Share News

నలుగురు గొలుసు దొంగల అరెస్టు

ABN , Publish Date - Nov 21 , 2024 | 01:06 AM

ఒంటరిగా ఉన్న మహిళల మెడలో నుంచి బంగారు గొలుసులను అపహరించే కర్ణాటకకు చెందిన ముఠాను చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు.

నలుగురు గొలుసు దొంగల అరెస్టు
నిందితులను చూపిస్తున్న ఎస్పీ మణికంఠ తదితరులు

53 గ్రాముల బంగారం, కారు, ద్విచక్ర వాహనాల స్వాధీనం

చిత్తూరు అర్బన్‌, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): ఒంటరిగా ఉన్న మహిళల మెడలో నుంచి బంగారు గొలుసులను అపహరించే కర్ణాటకకు చెందిన ముఠాను చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 53 గ్రాముల బంగారం, ఓ కారు, రెండు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు.వివరాలను బుధవారం ఏఎస్పీ రాజశేఖరబాబు, డీఎస్పీ సాయినాధ్‌, క్రైమ్‌ పోలీసు అఽధికారులతో కలిసి ఎస్పీ మణికంఠ చిత్తూరులో మీడియాకు వివరించారు.కేసును చేధించిన పోలీసులకు ప్రశంసాపత్రాలను అందజేశారు. ఎస్పీ కథనం మేరకు... గత నెల 26వ తేదీన పూతలపట్టు, ఐరాల మండలాల పరిధిలో 15 నిమిషాల వ్యవధిలో మూడు దొంగతనాలు జరిగాయి.కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలించారు. మన రాష్ట్రంతో పాటు కర్ణాటక, తమిళనాడుకు కూడా వెళ్లి దొంగల ముఠా గురించి వివరాలను సేకరించారు. ఈ క్రమంలో తిరుపతి- బెంగళూరు జాతీయ రహదారిలోని పలమనేరు మండలం జగమర్ల క్రాస్‌ వద్ద కర్ణాటక రాష్ట్రం, రామ్‌నగర జిల్లా కనకపుర తాలూకా ముళ్లహల్లి గ్రామానికి చెందిన శివకుమార్‌(36), చంద్రశేఖర్‌(40), జేపీనగర్‌కు చెందిన సయ్యద్‌ రేహాన్‌(19), బన్‌శంకరిలోని కనకపుర మెయిన్‌ రోడ్డుకు చెందిన కుమార్‌(19)లను అదుపులోకి తీసుకున్నారు.మరో నిందితుడైన పరశురామ్‌ను కర్ణాటక రాష్ట్రం దొడ్డబల్లాపూర్‌కు చెందిన పోలీసులు అరెస్టు చేశారు.ఈ సమావేశంలో ఎస్‌బీ సీఐ భాస్కర్‌, క్రైమ్‌ సీఐ ఉమామహేశ్వరరావు, ఎస్‌బీ ఎస్‌ఐ అనిల్‌కుమార్‌ పాల్గొన్నారు.

ఆ నలుగురి అరెస్టు వెనుక..

చిత్తూరు, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): మహిళల మెడలో నుంచి బంగారు గొలుసుల్ని దొంగలించే నలుగురిని పోలీసులు అరెస్టు చేయడం వెనుక 20 రోజుల శ్రమ దాగి ఉంది. నిందితుల్లో ఏ1 శివకుమార్‌ పీజీ కంప్యూటర్స్‌ చదివాడు.పోలీసులను మించిన సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉండడంతో పట్టుకోవడం పోలీసులకు కష్టంగా మారింది. చిత్తూరు- పీలేరు ప్రధాన రహదారిపై అక్టోబరు 26వ తేదీన 15 నిమిషాల వ్యవధిలో మూడు దొంగతనాలు జరిగాయి. ఓ మహిళ మెడలో నుంచి చైను లాగే ప్రయత్నంలో ఆమె కింద పడి, ఆ తర్వాత చికిత్స పొందుతూ మరణించింది కూడా. వరుస దొంగతనాలు, మహిళ మృతి.. పోలీసులకు ఓ రకంగా అవమానకరంగా మారింది. దీంతో స్పెషల్‌ బ్రాంచి, క్రైమ్‌ పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి అక్టోబరు 30 నుంచి నిందితుల్ని వెతకడం ప్రారంభించారు.

లింకు దొరికిందిలా..

మూడు దొంగతనాలూ చేసింది బైకులో యువకులు. ఎక్కడా ప్రధాన నిందితుడు శివకుమార్‌ కనిపించలేదు. కానీ, ఆ బైకు వెనుక ఓ కారు ప్రతిసారీ ఫాలో అవుతోంది. పూతలపట్టు నుంచి మన రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన నంగిలి వరకు చూసిన సీసీ కెమెరాల్లో ఆ బైకు వెంట ఓ కారు ఫాలో అవుతున్న విషయాన్ని గమనించిన పోలీసులు.. ఆ కోణంలో ఆరా తీశారు. టెక్నికల్‌ అనాలసిస్‌ లో శివకుమార్‌ ఆరేళ్లుగా పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్నాడని కర్ణాటక పోలీసులు చెప్పారు.

