బడ్జెట్ పుస్తకంలో ‘ఎడెక్స్’ భజన
ABN , Publish Date - Nov 29 , 2024 | 04:23 AM
రాష్ట్ర విద్యార్థులకు ప్రపంచ స్థాయి ఆన్‌లైన్ కోర్సులు ఉచితంగా అందిస్తామంటూ గత ప్రభుత్వంలో ఓ కంపెనీకి దాదాపు రూ.50 కోట్లు ధారపోశారు. దీనిపై అప్పటి సీఎం జగన్ నోటి నుంచి మాట రావడం ఆలస్యం ఉన్నత విద్యాశాఖ అధికారులు ఆగమేఘాలపై కదిలారు. టెండర్లు, చర్చలు ఏమీ లేకుండా నేరుగా ఎడెక్స్ అనే కంపెనీతో అడ్డగోలు ఒప్పం
50 కోట్ల అడ్డగోలు దోపిడీకి అధికారుల కితాబు
ఉన్నత విద్యను బలోపేతం చేసిందని ప్రశంస
విద్యార్థులకు 3.2లక్షల సర్టిఫికేషన్లంటూ గొప్పలు
జగన్ హయాంలో టెండర్లు లేకుండానే ఒప్పందం
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
రాష్ట్ర విద్యార్థులకు ప్రపంచ స్థాయి ఆన్‌లైన్ కోర్సులు ఉచితంగా అందిస్తామంటూ గత ప్రభుత్వంలో ఓ కంపెనీకి దాదాపు రూ.50 కోట్లు ధారపోశారు. దీనిపై అప్పటి సీఎం జగన్ నోటి నుంచి మాట రావడం ఆలస్యం ఉన్నత విద్యాశాఖ అధికారులు ఆగమేఘాలపై కదిలారు. టెండర్లు, చర్చలు ఏమీ లేకుండా నేరుగా ఎడెక్స్ అనే కంపెనీతో అడ్డగోలు ఒప్పందం చేసుకున్నారు. తమకు రూ.49.9 కోట్లు ముందస్తుగా కట్టాలని ఆ సంస్థ షరతు విధించడంతో మరోమాట లేకుండా ఆ మొత్తం సమర్పించుకున్నారు. దీనిని అప్పట్లో ప్రతిపక్ష టీడీపీ తూర్పారబట్టింది. ఈ ఒప్పందంలో నిబంధనలు ఎందుకు పాటించలేదని నిలదీసింది. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. అప్పట్లో దోపిడీ అన్న పథకం నేడు గొప్ప కార్యక్రమంగా మారింది. 2023-24లో ఉన్నత విద్యాశాఖను బలోపేతం చేసిన కార్యక్రమాల జాబితాలో ఎడెక్స్‌తో చేసుకున్న ఒప్పందం కూడా చేరిపోయింది. ఈ విషయాన్ని ఏకంగా బడ్జెట్ పుస్తకంలోనే ఉన్నత విద్యాశాఖ పేర్కొనడం విశేషం. అయితే మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రికి తెలిసే దీన్ని చేర్చారా... లేక అధికారుల సొంత నిర్ణయమా అనేది తేలాల్సి ఉంది.
అన్నీ అనుమానాలే
జగన్ హయాంలో ఉన్నత విద్యామండలిలోని కొందరు అధికారులు ప్రభుత్వ పెద్దలతో కలిసి తీసుకున్న అడ్డగోలు నిర్ణయాల్లో విదేశీ కోర్సులు కూడా ఒకటి. ఇక్కడి విద్యార్థులకు అవెంతవరకు ఉపయోగం? అమలు సాధ్యాసాధ్యాలు చూడకుండా జగన్ చెప్పారని ఒప్పందం చేసుకున్నారు. విదేశీ వర్సిటీలు, ఇక్కడి విద్యార్థులకు మధ్య వారధిగా ఉండేందుకు ఎడెక్స్ కంపెనీకి నిధులు చెల్లించారు. ఏటా 4 లక్షల లైసెన్స్‌లను ఎడెక్స్ ఇచ్చింది. అయితే ఈ ఏడాది జూలై నాటికి అందులో 69వేల లైసెన్స్‌లు మిగిలిపోయాయి. దీంతో అధికారులు విద్యార్థులపై ఒత్తిడి చేసి మరీ అంటగట్టారు. ఈ ఏడాది మార్చి 12న ఒప్పందం చేసుకోగా ఈలోపే లక్షల మంది రాష్ట్ర విద్యార్థులు విదేశీ వర్సిటీల్లోని గొప్ప కోర్సులు నేర్చుకున్నారని ప్రశంసించింది.
