Share News

పోస్టల్‌ బ్యాలెట్‌కు పోటెత్తిన ఓటర్లు

ABN , Publish Date - May 06 , 2024 | 01:42 AM

పోస్టల్‌ బ్యాలెట్‌లో ఓట్లు వేసేందుకు ఉద్యోగులు పోటెత్తారు.గతంలో వారి నుంచీ బ్యాలెట్‌ పత్రాలు చాలావరకూ ప్రధాన పార్టీల అభ్యర్థులే సేకరించి పోస్టులో పంపడం జరిగేది.

పోస్టల్‌ బ్యాలెట్‌కు పోటెత్తిన ఓటర్లు
స్వీ ఆర్ట్స్‌ కళాశాలలో..

-పోలింగ్‌ కేంద్రాల్లో ఎండ వేడిమికి తోడు సదుపాయాల కొరతతో అల్లాడిన ఉద్యోగ,ఉపాధ్యాయులు

తిరుపతి, మే 5 (ఆంధ్రజ్యోతి): పోస్టల్‌ బ్యాలెట్‌లో ఓట్లు వేసేందుకు ఉద్యోగులు పోటెత్తారు.గతంలో వారి నుంచీ బ్యాలెట్‌ పత్రాలు చాలావరకూ ప్రధాన పార్టీల అభ్యర్థులే సేకరించి పోస్టులో పంపడం జరిగేది. ఈసారి దానికి భిన్నంగా ఉద్యోగులే ముందస్తుగా ఓటు వేసే అవకాశాన్ని ఎన్నికల కమిషన్‌ కల్పించిన సంగతి తెలిసిందే. సాధారణంగా ఓటు వేయడానికి పెద్దగా ముందుకు రాని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఈ పర్యాయం పట్టుదలగా, కసిగా ఓటు వేసేందుకు పోలింగ్‌ కేంద్రాలకు వచ్చినట్టు కనిపించింది. అయితే ఎండ వేడిమికి తోడు సదుపాయాల కొరతతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు లోనయ్యారు.

చంద్రగిరి పోలింగ్‌ కేంద్రం ఎదుట పులివర్తి నానీ ధర్నా

తిరుపతి పద్మావతీ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన చంద్రగిరి నియోజకవర్గ పోలింగ్‌ కేంద్రంలో ఉదయం నుంచే ఓటర్లు భారీగా క్యూలైన్‌లో బారులు తీరారు. కనీస సౌకర్యాలు లేకపోవడంతో పాటు ఎండ వేడిమికి, ఉక్కపోతకూ మహిళా ఓటర్లు క్యూలైన్‌లో ఇబ్బంది పడ్డారు. పలువురు ఓటర్లు క్యూలైన్‌లో ఉండలేక ఓ దశలో కేంద్రంపైపు తోసుకుని వెళ్ళారు. వారిని అదుపుచే సేందుకు పోలీసులు అవస్థ పడ్డారు. ఆ సందర్భంగా ఓటర్లకు పోలీసులకు నడుమ వాగ్వాదం చోటుచేసుకుంది. కొందరు ఎండలో ఉండలేక ఓటు వేయకుండానే తిరిగి వెళ్లిపోయారు. ఈ పరిస్థితిని గమనించిన టీడీపీ అభ్యర్థి పులివర్తి నానీ ఓటర్లకు తగిన సౌకర్యాలు కల్పించలేదని ఆరోపిస్తూ పోలింగ్‌ కేంద్రం ఎదుట అనుచరులతో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఆర్డీవో నిషాంత్‌ రెడ్డి సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కాగా పోలింగ్‌ కేంద్రాన్ని వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి కూడా సందర్శించారు. కేంద్రం బయట ఓటర్లను ఇరుపార్టీ నాయకులు ఓట్లు అభ్యర్థిస్తూ కనిపించారు.

