Share News

తిరుపతిలో దొంగలు పడ్డారు!

ABN , Publish Date - May 08 , 2024 | 01:29 AM

ఎదుర్కొనేందుకు ప్రజలు సిద్ధంగా వుండాలి రోడ్‌షోలో టీడీపీ అధినేత చంద్రబాబు

తిరుపతిలో దొంగలు పడ్డారు!
తిరుపతి సభలో మాట్లాడుతున్న పవన్‌ కళ్యాణ్‌, పక్కన చంద్రబాబు

తిరుపతి, మే 7 (ఆంధ్రజ్యోతి): పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో దొంగలు పడ్డారని, ఎదుర్కొనేందుకు ప్రజలు సిద్ధంగా వుండాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. మంగళవారం జనసేనాని పవన్‌ కళ్యాణ్‌తో కలసి ఆయన తిరుపతిలో రోడ్‌షో నిర్వహించారు. నగరంలోని నాలుగు కాళ్ళమండపం కూడలిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ తిరుపతిలోనే పుట్టి పెరిగానని, ఇక్కడే చదువుకున్నానని పాత రోజుల్ని గుర్తు చేసుకున్నారు.ప్రజల ఆశీస్సులతో రాష్టంలో, జాతీయ స్థాయిలో గుర్తింపు కలిగిన నేతగా ఎదిగానన్నారు. పాలనలో నిజాయితీగా వ్యవహరించినందుకు తనపై శత్రువులు 23 క్లైమోర్‌ మైన్లు పేల్చారని, అయితే వెంకటేశ్వరస్వామి తనకు పునర్జన్మ ఇచ్చారనన్నారు. సీట్ల విషయంలో సామాజిక న్యాయానికి కట్టుబడి తాము కూటమి తరపున ఆరణి శ్రీనివాసులును పోటీకి నిలబెట్టామన్నారు.అదే వైసీపీ ప్రభుత్వంలో ఏం జరిగిందో ప్రజలు ఆలోచించాలన్నారు. టీటీడీ ట్రస్టు బోర్డుకు ఈ ఐదేళ్ళలో వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి ఛైర్మన్లుగా పనిచేశారని, చివరికి ఈవోగా కూడా ధర్మారెడ్డి వున్నారని, ఇదేనా సామాజిక న్యాయమని ప్రశ్నించారు. మేయర్‌ పదవి పేరుకు బీసీ మహిళకు కేటాయించినా పెత్తనం ఎవరిదని ప్రశ్నించారు. బీసీ మేయర్‌ వుండగా డిప్యూటీ మేయర్‌ పెత్తనం చెలాయించడం వెనుకబడిన వర్గాలకు అన్యాయం చేయడం కాదా అని నిలదీశారు.

గంజాయి దందాలో వైసీపీ నేతలకు వాటా

తిరుపతిలో గంజాయి దందా పెరిగిపోయిందని, అందులో కూడా వైసీపీ నేతలకు వాటా వుందని చంద్రబాబు ఆరోపించారు.ఈ పరిస్థితుల నుంచీ తిరుపతిని కాపాడేందుకు సిద్ధమా అంటూ పదేపదే నగర వాసుల్ని ప్రశ్నించి సానుకూల సమాధానాలు రాబట్టారు. తిరుపతిపై పవన్‌ కళ్యాణ్‌కు సెంటిమెంట్‌తో కూడిన అభిమానముందని, ప్రధాని మోదీ తిరుపతిని పవిత్రంగా భావిస్తారని చెప్పారు. తిరుపతిని పవిత్ర కేంద్రంగా నిలిపే బాధ్యత తాము ముగ్గురూ తీసుకుంటామని హామీ ఇచ్చారు.తిరుపతి ఎంపీగా బీజేపీ అభ్యర్థి వరప్రసాద్‌ను, తిరుపతి అసెంబ్లీ జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులును, చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానీని గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

కోడి బొచ్చును కూడా నెలకు రూ.20లక్షలకు అమ్ముకునే కరుణాకర రెడ్డి కొడుకు అభినయ్‌ కావాలో, టీడీపీ అధినేత చంద్రబాబు, ప్రధాని నరేంద్ర మోదీ మద్దతుతో పోటీ చేస్తున్న జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు కావాలో తిరుపతి ప్రజలు ఆలోచించుకోవాలి.