ఆరేళ్ల్లుగా దొరకని శివకుమార్‌

ప్రధాన నిందితుడు శివకుమార్‌ సొంతూరు.. కర్ణాటక రాష్ట్రం, రామ్‌నగర జిల్లా కనకపుర తాలూకా ముళ్లహల్లి గ్రామం. అది అటవీ ప్రాంతంలో ఉండడంతో ఈ ప్రాంతానికి పోలీసులు వెళితే శివకుమార్‌కున్న నెట్‌వర్క్‌ వల్ల ముందుగానే తెలిసిపోతోంది.ఇతనిపై దక్షిణాది రాష్ట్రాల్లో 40 వరకు కేసులున్నాయి. 22 కేసుల్లో అరెస్టు పెండింగు ఉంది. ఆరేళ్లుగా సాగుతున్న ఈ వ్యవహారాన్ని తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల పోలీసులు ఛేదించలేకపోయారు. శివకుమార్‌ 18ఏళ్ల యువకుల్ని పట్టుకుని వారికి మొదట గంజాయి అలవాటు చేస్తాడు. స్పోర్ట్స్‌ బైకుల్ని దొంగలించడం, వాటిపై వేగంగా వెళుతూ మహిళల మెడలో చైన్లను లాక్కెళ్లడం.. అంశాల్లో శిక్షణ ఇస్తాడు. దొంగతనం జరిగే ప్రదేశంలో తను లేకుండా చూసుకుంటాడు.శిక్షణ ఇచ్చిన యువకులు ముందు బైకులో వెళుతుండగా వెనుక కారులో ప్రయాణిస్తూ శివకుమార్‌ వారికి డైరెక్షన్‌ ఇస్తుంటాడు.కాబట్టే ఏ సీసీ కెమెరాలోనూ కన్పించడు.

రెండు సార్లు తప్పించుకున్న వైనం

చిత్తూరు పోలీసులు సుమారు 20 రోజులు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో శివకుమార్‌ కోసం గాలించారు. శివకుమార్‌ ఓ రోజు పడుకున్న ప్రదేశంలో మరో రోజు పడుకోడు. రాత్రిళ్లు పడుకోవడానికి గదులు అద్దెకు తీసుకోడు. గ్రామీణ ప్రాంతాల్లోనే తల దాచుకుంటాడు.సెల్‌ఫోన్‌ వాడడు. బ్యాంకు అకౌంట్లు, సోషల్‌ మీడియా అకౌంట్లు లేవు. టోల్‌గేట్లను తప్పించుకుని ప్రయాణిస్తూ ఉంటాడు. దీంతో చిత్తూరు పోలీసుల బృందానికి రెండుసార్లు శివకుమార్‌ కనిపించినా.. వేగంగా కారు డ్రైవ్‌ చేసి తప్పించుకున్నాడు.

అష్టకష్టాలు పడిన పోలీసులు

శివకుమార్‌ను పట్టుకోవడానికి వెళ్లిన స్పెషల్‌ బ్రాంచి బృందంలో సీఐ భాస్కర్‌, ఎస్‌ఐ అనిల్‌కుమార్‌, కానిస్టేబుళ్లు వేణు, రవి, క్రాంతి, నటరాజ్‌, సుబ్రమణ్యం.. క్రైమ్‌ బృందంలో సీఐ ఉమామహేశ్వరరావు, ఎస్‌ఐ నరసింహులు, కానిస్టేబుళ్లు గురురాజ్‌, గణేష్‌, పురుషోత్తం, స్రవంత్‌ ఉన్నారు. వీళ్లంతా అక్టోబరు 30 నుంచి నవంబరు 19 వరకు హోసూరు, మైసూరు, బెంగళూరు, దొడ్బల్లాపూర్‌, ధర్మపురి, సేలం ప్రాంతాల్లో.. కొన్నిసార్లు వేర్వేరుగా, మరికొన్నిసార్లు కలిసి తిరిగారు.చివరకు నిందితుడి సొంతూరు ముళ్లహల్లి గ్రామానికి సమీపంలోని అటవీ ప్రాంతంలో పాడుబడిన గెస్ట్‌హౌసులో మకాం వేశారు. సుమారు వారం రోజుల పాటు అక్కడే ఉండి వండుకుని తింటూ.. అక్కడి కదలికల్ని గమనించేవారు. శివకుమార్‌ కోసం రాత్రిళ్లు విడతల వారీగా మేల్కొని ఉన్నారు. అతన్ని అరెస్టు చేసే 48 గంటల ముందుగా పోలీసు బృందాల్లో ఎవ్వరికీ నిద్ర లేదు. ఎస్‌ఐ అనిల్‌కుమార్‌ గుండె నొప్పితో.. మరో పోలీసు దగ్గు, జలుబుతో ఇబ్బంది పడ్డారు. చివరకు శివకుమార్‌ సహా, అతని బ్యాచ్‌ ముగ్గుర్నీ అరెస్టు చేశారు. బుధవారం ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. చిత్తూరు పోలీసులు ఇచ్చిన సమాచారంతో మైసూరు జిల్లా పోలీసులు ఐదవ నిందితుడు అబ్బు అలియాస్‌ పరశురామ్‌ను అరెస్టు చేశారు. అక్కడి పోలీసుల అనుమతితో చిత్తూరు పోలీసులు విచారణ కోసం తీసుకురానున్నారు.

పొరుగు రాష్ట్రాల ఎస్పీల ప్రశంసలు

కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో కేసులున్నా.. ఆరేళ్లుగా తప్పించుకుని తిరుగుతున్న శివకుమార్‌ను చిత్తూరు పోలీసులు పట్టుకోవడంపై ప్రశంసలు లభించాయి. ఆ రెండు రాష్ట్రాల్లోరి రామ్‌నగర, మైసూరు, హోసూరు, బెంగళూరు రూరల్‌ ఎస్పీలు చిత్తూరు ఎస్పీ మణికంఠకు ఫోన్‌ చేసి ప్రశంసించారు. రిమాండు ముగిసిన తరువాత తమకు అప్పగిస్తే.. మా కేసుల్లో మళ్లీ అరెస్టు చేసుకుంటామని చెప్పారు.

Updated Date - Nov 21 , 2024 | 01:06 AM