తిరుపతిలో పోలీసులతో సీపీఐ నేతల తోపులాట

తిరుపతి ఎస్వీ ఆర్ట్స్‌ కాలేజీలో ఏర్పాటు చేసిన తిరుపతి నియోజకవర్గ పోలింగ్‌ కేంద్రం వద్ద సీపీఐ నేతలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. ఓటర్లకు సీపీఐ నాయకులు అడ్డుగా ఉన్నారంటూ పోలీసులు నెట్టడంతో ఈ వివాదం తలెత్తింది. వాగ్వాదం ముదిరి పోలీసులు, సీపీఐ నాయకులు పరస్పరం తోపులాటకు దిగారు. కాగా ఈ కేంద్రం వద్ద ఇరు పార్టీ నేతలు ప్రచారంతో హడావుడి చేశారు. ఎండకు చల్లగా ఫ్యాన్‌కి ఓటేయమని వైసీపీ నేతలు, ఎండకు చల్లని నీరును గ్లాసులో తాగాలంటూ కూటమి నేతలు ఉద్యోగులను అభ్యర్థించారు. మరోవైపు ఓటర్లు లైన్‌లో లేరని, ఉంటేనే సంతకాలు చేస్తానంటూ విధుల్లోని ఓ అధికారి సంతకం చేయకుండా లేచివెళ్లిపోయారు. సీఎం జగన్‌ స్టిక్కర్‌తో కూడిన కారు పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లడం విమర్శలకు దారి తీసింది.

పోలీసులతో బొజ్జల సుధీర్‌ వాగ్వాదం

శ్రీకాళహస్తి పోలింగ్‌ కేంద్రం గేటు వద్ద పరిమితికి మించి వైసీపీ వారిని అనుమతించడంపై టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్‌రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. గేటు వద్ద పదిమంది కంటే ఎక్కువమంది ఉండకూడదని నిబంధన పెట్టిన డీఎస్పీ వైసీపీ వారిని మాత్రం వందల సంఖ్యలో అనుమతించడం వివాదానికి కారణమైంది. పోలింగ్‌ కేంద్రం గేటు వద్ద వుండి ఇంతమంది ప్రచారం చేయడాన్ని ఎలా అనుమతించారంటూ సుధీర్‌ నిలదీశారు. దీంతో కొంతసేపు పోలీసులకూ, ఆయనకు మధ్య వాగ్వాదం జరిగింది. ఉద్యోగులు పోలింగ్‌కు వెళ్లే సమయంలో ప్రచారం చేస్తున్న వైసీపీ, టీడీపీ నాయకులు కూడా వాగ్యుద్ధానికి దిగారు. మరోవైపు రూ.1.50 లక్షలు ఖర్చు పెట్టి నిర్వహిస్తున్న పోలింగ్‌లో ఓటర్లకు సదుపాయాలు ఎక్కడున్నాయని సుధీర్‌రెడ్డి అధికారులను ప్రశ్నించారు.కూర్చోవడానికి కుర్చీలు, తాగునీరు కూడా ఏర్పాటు చేయకపోవడంతో ఎలక్షన్‌ డబ్బును ఏం చేశారని ప్రశ్నించారు. కాగా వైసీపీ నాయకులు కొంతమంది పార్టీ కండువా కప్పుకుని ప్రచారం చేయడం గమనార్హం. బొజ్జల రిషిత రెడ్డి పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.ఇక పోలింగ్‌ కేంద్రం ముందు టీడీపీ,వైసీపీ నేతలు పోటాపోటీగా టెంట్లు వేసుకుని తిష్టవేశారు.

