మాజీ ఎంపీ కేఎస్సార్ తనయుడే కాగ్ చీఫ్
ABN , Publish Date - Nov 20 , 2024 | 01:48 AM
కంప్ర్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా(కాగ్) చీఫ్‌గా నియమితులైన కె.సంజయ్‌మూర్తికి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాతో సంబంధాలు ఉన్నాయి. గతంలో ఆయన తండ్రి విశ్రాంత ఐఏఎస్ అధికారి కేఎస్సార్ మూర్తి కాంగ్రెస్ పార్టీ నుంచి అమలాపురం లోక్‌సభ రిజర్వుడ్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించారు.
కాగ్ చీఫ్‌గా కె.సంజయ్‌మూర్తి నియామకం
1996లో ఎంపీగా పనిచేసిన కేఎస్సార్ మూర్తి
ఈ ప్రాంత ప్రజలతో సంజయ్‌మూర్తికి సంబంధాలు
అమలాపురం, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): కంప్ర్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా(కాగ్) చీఫ్‌గా నియమితులైన కె.సంజయ్‌మూర్తికి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాతో సంబంధాలు ఉన్నాయి. గతంలో ఆయన తండ్రి విశ్రాంత ఐఏఎస్ అధికారి కేఎస్సార్ మూర్తి కాంగ్రెస్ పార్టీ నుంచి అమలాపురం లోక్‌సభ రిజర్వుడ్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించారు. ఆ సమయంలో ఆయన తనయుడైన కె.సంజయ్‌మూర్తి పలు సందర్భాల్లో కోనసీమ ప్రాంతంలో పర్యటించారు. ఈ ప్రాంత ముఖ్యులతో పరిచయాలు కలిగి ఉన్నారు. 1996లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కేఎస్సార్ మూర్తి కాంగ్రెస్ పార్టీ నుంచి అమలాపురం ఎంపీ స్థానానికి ఎన్నికయ్యారు. అంతకు పూర్వం నుంచే సీనియర్ ఐఏఎస్ హోదాలో ఈ ప్రాంత ప్రజలతో సంబంధాలు, బంధుత్వాలు కూడా మూర్తికి కలిగి ఉన్నాయి. ఈ జిల్లాలోని ముమ్మిడివరంలోని బాలయోగీశ్వరుల ఆలయం నిర్వహణలో కేఎస్సార్ మూర్తి కీలక పాత్ర వహించారు. అప్పటి నుంచి ఈ ప్రాంతంలో ఆయన ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. తండ్రి అడుగు జాడల్లోనే నడిచే సీనియర్ ఐఏఎస్ అధికారిగా కె.సంజయ్‌మూర్తికి మంచి పేరు ఉంది. 1989 బ్యాచ్‌కు చెందిన ఆయన ప్రస్తుతం హిమాచల్‌ప్రదేశ్ కేడర్ నుంచి కాగ్‌కు ఎంపికయ్యారు. రాష్ట్రపతి ద్రౌపదీముర్ము కె.సంజయ్‌మూర్తిని కాగ్ చీఫ్‌గా నియమిస్తూ ఉత్తర్వులిచ్చారు. ప్రస్తుతం సంజయ్‌మూర్తి కేంద్ర విద్యాశాఖలో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఈనెల 21న సంజయ్ పదవీ బాధ్యతలను చేపట్టనున్నారు. కాకినాడ జిల్లా రేచర్లపేటకు చెందిన కేఎస్సార్ మూర్తి దంపతులకు సంజయ్‌మూర్తి జన్మించారు. ఎంపీగా పనిచేసిన ఆయన తండ్రి కేఎస్సార్ మూర్తికి కోనసీమలో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. కాంగ్రెస్ హయాంలో కోనసీమలో మంచినీటి పథకాల అమలుకు కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేసిన వ్యక్తుల్లో కేఎస్సార్ మూర్తి ఒకరు. ఈ ప్రాంతంలో అప్పట్లో జరిగిన కార్యక్రమాలకుతనయుడు సంజయ్‌మూర్తి కూడా అప్పుడప్పుడూ హాజరై ప్రజలతో మమేకమయ్యేవారు.
పెరిగిందిక్కడే
-కాగ్ అధిపతి సంజయ్‌మూర్తిది కాకినాడే
-రేచర్లపేటలోని తల్లిదండ్రులతో కొన్నాళ్లు నివాసం
-ఆ తర్వాత ఐఏఎస్ అయ్యాక పండగలప్పుడు రాక
(కాకినాడ,ఆంధ్రజ్యోతి)
భారత కంప్ర్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్‌గా నియమితులైన తొలి తెలుగు వ్యక్తి సంజయ్‌మూర్తిది కాకినాడ కావడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అత్యుతన్న పదవి తొలిసారిగా తెలుగు అధికారికి దక్కడం, అదీ ఆయన కాకినాడ రేచర్లపేటకు చెందిన వారు కావడంతో ఆయన గురించి తెలిసిన వారంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సంజయ్ మూర్తి తండ్రి కోండ్రు శ్రీరామచంద్రమూర్తి 1996లో అమలాపురం ఎంపీగా పనిచేశారు. అంతకుముందు ఐఏఎస్ అధికారిగా వివిధ హోదాల్లో పనిచేశారు. ఎంపీగా చేసిన కాలంలో కాకినాడలోని రేచర్లపేటలోని సొంత ఇంట్లోనే ఉండేవారు. అదే సమయంలో తల్లితో కలిసి కొంతకాలం ఇక్కడే సంజయ్‌మూర్తి ఉన్నారు. తండ్రి ఐఏఎస్ కావడంతో సంజయ్‌మూర్తి చదువంతా ఎక్కువగా హైదరాబాద్‌లోనే గడిచింది. ఆ తర్వాత సంజయ్ 1989లో ఐఏఎస్‌కు ఎంపికవడంతో హిమాచల్‌ప్రదేశ్ క్యాడర్‌లో అక్కడ చాలాకాలం పనిచేశారు. పండగ సమయాల్లో మాత్రం కాకినాడ రేచర్లపేటకు వచ్చి కొన్నిరోజులు గడిపేవారు. ఆయన చాలా సౌమ్యుడని, అలాంటి వ్యక్తికి దేశంలోనే అత్యున్నత పదవి వరించడం గొప్పవిషయమని ఆయనతో పరిచయం ఉన్న వారు ఆనందంతో చెబుతున్నారు. కాగా రేచర్లపేటలోని సొంత ఇంట్లో ప్రస్తుతం సంజయ్ కుటుంబీకులు ఎవరూ లేరు. కొన్నాళ్లు సంజయ్‌మూర్తి తల్లిదండ్రులు చనిపోవడంతో ఉంటున్న ఇంటిని అద్దెకు ఇచ్చేశారు.