Share News

మాడవీధుల్లో భక్తుల ప్రదక్షిణ పాట్లు

ABN , Publish Date - Nov 21 , 2024 | 01:21 AM

తిరుమల దక్షిణ మాడవీధుల్లోని గేట్లతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం మూస్తూ, తీస్తూ అగచాట్లకు గురిచేస్తున్నారు.

మాడవీధుల్లో భక్తుల ప్రదక్షిణ పాట్లు
గేట్లు మూసివేయడంతో నిరీక్షిస్తున్న భక్తులు

గేట్లు మూసివేత నిర్ణయంతో అవస్థలు

తిరుమల, నవంబరు20(ఆంధ్రజ్యోతి): తిరుమల దక్షిణ మాడవీధుల్లోని గేట్లతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం మూస్తూ, తీస్తూ అగచాట్లకు గురిచేస్తున్నారు. సాధారణంగా శ్రీవారి దర్శనానికి వచ్చే వారు మాడవీధుల్లో ప్రదక్షిణ చేయడం ఆచారం. రద్దీరోజుల్లో దర్శనం చేసుకోలేకపోయిన భక్తులూ మాడవీధుల్లో ప్రదక్షిణ చేసి అఖిలాండం వద్ద కొబ్బరికాయ కొట్టి వెళ్లిపోతుంటారు. గత ప్రభుత్వంలోని అధికారుల నిర్ణయం నేటీకి కొనసాగుతున్న క్రమంలో భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ల్లోని కంపార్టుమెంట్లలో భక్తులు దక్షిణ మాడవీధిలోని ఇనుప బిడ్జి నుంచి ఆలయంలోకి వెళ్లి దర్శించుకుంటారు. గత ప్రభుత్వంలోని అధికారులు అధిక సంఖ్యలో భక్తులను ఆలయంలోకి అనుమతించాలనే పేరుతో వృద్ధులు, దివ్యాంగుల కోసం తిరుమల నంబి ఆలయం ముందుగా ఏర్పాటు చేసిన అదనపు క్యూలైన్‌లో నుంచే ఇతర భక్తులను తరచూ అనుమతిస్తున్నారు. ఈ క్రమంలో భక్తులు అటు, ఇటూ ప్రవేశించకుండా గేట్లు మూసివేస్తున్నారు. దీంతో ప్రదక్షిణ చేయాలనుకున్న భక్తులు గంటల తరబడి గేట్ల ముందే పడిగాపులు కాస్తున్నారు. కొందరు నిరీక్షించలేక తిరిగి వెళ్లిపోతున్నారు. బిడ్జిపై నుంచి భక్తులను ఆలయంలోకి అనుమతిస్తున్నప్పుడు ఈ అదనపు క్యూలైన్‌ ఏంటంటూ భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారలు పరిశీలించి తమ ప్రదక్షిణకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.

Updated Date - Nov 21 , 2024 | 01:21 AM