రాయపడ్డారు. కుప్పంలో శుక్రవారం ఆమె ఎన్టీఆర్‌ ట్రస్టు తరఫున స్కిల్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్‌ను ప్రారంభించారు. అనంతరం పీఈఎస్‌ ఆడిటోరియంలో 31 కుట్టు మిషన్లు, 25 తోపుడు బండ్లు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళా సంక్షేమం, ఆర్థిక స్వాలంబన, సాధికారతే ధ్యేయంగా కుప్పంలో స్కిల్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్‌ను పెట్టామన్నారు. ఎన్టీఆర్‌ ట్రస్టును సేవా భావంతో చంద్రబాబు స్థాపించారని, అదే స్ఫూర్తితో తాము ముందుకు వెళ్తున్నామన్నారు. మహిళలకు కుట్టుపని నేర్పిస్తే వారికాళ్లపై వాళ్లు నిలబడతారన్నారు. అయితే కుట్టు పనితోనే ఆగకుండా.. దుస్తుల పరిశ్రమల వారికి ఏ మోడల్‌ బట్టలు కావాలో తెలుసుకుని, స్కిల్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్‌లో శిక్షణ పొందినవారితో కుట్టించి మార్కెటింగ్‌ సదుపాయాన్నీ కల్పించేలా మాట్లాడుతున్నామని చెప్పారు. వైరు బుట్టలు, ఇతర చేతిపనులు వంటివి మహిళల అసక్తిని అనుసరించి శిక్షణ ఇస్తామన్నారు. శిక్షణ తీసుకున్న మహిళలకు ప్రత్యేకంగా కో ఆపరేటివ్‌ సొసైటీ ఏర్పాటు చేసి, వారి ఉత్పత్తులు వారే విక్రయించుకునేలా నిర్వహణ సామర్థ్యాలనూ పెంచుతామన్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ స్కిల్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్లను ఏర్పాటు చేసి మహిళా సాధికారతకు కృషి చేస్తామన్నారు. ఎన్టీఆర్‌ ట్రస్టు ద్వారా కుప్పంలో స్కూల్‌ ఏర్పాటు చేసి, పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తామని హామీ ఇచ్చారు. డీఎస్సీ.. ఐఏఎస్‌ కోచింగ్‌నూ ఉచితంగా అందించేలా సెంటర్లను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మహిళలు అన్ని రంగాలతోపాటు రాజకీయాలను శాశించే స్థాయికి ఎదిగారంటే దీనికి కారణం ఎన్టీ రామారావేనని గుర్తుచేసుకున్నారు. దీనిని చంద్రబాబు కూడా కొనసాగించారని చెప్పారు. ఎన్టీఆర్‌ మహిళలకు ఇచ్చిన 9 శాతం రిజర్వేషన్లను 33 శాతానికి చంద్రబాబు పెంచారని, ఆర్థికంగా బలోపేతం చేసేందుకు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారని వివరించారు. ‘హెరిటేజ్‌’ బాధ్యతలను చంద్రబాబు అప్పగించే నాటికి తనకేమీ తెలియదన్నారు. అఽఽధైర్యపడకుండా పని నేర్చుకుని ఇప్పుడు సాధికారంగా ముందుకు వెళ్తున్నామన్నారు. కుప్పం మహిళలను సాధికారత దిశగా నడిపించి, అభివృద్ధి చేయడమే భువనేశ్వరి లక్ష్యమని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌ పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ ట్రస్టు ద్వారా అనేక కార్యక్రమాలను ఆమె చేపడతారన్నారు. 1997లో చంద్రబాబు స్థాపించిన ఎన్టీఆర్‌ ట్రస్టు ద్వారా అనేక రూపాలలో, అనేకరకాలుగా సేవలు అందిస్తున్నామని, వీటిని విస్తరించేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నట్లు సీఈవో రాజేంద్ర కుమార్‌ తెలిపారు. ట్రస్టు ద్వారా చేపట్టిన కార్యక్రమాలను ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, మహిళలు, ఎన్టీఆర్‌ ట్రస్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 27 , 2024 | 01:46 AM