Share News

nominated నామినేటెడ్‌ పదవులు ఎవరికి?

ABN , Publish Date - Jul 27 , 2024 | 01:34 AM

నామినేటెడ్‌ పదవులకు సంబంధించిన 60:40 ఫార్ములా తిరుపతిలో కూటమి నేతలను కలవరపరుస్తోంది. ఈ ఫార్ములా వల్ల నియోజకవర్గంలో బలంగా ఉన్న టీడీపీ నాయకులు తమకు నష్టం జరుగుతుందని ఆందోళన చెందుతున్నారు. జనసేన నేతల్లో సంబరం ఉన్నా, తమలో పదవులు దక్కేది ఎవరికనే కలవరం వారిలోనూ ఉంది. బీజేపీ కూడా తమ వాటా పంచుకోవడానికి సిద్ధంగా ఉంది. పరిమిత సంఖ్యలో ఉన్న నామినేటెడ్‌ పదవుల పందేరం మొత్తంమీద తిరుపతి నియోజకవర్గంలో కత్తిమీద సాముగా మారే అవకాశం కనిపిస్తోంది.

 nominated  నామినేటెడ్‌ పదవులు ఎవరికి?

నామినేటెడ్‌ పదవులకు సంబంధించిన 60:40 ఫార్ములా తిరుపతిలో కూటమి నేతలను కలవరపరుస్తోంది. ఈ ఫార్ములా వల్ల నియోజకవర్గంలో బలంగా ఉన్న టీడీపీ నాయకులు తమకు నష్టం జరుగుతుందని ఆందోళన చెందుతున్నారు. జనసేన నేతల్లో సంబరం ఉన్నా, తమలో పదవులు దక్కేది ఎవరికనే కలవరం వారిలోనూ ఉంది. బీజేపీ కూడా తమ వాటా పంచుకోవడానికి సిద్ధంగా ఉంది. పరిమిత సంఖ్యలో ఉన్న నామినేటెడ్‌ పదవుల పందేరం మొత్తంమీద తిరుపతి నియోజకవర్గంలో కత్తిమీద సాముగా మారే అవకాశం కనిపిస్తోంది.

-తిరుపతి, ఆంధ్రజ్యోతి

టీడీపీ నేతల్లో ఆందోళన

తిరుపతి నియోజకవర్గంలో జనసేన, బీజేపీతో పోలిస్తే టీడీపీకి బలమైన పార్టీ కేడర్‌తో పాటూ చెప్పుకోదగిన నాయకత్వం వుంది. దీంతో నామినేటెడ్‌ పదవులు ఆశిస్తున్న వారూ ఆ పార్టీలో ఎక్కువే. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, జిల్లా పార్టీ అధ్యక్షుడు నరసింహ యాదవ్‌ మొదలుకుని రాష్ట్ర మీడియా కో ఆర్డినేటర్‌ శ్రీధర్‌ వర్మ, రాష్ట్ర అధికార ప్రతినిధి కోడూరు బాలసుబ్రమణ్యం, ముఖ్య నాయకులు మబ్బు దేవనారాయణరెడ్డి, ఊకా విజయ్‌కుమార్‌, ఆర్సీ మునికృష్ణ, జేబీ శ్రీనివాస్‌, పులిగోరు మురళీకృష్ణారెడ్డి, పుష్పావతి వంటి వారున్నారు. తిరుపతి సీటు టీడీపీదని, తమ త్యాగం వల్లే మిత్రపక్షమైన జనసేనకు కేటాయించారన్న బలమైన అభిప్రాయం వీరిలో వ్యక్తమవుతోంది. ఇందుకు ప్రతిగా ప్రాముఖ్యత కలిగిన నామినేటెడ్‌ పదవులు ఇవ్వాలని వారు ఆశపడుతున్నారు. అయితే కూటమి పార్టీల ఫార్ములా ప్రకారం ఇక్కడ 60 శాతం పదవులు జనసేనకూ, మిగిలిన 40 శాతం పదవులు టీడీపీ, బీజేపీలకు కేటాయించేట్లయితే తమ పరిస్థితి ఏమిటా అని టీడీపీ ఆశావహులు డీలా పడిపోతున్నారు.

తిరుపతిలో ఉన్న పదవులు ఇవే!

తిరుపతి నియోజకవర్గంలో వున్న నామినేటెడ్‌ పదవులు చాలా పరిమితం. తుడా ఛైర్మన్‌, స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌, టీటీడీ బోర్డు మెంబరు పదవులు మాత్రమే వున్నాయి. టీటీడీ బోర్డులో తుడ చైర్మన్‌ ఎక్స్‌అఫిషియో మెంబరుగా ఉంటారు కాబట్టి మహా అయితే మరొకరికి మాత్రమే అవకాశం ఉంటుంది. ఇతర నియోజకవర్గాల తరహాలో ఇక్కడ మార్కెట్‌ కమిటీలు లేవు. తాతయ్యగుంట గంగమ్మ ఆలయం మినహా ప్రాధాన్యత కలిగిన దేవదాయ శాఖ ఆలయాలూ లేవు. గంగమ్మ గుడి ట్రస్టు బోర్డు పదవి ద్వితీయ శ్రేణి నేతలకు కేటాయించే పదవి. ఈ నాలుగు పదవులనూ పరిగణనలోకి తీసుకున్నా 60 శాతం అంటే రెండు లేదా మూడు పదవులు జనసేన పార్టీకే దక్కుతాయి. ఇక ఒకటి లేదా రెండు పదవుల్ని బీజేపీతో కలసి టీడీపీ పంచుకోవాల్సి వుంటుంది. టీడీపీకి దక్కితే ఒక పదవి లేదంటే అది కూడా లేదు. తిరుపతి టీడీపీ వర్గీయులను ఈ చేదు వాస్తవం ఇబ్బంది పెడుతోంది.

