Share News

YCP leaders ఓడిపోగానే నియోజకవర్గాలను వీడిన వైసీపీ నేతలు

ABN , Publish Date - Jul 27 , 2024 | 01:39 AM

అధికారం అండగా చెలరేగిపోయారు. తమ ఎమ్మెల్యేలు, నేతలను చూసి శ్రేణులూ రెచ్చిపోయాయి. మళ్లీ మనమే అధికారంలోకి వస్తున్నామంటూ కార్యకర్తలకు భ్రమలు కల్పించారు. నాయకులూ అదే భావనలో ఉన్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో అరాచకం, విధ్వంసం సృష్టించారు. వీరి దౌర్జన్యాలు, కక్ష సాధింపు చర్యలతో విసిగిపోయిన జనం.. జిల్లాలో పుంగనూరు మినహా అన్నిచోట్లా ఘోరంగా ఓడించారు. అప్పటి వరకూ మేమున్నామంటూ శ్రేణులకు చెబుతూ వచ్చిన

 YCP leaders ఓడిపోగానే నియోజకవర్గాలను  వీడిన వైసీపీ నేతలు

అధికారం అండగా చెలరేగిపోయారు. తమ ఎమ్మెల్యేలు, నేతలను చూసి శ్రేణులూ రెచ్చిపోయాయి. మళ్లీ మనమే అధికారంలోకి వస్తున్నామంటూ కార్యకర్తలకు భ్రమలు కల్పించారు. నాయకులూ అదే భావనలో ఉన్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో అరాచకం, విధ్వంసం సృష్టించారు. వీరి దౌర్జన్యాలు, కక్ష సాధింపు చర్యలతో విసిగిపోయిన జనం.. జిల్లాలో పుంగనూరు మినహా అన్నిచోట్లా ఘోరంగా ఓడించారు. అప్పటి వరకూ మేమున్నామంటూ శ్రేణులకు చెబుతూ వచ్చిన వైసీపీ అభ్యర్థులు.. ఘోర పరాజయం తర్వాత వెనుతిరిగారు. ఐదేళ్లు అధికారాన్ని అనుభవించి ఒక్క ఓటమితో కార్యకర్తల్ని గాలికొదిలేశారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు, కార్యకర్తలు తీవ్ర అయోమయం, గందరగోళానికి గురవుతున్నారు. తమ మాటలు నమ్మి రాజీనామాలు చేసిన వలంటీర్లను వీరు పట్టించుకోవడంలేదు. దీంతో ఆయా అభ్యర్థుల వ్యవహారశైలిపై వాళ్లూ అసంతృప్తి, అసహనంతో ఉన్నారు.

- చిత్తూరు, ఆంధ్రజ్యోతి

చెన్నైకి మకాం మార్చిన రోజా

మాజీ మంత్రి రోజా ఘోర పరాజయం తర్వాత చెన్నైకి మకాం మార్చారు. వైఎ్‌సఆర్‌ జయంతి కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించారు. నగరి నియోజకవర్గంలోని నాయకులకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండడం లేదు. దీంతో వారంతా ఆందోళనలో ఉన్నారు. టీడీపీలోకి వెళ్దామంటే అక్కడ గేట్లు మూసేశారు. రాజకీయ భవిష్యత్తు కోసం కొంతమంది కాపు సామాజిక వర్గానికి చెందిన వైసీపీ నాయకులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు జనసేనలో చేరేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.

అడ్రస్‌ లేని నారాయణస్వామి

డిప్యూటీ సీఎంగా పనిచేసిన నారాయణస్వామి వైసీపీ ఓడినప్పటి నుంచి అడ్రస్‌ లేకుండా పోయారు. అధికారంలో ఉన్నప్పుడు నిత్యం ప్రతిపక్షాలను, మీడియాధిపతులను దూషిస్తూ కాలం గడిపిన ఆయన, ఇప్పుడు ఎక్కడా నోరు తెరవడం లేదు. అప్పట్లో నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ వైఎస్సార్‌ జయంతి కార్యక్రమాల్లో పాల్గొనే ఆయన.. ఈ మధ్య ఎస్‌ఆర్‌పురం మండలంలో మాత్రమే పాల్గొన్నారు. పుత్తూరులో కొన్ని రోజులు, చెన్నైలో మరికొన్ని రోజులు ఉంటున్నారు.

ఇక ఎన్నికల్లో జీడీనెల్లూరు అభ్యర్థిగా పోటీ చేసిన ఓడిన ఆయన కుమార్తె కృపాలక్ష్మి చెన్నైకే పరిమితమయ్యారు. చివరికి వైఎస్సార్‌ జయంతి కార్యక్రమాల్లోనూ ఆమె పాల్గొనలేదు. తండ్రీ కూతుళ్లు నియోజకవర్గంలో జరిగే ముఖ్యమైన శుభకార్యాలకు మాత్రమే ఒకట్రెండు సార్లు హాజరయ్యారు. ఇక్కడా ఎమ్మెల్యే థామస్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తే వైసీపీ ఖాళీ అయిపోయే అవకాశముంది.

హైదరాబాద్‌లోనే ఎమ్మెల్సీ భరత్‌

కుప్పంలో ఎమ్మెల్సీ భరత్‌ ప్రభుత్వం మారిన తర్వాత వారం రోజులు మాత్రమే స్థానికంగా ఉన్నారు. సాధారణంగా ఆయన కుటుంబం హైదరాబాద్‌లో ఉండడంతో.. ఆయనా అక్కడే ఉంటున్నారు. చివరికి ఆయన వైఎస్సార్‌ జయంతి కార్యక్రమాల్లోనూ పాల్గొనలేదు. దీంతో వైసీపీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. వారంతా టీడీపీలోకి చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల మున్సిపల్‌ చైర్మన్‌ సుధీర్‌ అమరావతికి కూడా వెళ్లివచ్చారు. సీఎం చంద్రబాబు కూడా వైసీపీలో తటస్థంగా ఉన్న నేతలను చేర్చుకోవచ్చని చెప్పడంతో.. త్వరలో ఇక్కడ వైసీపీ ఖాళీ అవ్వనుంది.

