Share News

కంగుంది.... ఉమెన్‌ ఫ్రెండ్లీ పంచాయతీ

ABN , Publish Date - Nov 21 , 2024 | 01:01 AM

అన్ని రంగాల్లో భాగస్వాములౌతున్న మహిళలకు మరింత తోడ్పాటు అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషిచేస్తున్నాయి.

కంగుంది.... ఉమెన్‌ ఫ్రెండ్లీ పంచాయతీ

చిత్తూరు కలెక్టరేట్‌, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): అన్ని రంగాల్లో భాగస్వాములౌతున్న మహిళలకు మరింత తోడ్పాటు అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషిచేస్తున్నాయి.ఇందులో భాగంగా మహిళా స్నేహపూర్వక పంచాయతీల (ఉమెన్‌ ఫ్రెండ్లీ పంచాయతీ) పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేసేందుకు సిద్ధమయ్యాయి. కేంద్ర పంచాయతీరాజ్‌ మంత్రిత్వశాఖ మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలో జిల్లాకు ఒకటి చొప్పున 26 పంచాయతీలను ఎంపిక చేశారు. అందులో చిత్తూరు జిల్లా నుంచి కుప్పం మండలంలోని ‘కంగుంది’ పంచాయతీని ఎంపిక చేశారు.ఈ కార్యక్రమం కింద అభివృద్ధి పనులకు కేంద్రం ప్రత్యేకంగా నిధులందించే అవకాశం ఉంది.మహిళల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడేలా వారి భాగస్వామ్యంతో పంచాయతీల్లో మౌలిక సదుపాయాలు సమకూరుస్తారు.మహిళలకు విద్య, వైద్యం, స్వయం ఉపాధి వంటి పథకాల అమలుకు పెద్దపీట వేస్తారు. ఇళ్ళ నుంచి విధిగా చెత్తసేకరణ, ఘనవ్యర్థాల నిర్వహణకు ప్రాముఖ్యం ఉంటుంది.బాల్య వివాహాలు, శిశుమరణాల నియంత్రణకు చర్యలు చేపడతారు. వ్యసనాలు లేని ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుతారు. ఉమెన్‌ ఫ్రెండ్లీ పంచాయతీగా ఎంపికైన కంగుంది గ్రామ పంచాయతీలో 12మంది వార్డుసభ్యులుండగా వారిలో ఐదుగురు మహిళలున్నారు. సర్పంచ్‌గా చంద్రశేఖర్‌ వ్యవహరిస్తున్నారు.

Updated Date - Nov 21 , 2024 | 01:01 AM