కంప్యూటర్స్‌లో బీకాం!
ఎడెక్స్‌తో ఒప్పందానికి ముందు ‘ఇండియా టుడే’ నిర్వహించిన ఓ సదస్సులో మాజీ సీఎం జగన్ పాల్గొన్నారు. అందులో ప్రపంచ ప్రముఖ యూనివర్సిటీల్లో ఉన్న కోర్సులను ఇక్కడి విద్యార్థులకు బోధించనున్నట్లు తెలిపారు. వాటిలో ఒక కంప్యూటర్ కోర్సు గురించి చెబుతారా? అని ‘ఇండియా టుడే’ ప్రతినిధి ప్రశ్నించారు. కాసేపు ఆలోచించిన జగన్ ‘ఉదాహరణకు చెప్పాలంటే బీకాం కోర్సు’ అని సమాధానమిచ్చారు. కంప్యూటర్స్‌లో బీకాం కోర్సు ఉంటుందా అని తిరిగి ప్రశ్నించడంతో ఆయన మౌనం దాల్చారు. అప్పట్లో ఇది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. విదేశీ కోర్సులు తెస్తామన్న సీఎంకు కనీసం ఏమేం కోర్సులు వస్తున్నాయో కూడా తెలియదని, కేవలం కమీషన్ల కోసమే రూ.50కోట్ల ఒప్పందం చేసుకున్నారని అప్పుడే స్పష్టమైపోయింది.
గర్వపడుతున్నామన్న బొత్స
విదేశీ కోర్సులను ఇక్కడి విద్యార్థులకు అందించే ఆలోచన చేసిన సమయంలో ఉన్నత విద్యాశాఖ మరే ఇతర కంపెనీల గురించి పట్టించుకోలేదు. ముందుగానే ఎడెక్స్‌కు కాంట్రాక్టు కట్టబెట్టే ఉద్దేశంతో టెండర్ల జోలికి వెళ్లలేదు. దీనిపై అప్పటి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఓ సందర్భంలో మాట్లాడుతూ... ‘ప్రతిదానికీ టెండర్లు పిలవడం సాధ్యం కాదు. ప్రపంచంలో ఇలాంటి కంపెనీ మరొకటి లేదు. అందుకే టెండర్లు లేకుండా కాంట్రాక్టు ఇచ్చినందుకు గర్వపడుతున్నాం’ అని వ్యాఖ్యానించారు. అదే స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్టును మాత్రం ఆయన సమర్థించారు.
పాతుకుపోయిన అధికారులు
ఉన్నత విద్యామండలిలో ఇంకా పాత అధికారులే పాతుకుపోయారు. ప్రభుత్వం మారిన తర్వాత ఒక్కరు తప్ప మిగిలినవారంతా తమ స్థానాల్లోనే కొనసాగుతున్నారు. ప్రభుత్వం మారిన తర్వాత ప్రభుత్వం ఎడెక్స్ ఒప్పందంపై ఆరా తీసింది. దీనిపై కొందరు అధికారులను ప్రశ్నించింది. కానీ అధికారులు దానిని దాచిపెట్టే ప్రయత్నం చేశారు. ఇప్పుడు వారే అదొక గొప్ప కార్యక్రమం అన్నట్టుగా బడ్జెట్ పుస్తకంలో రాశారు.