Share News

మా కుటుంబానికి ప్రాణహాని ఉంది: దస్తగిరి భార్య

ABN , Publish Date - Jan 25 , 2024 | 08:43 AM

నేడు కడప సెంట్రల్ జైలు నుంచి వైఎస్ వివేకా హత్య కేసు నిందితుడు దస్తగిరి బెయిల్‌పై విడుదల కానున్నాడు. నిన్న హైకోర్టు దస్తగిరికి బెయిల్ మంజూరు చేసింది. వివేకా హత్యకేసులో ఏ4 నిందితుడిగా ఉన్న దస్తగిరి అప్రూవర్‌గా మారాడు.

మా కుటుంబానికి ప్రాణహాని ఉంది: దస్తగిరి భార్య

కడప: నేడు కడప సెంట్రల్ జైలు నుంచి వైఎస్ వివేకా హత్య కేసు నిందితుడు దస్తగిరి బెయిల్‌పై విడుదల కానున్నాడు. నిన్న హైకోర్టు దస్తగిరికి బెయిల్ మంజూరు చేసింది. వివేకా హత్యకేసులో ఏ4 నిందితుడిగా ఉన్న దస్తగిరి అప్రూవర్‌గా మారాడు. దస్తగిరి నేడు విడుదల కానున్న నేపథ్యంలో ఆయన భార్య షబానా ఏబీఎన్‌తో మాట్లాడింది. తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని.. ఏపీ పోలీసులపై తమకు నమ్మకం లేదని పేర్కొంది. తమకు తెలంగాణ పోలీసులతో భద్రత కల్పించాలని కోరింది. పులివెందుల్లో వైసీపీ నాయకులు, పోలీసులు తమను శత్రువులుగా చూస్తున్నారని షబానా తెలిపింది.

ఏపీ హైకోర్టులో జగన్ ప్రభుత్వానికి నిన్న గట్టి షాక్ తగిలింది. వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉండి ఆపై అప్రూవర్‌గా మారిన షేక్ దస్తగిరికి బెయిల్ మంజూరు అయ్యింది. వివేకా హత్య కేసులో గత 85 రోజుల నుంచి కడప జైలులో షేక్ దస్తగిరి రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ క్రమంలోనే బెయిల్ మంజూరు చేయాలంటూ దస్తగిరి తరపున హైకోర్టులో న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ పిటిషన్ దాఖలు చేశారు. అది బుధవారం హైకోర్టులో విచారణకు వచ్చింది. దస్తగిరి తరపున న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. కిడ్నాప్ కేసులో దస్తగిరిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారని... ఎన్నికల దృష్ట్యా దస్తగిరిపై ఏపీ పోలీసులు పలు అక్రమ కేసులు నమోదు చేశారని కోర్టు ముందు వాదించారు.

ఎన్నికల వేళ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ప్రభావం ఉండకూడదనే భావనతో దస్తగిరిని జైల్లోనే నిర్బంధించి సీఎం జగన్ అక్రమ కేసులు బనాయిస్తున్నారని దస్తగిరి భార్య ఆరోపించారు. జగన్, వైఎస్ అవినాష్ రెడ్డి వలన తన ప్రాణాలకు ముప్పు ఉందని ఇప్పటికే పలు సందర్భాల్లో దస్తగిరి వాపోయిన విషయాన్ని కూడా న్యాయవాది కోర్టు ముందు ఉంచారు. వివేకానంద హత్య కేసులో దస్తగిరి తరపున కూడా న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపిస్తున్నారు. అయితే ఇదే సమయంలో దస్తగిరిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని అందువలన బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టులో న్యాయవాది వాదించారు. దస్తగిరి తరపున, అలాగే ప్రభుత్వం తరపున వాదనలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు దస్తగిరికి బెయిల్ మంజూరు చేసింది.

Updated Date - Jan 25 , 2024 | 08:43 AM