Share News

జిల్లాలో 1577 పోలింగ్‌ కేంద్రాలు

ABN , Publish Date - May 09 , 2024 | 12:13 AM

జిల్లాలోని 1577 పోలింగ్‌ కేంద్రాల వద్ద నిర్వహించే భద్రతా ఏర్పాట్లు, అందుకు అనుగుణంగా అక్కడ సిబ్బంది నియామకంపై తీసుకున్న చర్యలపై జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ కె.మాధవీలత, ఎస్పీ పి.జగదీష్‌ కార్యాచరణ ప్రణాళికను వివరించారు.

జిల్లాలో 1577 పోలింగ్‌ కేంద్రాలు
సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఎన్నికల పరిశీలకులు, కలెక్టర్‌, ఎస్పీ

  • పోలింగ్‌బూత్‌ల వారీగా భద్రతకు సిబ్బంది నియామకం

  • జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత, ఎస్పీ జగదీష్‌

  • ఎన్నికల పరిశీలకులతో సమీక్షా సమావేశం

దివాన్‌చెరువు, మే 8: జిల్లాలోని 1577 పోలింగ్‌ కేంద్రాల వద్ద నిర్వహించే భద్రతా ఏర్పాట్లు, అందుకు అనుగుణంగా అక్కడ సిబ్బంది నియామకంపై తీసుకున్న చర్యలపై జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ కె.మాధవీలత, ఎస్పీ పి.జగదీష్‌ కార్యాచరణ ప్రణాళికను వివరించారు. ఆదికవి నన్నయ విశ్వవిద్యా లయం ఆవరణలో ఎన్నికల సాధారణ పరిశీలకులు పోలింగ్‌ ముందు రోజున, పోలింగ్‌ రోజున (ఈ నెల 12,13 తేదీల్లో) అనంతరం స్ట్రాంగ్‌ రూమ్‌ వద్ద భద్రతా ఏర్పాట్లపై కలెక్టర్‌ మాధవీలత, ఎస్పీ జగదీష్‌లతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. సాధారణ ఎన్నికల పరిశీలకులు కె.బాలసుబ్రహ్మ ణ్యం, కమల్‌కాంత్‌ సరోచ్‌, పోలీస్‌ పరిశీకుడు బలరాం మీనాలకు జిల్లాలోని అన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద నిర్వహించే భద్రత ఏర్పాట్లు, అక్కడ సిబ్బంది నియామకంపై తీసుకున్న చర్యలపై కలెక్టర్‌, ఎస్పీ వివరించారు. పోలింగ్‌ అనంతరం అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన బ్యాలెట్‌ యూని ట్లను నన్నయ విశ్వవిద్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ఆయా నియోజ కవర్గాల స్ట్రాంగ్‌రూమ్‌లకు తరలించేందుకు రూట్‌ మ్యాప్‌ సిద్ధం చేశామన్నారు. ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తున్నామని, అందుకు అనుగుణంగా లెక్కింపు కోసం టేబుల్స్‌ ఏర్పాటు చేశామన్నారు. పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా టేబుల్స్‌ ప్రత్యేక మార్గాలు ఉన్నాయని కలెక్టర్‌ చెప్పారు. ఎస్పీ పి.జగదీష్‌ మాట్లాడుతూ జిల్లాలోని 19 మండలాలు, మూడు పురపాలక సంఘాల పరిధిలో ఉన్న 1513 పోలింగ్‌ కేంద్రాల్లో భద్రత సిబ్బందిని, ఇతర అనుబంధశాఖల ఉద్యోగులను నియమించినట్టు తెలిపారు. పోలింగ్‌ కేంద్రాల వారీగా భద్రతా ఏర్పాట్లు విషయమై కార్యాచరణ వివరిం చారు. అనంతరం ఎన్నికల పరిశీలకులు లెక్కింపు కేంద్రాల వద్ద ఏర్పాట్లు తీరును పరిశీలించారు. ఇందుకోసం సిబ్బందిని, సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్టు కలెక్టర్‌ తెలిపారు. లెక్కింపు కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లు సేవలందిస్తారని చెప్పారు.

