Share News

ఓట్ల కోసం నోట్లు

ABN , Publish Date - May 09 , 2024 | 12:41 AM

సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ సోమవారం జరగనుంది. అప్పుడే ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓట్ల కోసం నోట్ల పంపిణీపై దృష్టి పెట్టాయి. ఈ ఐదేళ్లు వైసీపీ నాయకులు పెద్దఎత్తున అక్రమార్జన చేయడంతో పంపిణీలోనూ వారిదే పైచేయి ఉందని తెలుస్తోంది. ఇటీవల స్వచ్ఛందంగా కొందరు, బలవంతంగా మరికొందరు వలంటీర్లు రాజీనామాలు చేసి వైసీపీ ప్రచారాల్లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ పార్టీ తరపున డబ్బు పంపిణీలో ఆ మాజీ వలంటీర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఓట్ల కోసం నోట్లు

మాజీ వలంటీర్లదే కీలకపాత్ర

జీడీనెల్లూరు, పూతలపట్టులో రూ.వెయ్యి చొప్పున

చిత్తూరు, మే 8 (ఆంధ్రజ్యోతి): సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ సోమవారం జరగనుంది. అప్పుడే ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓట్ల కోసం నోట్ల పంపిణీపై దృష్టి పెట్టాయి. ఈ ఐదేళ్లు వైసీపీ నాయకులు పెద్దఎత్తున అక్రమార్జన చేయడంతో పంపిణీలోనూ వారిదే పైచేయి ఉందని తెలుస్తోంది. ఇటీవల స్వచ్ఛందంగా కొందరు, బలవంతంగా మరికొందరు వలంటీర్లు రాజీనామాలు చేసి వైసీపీ ప్రచారాల్లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ పార్టీ తరపున డబ్బు పంపిణీలో ఆ మాజీ వలంటీర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో స్థానిక అధికార పార్టీ నాయకులు వీరిని వెంటబెట్టుకుని పంపిణీ చేస్తున్నారు. కుప్పం, పుంగనూరు, చిత్తూరు ప్రాంతాల్లో మంగళవారం రాత్రి నుంచే పంపిణీ ప్రారంభించగా.. పలమనేరు, పూతలపట్టు, జీడీనెల్లూరు, నగరి నియోజకవర్గాల్లో గురు, శుక్రవారాల నుంచి పంపిణీ చేసే అవకాశాలున్నాయి.

కుప్పంలో వైసీపీ రూ.5 వేలు

కుప్పం నియోజకవర్గంలో వైసీపీ మూడు విధాలుగా పంపిణీ చేస్తోంది. కుప్పం పట్టణంలో రూ.5 వేలు, మండల కేంద్రాల్లో రూ.4 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.3 వేలు వంతున పంపిణీ చేస్తున్నారు. మంగళవారం రాత్రి నుంచే పంపిణీ ప్రారంభించారు. కుప్పం పట్టణంలో మూడేళ్ల కిందట జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటుకు రూ.5 వేలు పంపిణీ చేసిన వైసీపీ.. ఇప్పుడు దాన్ని తగ్గించలేక కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.

ఫ పుంగనూరులో వైసీపీ వాళ్లు రూ.3 వేలు.. టీడీపీ వాళ్లు రూ.1500 చొప్పున మంగళవారం రాత్రి నుంచి పంపిణీ ప్రారంభించారు.

ఫ పలమనేరులో ఇరు పార్టీలు ఎంత పంపిణీ చేయాలనేది ఇంకా నిర్ణయించలేదు. శుక్రవారం నుంచి పంపిణీ ప్రారంభించే అవకాశం ఉంది. డబ్బుల పంపిణీ కోసం ప్రతి 50 ఇళ్లకు ఒకరిని నియమించుకున్నారు. పంపిణీ మొత్తం ప్రక్రియ రెండు గంటల్లో పూర్తి చేసేలా ప్రణాళిక రచించారు.

ఫ చిత్తూరులో టీడీపీ, వైసీపీ అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోరు నడుస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ ఇరు పార్టీలూ మంగళవారం రాత్రి నుంచి రూ.2 వేలు చొప్పున పంపిణీ చేస్తున్నాయి.

ఫ జీడీనెల్లూరు, పూతలపట్టులో ఇప్పటివరకు పంపిణీ ప్రారంభించలేదు. ఈ రెండు నియోజకవర్గాల్లోనూ ఇరు పార్టీలూ రూ.వెయ్యి చొప్పున పంపిణీ చేసేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. అందరికీ కాకుండా ఎంపిక చేసిన ఓటర్లకు మాత్రమే రూ.వెయ్యి ఇచ్చేందుకు జీడీనెల్లూరులో వైసీపీ సన్నద్ధమవుతున్నట్లు సమాచారం.

ఫ నగరి నియోజకవర్గం తీరు విచిత్రంగా ఉంది. ప్రస్తుతానికి ఎవరూ ప్రారంభించకపోయినా.. ఎవరు ముందు డబ్బిస్తే ఇంకొకరు దానికి రూ.500 ఎక్కువ ఇద్దామనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఫ ఇక, కాంగ్రెస్‌ విషయానికొస్తే.. నగరి, పూతలపట్టు, జీడీనెల్లూరు, పలమనేరు ప్రాంతాల్లో ప్రభావితం చేయగల వ్యక్తులు పోటీ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఎక్కడా పంపిణీ ప్రారంభించలేదు. ప్రారంభించే అవకాశాలూ కనిపించడం లేదు.

Updated Date - May 09 , 2024 | 12:41 AM