2009లో చిరంజీవిని గెలిపించారు. తిరుపతిపై ఆయనకు ప్రత్యేకమైన ప్రేమాభిమానాలున్నాయి.నిర్వాసితులకు 1100 ఇళ్లు నిర్మించాలని చిరంజీవి ప్రతిపాదిస్తే 149 ఇళ్లుమాత్రమే నిర్మించారు.మిగిలినవి శ్లాబ్‌ వేయకుండా పక్కనపెట్టేశారు. కూటమి అధికారంలోకి రాగానే ఆ ఇళ్లకు శ్లాబ్‌ వేయిస్తాం.

తండ్రీ కొడుకులు కమీషన్‌ రాయుళ్లు

కరుణ, అభినయ్‌లపై పవన్‌ ధ్వజం

ప్రతి పనికీ కమీషన్లు పంచుకునే తండ్రీకొడుకులకు తిరుపతి ప్రజలు భయపడాలా అని పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించారు. ఇల్లు కట్టాలంటే ఎమ్మెల్యే కరుణాకర రెడ్డికి 30 శాతం, ఆయన కొడుకు అభినయ్‌కి 10శాతం కమీషన్‌ ఇవ్వాలట కదా అని ప్రశ్నించారు.రూ.200కోట్ల కమీషన్ల కోసం తిరుపతిలో గోవిందరాజ స్వామి సత్రాలను కూలదోసి కొత్తవి కడుతున్నారని ఆరోపించారు.మీరు తిరుమల హుండీలో వేసిన కానుకలనూ దోపిడీ చేశారన్నారు. ప్రతి పనికీ పది నుంచి 15 శాతం కమీషన్లు తీసుకుంటున్నారని, కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు శ్రీవారి ఖజనాకు ఆదాయం వస్తుంటే వైసీపీ నాయకులు కొండపై తిష్టవేసి ఖాళీ చేస్తున్నారని విమర్శించారు. కరుణాకర రెడ్డి, అభినయ్‌ టీడీఆర్‌ బాండ్ల పేరుతో రూ.2వేల కోట్లు నొక్కేశారని,చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఎర్రచందనం స్మగ్లింగ్‌లో కోట్లు గడించారని ఆరోపించారు.అలాంటివారికి ఎందుకు భయపడుతున్నారని జనాన్ని ప్రశ్నించిన ఆయన మన దమ్మేంటో తేల్చుకునే సమయం ఆసన్నమైందన్నారు. ఏడుకొండలవాడిని పైన పెట్టుకుని ఇక్కడి ఆకు రౌడీలకు భయపడడం ఏమిటని ప్రశ్నించారు. ఎన్డీఏ ప్రభుత్వం రాగానే రౌడీలను ఉక్కుపాదంతో తొక్కిపడేస్తామన్నారు. టీటీడీ సహకారంతో విద్య, వైద్యానికి నిధుల కొరత లేకుండా చూస్తామన్నారు. నగరంలోని 40కి పైగా మురికివాడలను అభివృద్ధిని చేస్తామని, యూడీఎ్‌సను బాగుచేసుకునే బాధ్యత కూటమి తీసుకుంటుందని చెప్పారు.వైసీపీ నేతల దెబ్బకు పరారైన పెద్ద పరిశ్రమలను తీసుకొచ్చి ఉపాధి కల్పించే బాధ్యత తీసుకుంటామన్నారు.ప్రతినెలా రెండో మంగళవారం స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పిస్తామన్నారు.తిరుమలను దళారీ వ్యవస్థకు అడ్డాగా, ఒక రిసార్ట్‌గా మార్చేశారని, ఇక్కడ ఆధ్యాత్మిక పరిమళాలలను తిరిగి తీసుకొస్తామన్నారు. టీటీడీ ఉద్యోగులకు ఇచ్చే ఇళ్ల పట్టాలపై జగన్‌ ఫొటోలు వేయడం ఏడుకొండల వాడిని అవమానించడమేనన్నారు.అక్రమంగా ఓట్లను కొనుగోలు చేయడానికి కరుణాకర రెడ్డి మనుషులు ఇచ్చిన డబ్బులను తిరిగి హుండీలో వేసేయండని పిలుపునిచ్చారు. దీని పర్యవసానం భవిష్యత్తులో ఆయనకు తెలుస్తుందన్నారు.

Updated Date - May 08 , 2024 | 01:29 AM