  • డిస్ట్రిబూషన్‌ కేంద్రాల వద్ద పకడ్బందీ ఏర్పాట్లు

కొవ్వూరు, మే 8: సార్వత్రిక ఎన్నికల సామగ్రి డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాల వద్ద పకడ్బందీ ఏర్పాటు చేపట్టాలని కలెక్టర్‌ కె.మాధవీలత అన్నారు. బుధవారం కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం నియోజకవర్గాల్లో డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాల ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. కొవ్వూరులో సంస్కృత ఉన్నత పాఠశాల, నిడదవోలులో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, గోపాలపురం బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల బాలికల పాఠశాలను కలెక్టర్‌ మాధవీలత అధికారులతో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ నెల 12న((పోలింగ్‌ ముందురోజు) ఎన్నికల సామగ్రి డిస్ట్రిబ్యూషన్‌ పంపిణీ, 13న (పోలింగ్‌ రోజు)న నిర్వహించవలసిన ఏర్పాట్లు, మౌలిక సదుపాయాలపై కార్యాచరణ సిద్ధం చేసుకోవాలన్నారు. పోలింగ్‌ విధులు నిర్వహించే ప్రిసైడింగ్‌ అధికారులు, సహాయ ప్రిసైడింగ్‌ అధికారులకు రూట్‌ ప్రకారం పోలింగ్‌ మెటీరియల్‌ సరఫరా చేయడంలో ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలు, సూచనలు తప్పకుండా పాటించాలన్నారు. రూట్‌ ప్రకారం పోలింగ్‌ మెటీరియల్‌ వాహనాల ద్వారా తరలించే రూట్‌ మ్యాప్‌ను అడిగి తెలుసుకున్నారు. డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాల వద్ద ఏర్పాట్లపై సమీక్షించారు. 12వ తేదీ సాయంత్రంలోగా నిర్ధేశించిన పోలింగ్‌ కేంద్రాలకు మెటీరియల్‌ తరలింపు పూర్తిచేయాలన్నారు. 13న పోలింగ్‌ ముగిసిన తరువాత దివాన్‌చెరువు పరిధిలోని నన్నయ యూనివర్శిటీ ఆవరణలో నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూమ్‌లకు ఈవీఎంలను తరలించే క్రమంలో తీసుకోవలిసిన జాగ్రత్తలను తెలియజేశారు. కార్యక్రమంలో రిటర్నింగ్‌ అధికారులు కొవ్వూరు సబ్‌ కలెక్టర్‌ ఆశుతోష్‌ శ్రీవాస్తవ, గోపాలపురం ఆర్వో కేఎల్‌ శివజ్యోతి, నిడదవోలు ఆర్వో ఆర్‌వీ రమణనాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

  • పనితీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవు

గోపాలపురం, మే 8: ఎన్నికల విధి నిర్వహణలో నిర్లక్ష్యాన్ని సహించబోమని కలెక్టర్‌ కె.మాధవీలత అన్నారు. గోపాలపురంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబే డ్కర్‌ ఆశ్రమ పాఠశాలలో జరుగుతున్న పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ ప్రక్రియను ఆమె పరిశీలించారు. అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవ రికి అప్పగించిన పనిని వారు సమర్థవంతంగా పని చేయాలని, విధి నిర్వ హణలో నిర్లక్ష్యం వహించిన వారిని ఎన్నికల అనంతరం విధుల నుంచి తప్పిస్తామని మండిపడ్డారు. ప్రస్తుతం గోపాలపురం అసెంబ్లీ నియోజకవ ర్గంలో ఎన్నికల సిబ్బంది పనితీరు సక్రమంగా లేదన్నారు. అసంతృప్తి వ్యక్తం చేశారు. సిబ్బంది పనితీరులో లోపం ఎక్కడ ఉందో తనకు తెలుసునని, పని తీరు మార్చుకోకపోతే చర్యల తప్పవని కలెక్టర్‌ అన్నారు. అనంతరం పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు వేసిన మహిళా ఓటర్లతో ఆమె మాట్లాడుతూ బ్యాలెట్‌ ఓటు వేసి సంతోషంగా ఉన్నారా అంటూ అడిగి ఇదే స్ఫూర్తితో ఎన్నికలకు విధులు నిర్వర్తించాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ వెంట ఆర్‌వో కేఎల్‌ శివజ్యోతి, తహశీల్దార్‌ వనజాక్షి, డీటీ ఎస్‌.కృష్ణ, సిబ్బంది ఉన్నారు.

Updated Date - May 09 , 2024 | 12:13 AM