‘రియల్‌’ వ్యాపారంలో నిమగ్నమై..

పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ బెంగళూరులో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం చేసుకుంటున్నారు. వైఎస్సార్‌ జయంతి కార్యక్రమంలో మాత్రమే పాల్గొన్నారు. పలమనేరులోని గుడియాత్తం రోడ్డులో ఉండే రెండు వైసీపీ కార్యాలయాల్లో.. ఒకటి మూసేశారు. మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా ఉన్న హేమంత్‌కుమార్‌రెడ్డి ఇటీవల తన పదవికి రాజీనామా చేసి, ఇక రాజకీయాలు వద్దని అనుచరులతో చెప్పినట్లు తెలుస్తోంది. ఇలా బడా నాయకులే స్వస్తి పలుకుతుంటే కిందిస్థాయి వారంతా మరింత అభద్రతకు లోనవుతున్నారు. కొంతమంది టీడీపీలోకి రాలేక, వైసీపీలో కొనసాగలేక జనసేన వైపు మొగ్గు చూపుతున్నారు. పలమనేరు కౌన్సిలర్లు టీడీపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నా ఎమ్మెల్యే అమర్‌ ఆహ్వానించడం లేదు.

ప్రాక్టీ్‌సకే పరిమితమైన డాక్టర్‌ సునీల్‌

పూతలపట్టులో వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన డాక్టర్‌ సునీల్‌కుమార్‌ పలమనేరులోని తన ఆస్పత్రిలో ప్రాక్టీ్‌సకే పరిమితమయ్యారు. వైద్య సేవలు చేసుకుంటున్నారు. తమకు దిక్కెవరంటూ వైసీపీ నాయకులు, కార్యకర్తలు వాపోతున్నారు. టీడీపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నా.. టీడీపీ కోసం శ్రమించిన వారికే మొదటి ప్రాధాన్యమిచ్చే క్రమంలో ఎమ్మెల్యే మురళీ నుంచి ఇంకా అంగీకారం రానట్టు తెలుస్తోంది.

చిత్తూరులో సగానికిపైగా వైసీపీ ఖాళీ

జిల్లా కేంద్రమైన చిత్తూరులో ఇప్పటికే సగానికిపైగా వైసీపీ ఖాళీ అయిపోయింది. మిగిలిన కొందరు కూడా పార్టీలో చురుగ్గా లేరు. ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్‌ తలుపులు తెరిస్తే నియోజకవర్గంలో మిగిలిన వైసీపీ కూడా ఖాళీ అయిపోయే అవకాశం ఉంది. ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన విజయానందరెడ్డి గతంలో వైఎస్సార్‌ జయంతిని వేడుకలా నిర్వహించేవారు. ఈసారి గుడిపాలలో మాత్రం పాల్గొన్నారు. అక్కడి కార్యక్రమమూ నామమాత్రంగానే జరిగింది. ఆయన చిత్తూరులోనే ఉన్నారని చెప్తున్నప్పటికీ.. ఎక్కడా కనిపించడం లేదు. జిల్లాలో మిగిలినవారి కంటే ఓటమి పట్ల ఎక్కువ డిప్రెషన్‌లోకి వెళ్లిన వ్యక్తి విజయానందరెడ్డి మాత్రమేనని వైసీపీలో ప్రచారం ప్రచారం జరుగుతోంది.

పుంగనూరులో భిన్న పరిస్థితులు

పుంగనూరులో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఐదేళ్లలో పెద్దిరెడ్డి కుటుంబం చేసిన అరాచకాలతో నలిగిపోయిన నియోజకవర్గ ప్రజలు, రైతులు, టీడీపీ శ్రేణులు వారిని నియోజకవర్గంలోకి రాకుండా అడ్డుకుంటున్నారు. ఓ సారి పెద్దిరెడ్డి, రెండుసార్లు మిథున్‌రెడ్డి వెనక్కి వెళ్లిపోయారు. ఈమధ్య మిథున్‌రెడ్డి మాజీ ఎంపీ రెడ్డెప్ప ఇంటికి వస్తే ఉద్రిక్త పరిస్థితులు, వివాదాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఇప్పటికే వైసీపీ కీలక నాయకులు, పెద్దిరెడ్డి ప్రధాన అనుచరులు వైసీపీని వీడుతున్నారు. చల్లా బాబు అనుమతిస్తే నియోజకవర్గంలో వైసీపీ ఖాళీ అయిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. పులిచెర్ల జడ్పీటీసీ, రాష్ట్ర పాలేకరి కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ మురళీధర్‌తో పాటు పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు పార్టీకి రాజీనామా చేశారు. పుంగనూరులో మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషాతో పాటు పది మంది కౌన్సిలర్లు వైసీపీకి రాజీనామా చేసి.. చల్లా బాబు సమక్షంలో త్వరలో టీడీపీలో చేరేందుకు సిద్ధమైనట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. రొంపిచెర్ల మండలంలోనూ కొందరు స్థానిక ప్రజాప్రతినిధులు రాజీనామా చేశారు. చాలామంది టీడీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Updated Date - Jul 27 , 2024 | 07:51 AM