సత్యవేడులో ఆర్వోకు వ్యతిరేకంగా నినాదాలు

సత్యవేడు పోలింగ్‌ కేంద్రం వద్ద సదుపాయాల కొరతతో మండిపడిన ఉద్యోగులు రిటర్నింగ్‌ అధికారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నియోజకవర్గంలోని ఏడు మండలాల పరిధిలో 1,366 మంది ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి సత్యవేడు ఎంపీడీవో కార్యాలయంలో పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేశారు. నాలుగు మండలాల ఉద్యోగులకు ఒకే గదిని కేటాయించడంతో ఎక్కువ సమయం వేచి వుండాల్సి వచ్చింది. ఎండ వేడికి, ఉక్కపోతకు విసిగిపోయిన ఉద్యోగులు ఓటర్ల సంఖ్యకు సరిపడా సదుపాయాలు కల్పించలేదంటూ రిటర్నింగ్‌ అధికారిపై మండిపడ్డారు. ఆర్వోకు వ్యతిరేకంగా డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు.కనీసం తాగేందుకు నీరు,కుర్చీలు కూడా ఏర్పాటు చేయకపోవడంతో ఉద్యోగులు అసహనం వ్యక్తం చేశారు. సరైన వసతులు లేనికారణంగా కొందరు ఉద్యోగులు ఇంటికే పరిమితమయ్యారు. ఇక, పుత్తూరులో పోస్టల్‌ బ్యాలెట్‌ కేందాన్ని మంత్రి రోజా సందర్శించారు. కేంద్రంలో ఏర్పాటు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు.

పుత్తూరులో పోలింగ్‌ కేంద్రమున్నా తిరుపతికి ఉద్యోగుల కేటాయింపు

ఇతర జిల్లాల్లో ఎన్నికల విధులకు కేటాయించబడిన ఉద్యోగుల కోసం తిరుపతి ఎస్వీ క్యాంపస్‌ హైస్కూల్‌లో పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేశారు. నగరి నియోజకవర్గానికి సంబంధించి ఉద్యోగులకు పుత్తూరులో పోలింగ్‌ కేంద్ర ం ఏర్పాటు చేసినప్పటికీ పలువురు అక్కడి ఉద్యోగులను ఓటింగ్‌ కోసం తిరుపతిలోని ఈ కేంద్రానికి పంపించారు. దీనిపై సంబంధిత ఉద్యోగుల నుంచీ అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. పుత్తూరులో పోలింగ్‌ కేంద్రం వున్నా తమను తిరుపతికి ఎందుకు పంపిస్తున్నారని వారు ప్రశ్నించారు. కాగా ఈ కేంద్రాన్ని నగరి టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాశ్‌రెడ్డి, మంత్రి రోజా సోదరుడు కుమారస్వామిరెడ్డి సందర్శించారు.

మహిళా వర్సిటీ పోలింగ్‌ కేంద్రంలో అవస్థలు

తిరుపతి(వైద్యం), మే 5: మహిళా విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగు కేంద్రంలో ఓటు వేసేందుకు వచ్చిన ఉద్యోగులకు తిప్పలు తప్పలేదు. ఓటింగ్‌ ప్రక్రియే 11.30గంటల దాకా ప్రారంభం కాలేదు.మధ్యాహ్నం 3 గంటల సమయానికి వెయ్యి ఓట్లు కూడా పోల్‌ కాకపోవడం, ఉద్యోగులు భారీగా క్యూలో ఉండడంతో క్యూలో నిల్చోలేక పలువురు ఉద్యోగులు ఓటు వేయకనే వెనుదిరిగి వెళ్లారు.ఈ క్రమంలో రాత్రి 7 గంటలకు చీకటి అలుముకోవడంతో పోలింగ్‌ కేంద్రంలో తప్ప బయట లైట్లు ఏర్పాటు చేయకపోవడంతో ఉద్యోగులు చీకట్లో వేచి ఉండాల్సి వచ్చింది. ఓ పక్క ఉక్కపోత, మరో పక్క చిమ్మ చీకట్లతో ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు.ఎట్టకేలకు రాత్రి 9 గంటల సమయంలో ఓట్ల ప్రక్రియ ముగిసింది. ఆ సమయానికి 2091మంది ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Updated Date - May 06 , 2024 | 01:42 AM