Share News

నేడు కూడా ‘పోస్టల్‌ బ్యాలెట్‌’ ఓటేయచ్చు

ABN , Publish Date - May 06 , 2024 | 01:44 AM

పోస్టల్‌ బ్యాలెట్‌ను వినియోగించుకోని ఉద్యోగులు సోమవారం కూడా ఓటు వేయవచ్చని కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు.

నేడు కూడా ‘పోస్టల్‌ బ్యాలెట్‌’ ఓటేయచ్చు
ఎస్వీయూ క్యాంపస్‌ స్కూల్లో పోలింగును పరిశీలిస్తున్న కలెక్టర్‌, కమిషనర్‌

- 13న పోలింగ్‌ బూతుల్లోకి సెల్‌ఫోన్‌కి అనుమతిలేదు

- కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌

తిరుపతి కలెక్టరేట్‌/రూరల్‌, మే 5: పోస్టల్‌ బ్యాలెట్‌ను వినియోగించుకోని ఉద్యోగులు సోమవారం కూడా ఓటు వేయవచ్చని కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. ఎస్వీ ఆర్ట్స్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ స్ర్టాంగ్‌రూమ్‌లో అసెంబ్లీ, పార్లమెంటరీ నియోజకవర్గాల ఈవీఎంల కమిషనింగ్‌ని ఆదివారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. జిల్లాలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా సాగిందన్నారు. ఈనెల 13న జరిగే ఎన్నికల్లో ఓటర్లతోపాటు పోలింగ్‌ ఏజెంట్లు, ప్రభుత్వం తరఫున ఉన్న వీడియోగ్రాఫర్లు కూడా పోలింగ్‌ బూత్‌లలోకి సెల్‌ఫోన్లు తీసుకురాకూడదని స్పష్టం చేశారు. అయితే సెక్టార్‌ ఆఫీసర్‌, మైక్రో అబ్జర్వర్‌కు మాత్రమే ఫోన్‌ అనుమతి ఉందని.. వారు కూడా స్విచ్‌ ఆఫ్‌ చేసి తమవద్ద ఉంచుకోవాలని తెలిపారు. ఈవీఎంలు పనిచేయకుంటే ఆ విషయం తెలియజేసేందుకు మాత్రమే ఫోన్‌ని ఆన్‌చేసి విషయం చెప్పాక ఆఫ్‌ చేసేయాలని ఆదేశించామని చెప్పారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో మొబైల్‌ ఫోన్‌ డిపాజిట్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. మీడియా సిబ్బందికి పోలింగ్‌ బూత్‌ వద్ద ఓటర్లు నిలబడి ఉన్న క్యూలైన్ల వరకు మాత్రమే అనుమతి ఉందని, లోపలికి అనుమతి లేదని స్పష్టం చేశారు. మీడియాను అనుమతించే విషయమై పోలీసు సిబ్బందికి అవగాహన కల్పిస్తామన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థుల సమక్షంలో ఈవీఎం కమిషనింగ్‌ కార్యక్రమం పూర్తి చేస్తున్నామని, 12వతేదీన పోలింగ్‌ స్టేషన్లకు ఎన్నికల సామగ్రి పంపిణీ ఉంటుందని వివరించారు. తిరుపతి అసెంబ్లీ ఆర్వో అదితిసింగ్‌, పార్లమెంట్‌ నియోజకవర్గ సాధారణ పరిశీలకుడు ఉజ్వల్‌కుమార్‌ ఘోష్‌ పాల్గొన్నారు.

దరఖాస్తు చేసుకోనివారికి మరో అవకాశం

ఫారం-12తో సకాలంలో దరఖాస్తు చేసుకోని వారికి ఈ నెల 7, 8 తేదీల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌కి ఎన్నికలసంఘం మరో అవకాశం ఇచ్చినట్లు కలెక్టర్‌ తెలిపారు. అలాగే ఇప్పటికే దరఖాస్తు చేసుకుని, కొన్ని కారణాలతో తిరస్కరించబడిన వారు కూడా ఈ రెండ్రోజుల్లో సంబంధిత ధ్రువపత్రాలతో ఓటింగ్‌ సౌకర్యం వినియోగించుకోవాలని సూచించారు.

ఈవీఎంల కమిషనింగ్‌ పరిశీలన

ఎస్వీ వెటర్నరీ వర్సిటీ, ఎస్వీ ఆర్ట్స్‌ కళాశాలలో ఏర్పాటు చేసి, చంద్రగిరి, తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ ఈవీఎంల కమిషనింగ్‌ని కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆదివారం పరిశీలించారు. అలాగే పార్లమెంటుకు సంబంధించి ఈవీఎంల రెండో దఫా ర్యాండమైజేషన్‌ ప్రక్రియను కలెక్టరేట్‌లో నిర్వహించారు. రాజకీయపార్టీల ప్రతినిధులు, అభ్యర్థులు, అధికారులు పాల్గొన్నారు.

నేడు, రేపు హోంఓటింగ్‌

ఇంట్లోనే ఓటు వేయడానికి దరఖాస్తు చేసుకున్న 85ఏళ్లు దాటిన వృద్ధులకు, పోలింగ్‌ కేంద్రాలకు రాలేని దివ్యాంగులకు సోమ, మంగళవారాల్లో హోం ఓటింగ్‌ నిర్వహించనున్నారు. ఈ మేరకు కలెక్టర్‌ తెలిపారు.

Updated Date - May 06 , 2024 | 01:44 AM