స్టేట్‌ కోటాపై ఆశలు

అయితే తిరుపతి టీడీపీలో పలువురు ముఖ్య నాయుల వాదన భిన్నంగా ఉంది. సుగుణమ్మ, నరసింహ యాదవ్‌, కోడూరు బాలసుబ్రమణ్యం, శ్రీధర్‌ వర్మ వంటి వారు తమకు పార్టీ స్టేట్‌ కోటాలో నామినేటెడ్‌ పదవులు కేటాయిస్తుందని ఆశిస్తున్నారు. సుగుణమ్మ, నరసింహ యాదవ్‌లకు తిరుపతిలో పదవులు కేటాయించలేని పక్షంలో ఎమ్మెల్సీ లేదా రాష్ట్రస్థాయి కార్పొరేషన్‌ పదవులు ఇచ్చే అవకాశముంది.నారా లోకేశ్‌ సిఫారసు దక్కుతుందనే ఆశతో కోడూరు బాలసుబ్రమణ్యం ఉండగా, ఎన్టీయార్‌ కుటుంబసభ్యులను నమ్ముకుని శ్రీధర్‌ వర్మ వున్నారు. సున్నితమైన ఈ వ్యవహారాన్ని అధిష్ఠానం ఎలా అధిగమిస్తుందో వేచి చూడాల్సి వుంది.

జనసేనలో ఛాన్సు కొట్టేదెవరు?

జిల్లాలో జనసేన ఉనికి ప్రఽధానంగా తిరుపతిలోనే కనిపిస్తుంది. జిల్లా పార్టీ అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్‌, నియోజకవర్గ ఇంఛార్జి కిరణ్‌ రాయల్‌, నగర అధ్యక్షుడు రాజారెడ్డి.. ఈ ముగ్గురే పార్టీలో చెప్పుకోదగిన నాయకులు. వీరిలో కిరణ్‌ రాయల్‌ తరచూ కార్యక్రమాలు, ప్రెస్‌ మీట్లు, మీడియా డిబేట్లలో పాల్గొంటూ పార్టీ ఉనికిని చాటుతున్నారు. ఆ క్రమంలో తరచూ తమ అధినేత పవన్‌ కళ్యాణ్‌పై నోరు పారేసుకునే మాజీ మంత్రి రోజాతో గత వైసీపీ ప్రభుత్వంలో పోరాడి క్రిమినల్‌ కేసులు, పోలీసు వేధింపులు కూడా ఎదుర్కొన్నారు. ఆ కారణంగా తనకు ప్రాముఖ్యత కలిగిన నామినేటెడ్‌ పదవి కేటాయిస్తారని ఆయన అధిష్ఠానంపై నమ్మకం పెట్టుకున్నారు. అయితే తిరుపతి ఎమ్మెల్యే సిఫారసు ప్రామాణికమైతే మాత్రం ఈయనకు పదవి అనుమానమే అంటున్నారు. మొత్తం మీద వీరిలో కనీసం ఇద్దరికి పదవులు దక్కే అవకాశం ఉంది.

బీజేపీకి ఒక పదవి గ్యారంటీ

తిరుపతిలో వున్న బీజేపీ నేతల్లో భానుప్రకా్‌షరెడ్డి, సామంచి శ్రీనివాస్‌ చురుగ్గా వుంటూ కార్యకలాపాలు సాగిస్తున్నారు. గత ప్రభుత్వ తప్పిదాలపై వీరు తరచూ గళం విప్పి పార్టీ ఉనికి చాటారు. ఎన్నికల సమయంలో నవీన్‌కుమార్‌రెడ్డి కూడా బీజేపీలో చేరారు. భానుప్రకా్‌షరెడ్డి, నవీన్‌కుమార్‌రెడ్డి ప్రజా ప్రయోజనాల కోసం అనేక సందర్భాల్లో న్యాయపోరాటాలు కూడా చేశారు.ఈ ముగ్గురూ నామినేటెడ్‌ పదవులు ఆశిస్తున్నారు. 60-40 నిష్పత్తి ఫార్ములాతో బీజేపీకి ఒక పదవి దక్కవచ్చు. అయితే అది ఏ పదవి, దాన్ని ఎవరు దక్కించుకుంటారనేది వేచి చూడాల్సి వుంది.

Updated Date - Jul 27 , 2024 | 07:59 AM